
గడిచిన నాలుగేళ్లలో 90 లక్షలకు పైగా నవీకరించిన(అప్‌డేట్) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు అయ్యాయి. వీటి ద్వారా కేంద్ర ఖజానాకు రూ.9,118 కోట్లు సమకూరినట్లు సోమవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పన్నుదారులు స్వచ్ఛందంగా వివరాలు దాఖలు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించినట్లు తెలిపారు. 2022లో అదనపు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా సంబంధిత మదింపు సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు నవీకరించిన ఐటీ రిటర్న్‌లు(ఐటీఆర్-యూ) దాఖలు చేసే అవకాశాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు.
ఫైనాన్స్ బిల్లు, 2025 ద్వారా అప్‌డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయడానికి కాలపరిమితిని సంబంధిత మదింపు సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వరకు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో (2024-25) ఫిబ్రవరి 28 వరకు 4.64 లక్షల అప్‌డేటెడ్ ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయని, అందుకు రూ.431.20 కోట్ల పన్నులు చెల్లించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి కార్ల ధరలు అప్
ఆయన తెలిపిన వివరాల ప్రకారం..2023-24 ఆర్థిక సంవత్సరంలో 29.79 లక్షల ఐటీఆర్-యూలు దాఖలు కాగా రూ.2,947 కోట్ల అదనపు పన్నులు చెల్లించారు. 2022-23, ఏవై(అసెస్‌మెంట్ ఇయర్-మదింపు సంవత్సరం) 2021-22 సంవత్సరాల్లో వరుసగా 40.07 లక్షలు, 17.24 లక్షల అప్‌డేటెడ్ ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. వాటిల్లో అదనంగా రూ.3,940 కోట్లు, రూ.1,799.76 కోట్ల పన్నులు చెల్లించారు. 2021-22 నుంచి 2024-25 మధ్య కాలంలో 91.76 లక్షల ఐటీఆర్-యూలు దాఖలు కాగా, ప్రభుత్వానికి రూ.9,118 కోట్ల అదనపు పన్నులు వచ్చాయి.