ఎంట్రీలు పడుతున్నాయ్‌.. బీ రెడీ! | Complete Analysis On Form 26 Tax Audit | Sakshi
Sakshi News home page

ఎంట్రీలు పడుతున్నాయ్‌.. బీ రెడీ!

Published Mon, Jun 17 2024 10:15 AM | Last Updated on Mon, Jun 17 2024 10:40 AM

Complete Analysis On Form 26 Tax Audit

గతవారం వరకు వరుసగా అన్ని ఐటీఆర్‌ ఫారాలను గురించి తెలుసుకున్నాం. ఎన్ని ఫారాలు ఉన్నాయి, ఎవరు ఏ ఫారం వేయాలి మొదలైన విషయాలు తెలుసుకున్నాం. ఇక గడువుల విషయం చూస్తే  వేతన జీవులు, ట్యాక్స్‌ ఆడిట్‌ వర్తించని వారికి గడువు తేదీ 31 జూలై 2024. ఇతరులకు గడువు తేదీ 30–09–2024. ఈ కాలమ్‌ను ప్రతివారం చదివి అనుసరించే వారికి వచ్చే నెలాఖరు గడువు. ఇప్పుడిప్పుడే అన్ని కార్యాలయాల్లో అధికారులు వారి వారి విధులు నిర్వహించడాన్ని పూర్తి చేస్తున్నారు.

అంటే డిస్‌బర్సింగ్‌ అధికార్లు, డిడక్టింగ్‌ అధికార్లు, పన్ను రికవరీ చేయడం, ఆ పన్ను మొత్తాల్ని గవర్నమెంట్‌ ఖాతాకి చెల్లించడం, ఆ తర్వాత ఫారాలు 16 అలాగే 16 అ తయారు చేసి జారీ చేయడం, టీడీఎస్‌ రిటర్నులు ఆదాయపు పన్ను శాఖ వారికి దాఖలు చేయడం మొదలైనవి జరుగుతున్నాయి. ఈ అధికార్ల జాబితాలో మీ యాజమాన్యం, బ్యాంకులు, పన్ను రికవరీ చేసే ఇతర అధికార్లు ఉన్నారు. ఆలస్యం కావచ్చు. ఏవో ఇబ్బందులు ఏర్పడవచ్చు.

వీటిని ఆధారంగా చేసుకుని డిపార్టుమెంటు వారు తమ సైటులో మీ వివరాలను పొందుపరుస్తారు. వీటినే ఫారం 26 అ, అఐ అంటారు. వీటిలో పద్దులు పడకపోతే, మీరు రిటర్నులు వేయలేరు. అంటే సమాచారం పూర్తిగా లభ్యమవదు. సాధారణంగా ఈ ఫారాల్లోని సమాచారం సంపూర్ణమైనది, సమగ్రమైనది, సరైనది, కచ్చితమైనది, నమ్మతగ్గది. అయితే, తప్పులు సహజం. మీరు, ముందు ఈ రెండింటిలోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చెక్‌ చేయండి.

మీకు సంబంధించినది కాకపోతే విభేదించండి. అభ్యంతరాలను తెలియజేయండి. అలా జరిగిన వెంటనే డిపార్టుమెంటు వారు సంబంధిత అధికార్లతో సంప్రదింపులు జరిపి, సరిదిద్దుతారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీకు రెస్పాన్స్‌ రాకపోతే, గడువు తేదీలోపల రిటర్ను వేయటం మాత్రం మానేయకండి. ఆ తర్వాతైనా సర్దుబాట్లు జరగవచ్చు. మిస్‌మ్యాచ్‌కు మరొక కారణం.. డబుల్‌ ఎంట్రీ. అంటే ఒక వ్యవహారం రెండు సార్లు నమోదు కావడం. మీరు ఒకదాన్నే పరిగణనలోకి తీసుకోండి.

మరీ చిత్రమైన విషయం ఒకటుంది. ఈ మధ్య ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులు వారి ఉమ్మడి ఆస్తిని అమ్మగా ఆ విక్రయాల గురించి ముగ్గురి  అఐ లలోనూ ఎంట్రీలు కనబడ్డాయి. ఆస్తి అమ్మకం విలువ రు. 4 కోట్లు. ముగ్గురి ‘సమాచారం’లోనూ రూ. 4 కోట్లు అని పడింది. కానీ, జరిగింది ఒకే లావాదేవీ. దాని విలువ రూ. 4 కోట్లు. ఏ స్థాయిలో ఈ తప్పు జరిగిందో కాని రికార్డుల్లో ఎంట్రీలు మూడింతలు పడ్డాయి. ఇటువంటివి జరిగే అవకాశం ఉంది.

అలాగే జాయింటుగా ఉన్న బ్యాంకు అకౌంట్లోకి వచ్చే బ్యాంకు వడ్డీ, దాని మీద వడ్డీ, ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్త వహించండి. ఎంట్రీల్లోని తప్పులను మీకు అనుకూలంగా మల్చుకోకండి. ఒక సమాచారం ఏదేని  అఐ లో పడకపోయినా, దాన్ని ఆసరాగా తీసుకుని ఆ ఆదాయం లేదా వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మర్చిపోకండి. ఈ సంవత్సరం ఫైలింగ్‌ మొదలెట్టవచ్చు. రెడీ అవ్వండి. – కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement