
మార్కెటింగ్ కోసం కంపెనీల కొత్త రూట్
కస్టమర్లకు ఆఫర్లు, సేవలతో పాటు బ్రాండింగ్
టెలికం సంస్థలకు అదనపు ఆదాయం
వీఐ, జియో హవా.. త్వరలో బరిలోకి ఎయిర్‌టెల్
హీటెక్కనున్న టారిఫ్ వార్...
మీకు అతి తక్కువ వడ్డీ రేటుకే ప్రీ–అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్. ఇప్పుడే దరఖాస్తు చేయండి..
మా ప్రోడక్టులపై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. వెంటనే షాపింగ్ చేసి, పండుగ చేస్కోండి..
గేమ్ స్టార్ట్ చేసేందుకు రూ. 3,000 స్పెషల్ క్యాష్‌బ్యాక్ కూపన్ రెడీగా ఉంది. యాప్ డౌన్‌లోడ్ చేసి, ఆటాడుకోండి..
ఫోన్‌లో.. వాట్సాప్‌లో ఈ మధ్య పోలోమంటూ వస్తున్న ఇలాంటి మెసేజ్‌లను గమనిస్తున్నారా?
కంపెనీలు తమ ప్రొడక్టులు, సర్వీసులను నేరుగా కస్టమర్ల చెంతకు తీసుకెళ్లేందుకు ఈ కొత్త మార్కెటింగ్ రూట్‌ను ఎంచుకుంటున్నాయి. మనక్కూడా వీటి వల్ల కొన్నిసార్లు ఉపయోగం ఉన్నప్పటికీ.. పదేపదే వచ్చే ఇలాంటి అనవసర మెసేజ్‌లతో ఒక్కోసారి విసుక్కోవడం కూడా కామన్‌గా మారింది. అయితే, టెలికం కంపెనీలకు మాత్రం ఇవి కాసులు కురిపిస్తున్నాయి. దీంతో ఎంటర్‌ప్రైజ్ లేదా బిజినెస్ మెసేజింగ్.. టెల్కోలకు సరికొత్త ఆదాయ వనరుగా నిలుస్తోంది.
వినియోగదారులతో మరింత బాగా మమేకం అయ్యేందుకు కంపెనీలు ఇప్పుడు సంప్రదాయ టెక్ట్స్ మెసేజ్‌ల స్థానంలో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్‌సీఎస్) బాట పట్టాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం దూసుకెళ్తుండటం.. వాట్సాప్ వాడుతున్న వారు కోట్లలో ఉండడంతో బిజినెస్ మెసేజింగ్ టెల్కోలను ఊరిస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్లో వొడాఫోన్ ఐడియా (వీఐ), రిలయన్స్ జియో హవా నడుస్తోంది. త్వరలోనే భారతీ ఎయిర్‌టెల్ కూడా బరిలోకి దూకే సన్నాహాల్లో ఉంది. దీంతో మార్కెట్ వాటాను కొల్లగొట్టేందుకు టెలికం ఆపరేటర్ల మధ్య పోటీ పెరిగి, టారిఫ్ వార్‌కు తెరతీయనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
గూగుల్, వాట్సాప్ ద్వారా...
ఆర్‌సీఎస్ బిజినెస్ మెసేజింగ్ (ఆర్‌బీఎం) ద్వారా తమ బ్రాండింగ్, మార్కెటింగ్ మెసేజ్‌లను పేంపేందుకు, అలాగే చాట్‌బాట్ తరహాలో కస్టమర్లతో ఇంటరాక్ట్ అయ్యేందుకు టెల్కోల విస్తృత నెట్‌వర్క్ వీలు కల్పిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో సాధారణ ఎస్‌ఎంఎస్ చాట్ స్థానంలో గూగుల్ ఈ ఆర్‌సీఎస్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇక వాట్సాప్ బిజినెస్ మెసేజింగ్ సర్వీస్ దీనికి తీవ్ర పోటీ ఇస్తోంది. ఆర్‌సీఎస్ మార్కెటింగ్ మెసేజ్‌లను పంపడం ద్వారా కస్టమర్లకు చేరువ కావాలనుకునే కంపెనీలకు అగ్రిగేటర్లు దన్నుగా నిలుస్తున్నారు.
డాట్‌గో, రూట్ మొబైల్, సించ్, ఇన్ఫోబిప్ వంటి కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ (సీపాస్) ప్రొవైడర్లు ఆర్‌సీఎస్‌కు కావలసిన సాంకేతిక సహకారం, సేవలు అందిస్తున్నాయి. అంటే జియో, వీఐ నెట్‌వర్క్ ద్వారా కస్టమర్లకు వివిధ కంపెనీల బ్రాండ్, మార్కెటింగ్ మెసేజ్‌లను చేరవేస్తున్నాయి. బేసిక్ టెక్ట్స్ ఆర్‌సీఎస్ మెసేజ్‌లకు కంపెనీల నుంచి టెల్కోలు 15 పైసలు చొప్పున వసూలు చేస్తుండగా.. షాపింగ్, యాప్ డౌన్‌లోడ్స్, లోన్ దరఖాస్తులకు వీలు కల్పించే ఇంటరాక్టివ్ మెసేజ్‌లకు 35 పైసల దాకా చార్జీ విధిస్తున్నాయి.
వీటి ప్రత్యేకతేంటి?
సాధారణ టెక్ట్స్ మెసేజ్‌లతో పోలిస్తే, ఆర్‌సీఎస్‌లు చాలా భిన్నం. కస్టమర్లు తమ మెసేజ్‌లను తెరిచారా లేదా.. తెరిచిన తర్వాత ఎలా స్పందించారు వంటివన్నీ బ్రాండ్ తెలుసుకునేందుకు ఆర్‌సీఎస్‌లు వీలు కల్పిస్తాయి. ఆర్‌సీఎస్‌ల డెలివరీ రేట్ మన దేశంలో 98% ఉందని, చదివే శాతం 40% కాగా, రెస్పాన్స్ రేట్ 6% ఉన్నట్లు అంచనా. వీటిపై వెచి్చంచే వ్యయంతో పోలిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండటంతో కంపెనీలు ఆర్‌సీఎస్ పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఆర్‌బీఎం సర్వీస్‌లో వీఐ ముందంజలో ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు నెలకు 100 కోట్ల ఆర్‌సీఎస్ మెసేజ్‌లను వీఐ ఆపరేట్ చేస్తోంది. ఆర్నెల్ల క్రితం ఈ సర్వీసులను ప్రారంభించిన జియో కూడా జోరు పెంచింది. ఎయిర్‌టెల్ రంగంలోకి దూకితే పోటీ పెరిగి చార్జీలు తగ్గే అవకాశం ఉందని డాట్‌గో సీఈఓ ఇందర్‌పాల్ మమిక్ పేర్కొన్నారు.
ఊరిస్తున్న మార్కెట్...
దేశంలో మారుమూల పల్లెల్లో కూడా స్మార్ట్ ఫోన్ వాడకం శరవేగంగా దూసుకెళ్తోంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో 66 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ యూజర్లున్నారు. ఇందులో అత్యధికంగా ఆండ్రాయిడ్ ఫోన్లే. కాగా, స్మార్ట్ ఫోన్ల జోరుతో గత రెండేళ్లుగా ఆర్‌సీఎస్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందిందని రూట్ మొబైల్ వైస్ ప్రెసిడెంట్ తుషార్ అగి్నహోత్రి చెప్పారు. 2023లో 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ 2028 నాటికి 3.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్‌నర్ లెక్కగట్టింది. ప్రస్తుతం యాపిల్ ఐఓఎస్‌లో ఆర్‌సీఎస్ మెసేజ్‌లకు సపోర్ట్ లేదని, అదికూడా అందుబాటులోకి వస్తే కంపెనీల మార్కెటింగ్ ఇంకా విస్తృతం అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
3.2 బిలియన్ డాలర్లు: 2028 నాటికి భారత్‌లో బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ అంచనా. 2023లో ఇది 1.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
100 కోట్లు: ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా నెలకు ఆపరేట్ చేస్తున్న ఆర్‌సీఎస్ ఎస్‌ఎంఎస్‌ల సంఖ్య
15 పైసలు: బేసిక్ టెక్ట్స్ ఆర్‌సీఎస్‌లకు కంపెనీల నుంచి టెల్కోలు వసూలు చేస్తున్న టారిఫ్. ఇంటరాక్టివ్ ఆర్‌సీఎస్ ఎస్‌ఎంఎస్‌లకు 35 పైసలు వరకు చార్జీ విధిస్తున్నారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment