Revenue sources
-
‘బుల్లెట్’లా.. రైల్ కార్గో!
సాక్షి, అమరావతి: కొత్త ఆదాయ వనరులను పెంపొందించుకునే ప్రణాళికలో భాగంగా రాష్ట్రం నుంచి రైల్ కార్గో అవకాశాలను విస్తరించడంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ఏడాది విజయవాడ డివిజన్ రికార్డుస్థాయిలో కార్గో రవాణా చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే తాజాగా .. గ్రానైట్, ఫ్లైయాష్ రవాణా చేసేందుకు ఉన్న అవకాశాలను చేజిక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. సత్ఫలితాలిస్తున్న బీడీయూ.. రైల్ కార్గో టర్నోవర్‌ను పెంపొందించుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు (బీడీయూ) ఏర్పాటు చేసింది. డివిజన్‌స్థాయి, క్షేత్రస్థాయిలో ఈ బీడీయూల ద్వారా వ్యవసాయ, పారిశ్రామికవర్గాలతో సమావేశమవుతోంది. రోడ్డు మార్గంలో వస్తు రవాణా చేస్తున్న వ్యాపార సంస్థలు, ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. రైల్ కార్గో రవాణా ద్వారా తాము అందిస్తున్న రాయితీలను వివరిస్తూ వ్యాపార అవకాశాలను పెంపొందించుకుంటోంది. రైతు సంఘాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు కేంద్ర రైల్వే శాఖ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన కిసాన్ రైళ్ల సౌలభ్యంపై అవగాహన కల్పిస్తోంది. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను రవాణా చేస్తే ఫ్రైట్ చార్జీల్లో 50శాతం రాయితీ ఇస్తూ.. సానుకూల ఫలితాలను రాబట్టింది. రికార్డు స్థాయిలో రైల్ కార్గో.. 50 శాతం రాయితీతో కిసాన్ రైళ్లు ప్రవేశపెట్టడంతో రైల్ కార్గో రవాణా రికార్డుస్థాయిలో పెరిగింది. మామిడి, ఉల్లిపాయలు, ఆక్వా, డెయిరీ ఉత్పత్తులు, కూరగాయలు, ఇతర పండ్లు రికార్డు స్థాయిలో రవాణా చేశారు. 2020–21లో విజయవాడ డివిజన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఏకంగా 40,121 మెట్రిక్ టన్నుల రవాణా చేయగా.. 2021–22లో సెప్టెంబర్ 15నాటికే 9,810 మెట్రిక్ టన్నులు రవాణా చేశారు. ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, గువహతి, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు ఎక్కువుగా రవాణా చేశారు. కిసాన్ రైళ్లలో కాకుండా ఇతర రైళ్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మరో 1,060 మెట్రిక్ టన్నులు రవాణా చేశారు. పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు ప్రణాళిక.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజయవాడ డివిజన్ నుంచి పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాపై దృష్టి సారించారు. ప్రధానంగా గ్రానైట్, ఫ్లైయాష్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు ఒంగోలు జిల్లా నుంచి భారీస్థాయిలో గ్రానైట్‌ను, థర్మల్ ప్లాంట్ల నుంచి ఫ్లైయాష్‌ను రవాణా చేసేందుకు.. రోడ్డు మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం వాటిని రైళ్ల ద్వారా రవాణా చేసేందుకు రైల్వే అధికారులు జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. వారానికి ఐదు ర్యాక్‌ల చొప్పున గ్రానైట్, ఫ్లైయాష్ రవాణా చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. -
పైసలందనిదే ఫైలు ముట్టరు!
ఆర్ కార్డుల జాబితాల్లో తప్పులే ఆయన ఆదాయ వనరులు తప్పు తీవ్రతను బట్టి వేలు నుంచి లక్షలు డిమాండ్ ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు ఇదీ స్టీల్‌ప్లాంట్ సబ్ ఎంప్లాయ్మెంట్ అధికారి తీరు తమ్మినాన రామయ్య స్టీల్‌ప్లాంట్ నిర్వాసితుడు. ఇంటికో ఉద్యోగం హామీలో భాగంగా ప్రభుత్వం అతనికి ఆర్.కార్డు మంజూరు చేసింది. వయసు దాటినా ఉద్యోగం రాలేదు. దాంతో బీటెక్ చేసిన తన కుమారుడు జయప్రకాష్‌కు తన ఆర్.కార్డును బదిలీ చేయించాడు. కొడుక్కి ప్లాంట్‌లో ఉద్యోగం రావాలంటే ఆర్.కార్డు ఆధారంగా స్టీల్‌ప్లాంట్ సబ్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో అతని పేరు నమోదు చేయించాలి. దానికి ఎప్పుడో సెప్టెం బర్‌లోనే దరఖాస్తు చేశారు. మహా అయితే.. రెండుమూ డు రోజుల్లో ఆ పని పూర్తి అవ్వాలి. కానీ అలా జరగలేదు.. ఎంప్లాయ్మెంట్ అధికారి సైంధవుడిగా అడ్డుపడ్డారు.. రకరకాల సాకులు చెబుతూ ఎనిమిది నెలలు కాలయాపన చేశా రు. చివరికి అసలు విషయానకొచ్చారు. రూ.8 లక్షలు ఇస్తేనే పని అవుతుందని తేల్చేశారు. అంత ఇచ్చుకోలేనని రామయ్య అనడంతో.. బేరసారాలు మొదలయ్యాయి.. రూ.5 లక్షలు.. రూ. 2 లక్షలు.. ఇలా చివరికి రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. కథ అక్కడే అడ్డం తిరిగింది.. ఈ బేరసారాలతో విసిగిపోయిన రామయ్య ఏసీబీకి ఉప్పందించారు. ఇంకేముంది.. సొమ్ములందుకుంటూ ఎంప్లాయ్మెంట్ అధికారి ఉచ్చులో ఇరుక్కున్నారు. గాజువాక: లంచాలు డిమాండ్ చేయడం.. ముక్కు పిండి వసూలు చేయడం.. ఈ అధికారికి కొత్త కాదు. అసలాయన స్టయిలే అది. పైసలందనిదే ఫైలు ముట్టరు. ఉన్నతాధికారుల ఉత్తర్వులంటే లెక్కేలేదు. ఎవరెన్ని ఆదేశాలిచ్చినా.. తనకో పద్ధతి ఉందంటారు. గట్టిగా మాట్లాడితే డేటా లేదనో.. ఇంకేదో లేదనో కొర్రీలు వేసి తిప్పించుకోవడం ఆయనకు అలవాటు. ఏసీబీ ట్రాప్‌లో మంగళవారం అడ్డంగా దొరికిపోయిన స్టీల్‌ప్లాంట్ సబ్ ఎంప్లాయిమెంట్ అధికారి పి.ఎం.సతీష్‌కుమార్ బాధితులు రామయ్యతోపాటు ఇంకెందరో ఉన్నారు. ఆర్ కార్డుల జాబితాల్లో దొర్లిన తప్పులు, పొరపాట్లను ఆయన తన అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకున్నారని నిర్వాసితులు ఎప్పట్నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ భూసేకరణ విభాగం అధికారులు నిర్వాసితుల ఆర్ కార్డులను వారి వారసులకు బదిలీ చేసినా.. వాటిని ఇక్కడి ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో నమోదు చేయడానికి ఇక్కడి అధికారి వేలు.. లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కొత్త కాదు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సైతం ఈ విషయాన్ని నిర్థారించారు. గత మూడేళ్ల కాలంలో ఈ అధికారి తీరుతో నిర్వాసితులు తీవ్ర ఆర్థిక భారం మోయాల్సి వచ్చిందని మంగళవారంనాటి సంఘటనతో స్పష్టమవుతోంది. స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు డబ్బులు ఇచ్చుకోలేని అనేకమంది నిర్వాసితులు నెలల తరబడి తిరిగి చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ ఆస్తులను తనఖా పెట్టో, తలకు మించిన వడ్డీలకు అప్పులు తెచ్చో ముడుపులు చెల్లిస్తున్నారు. లంచాలు ఇవ్వని 40 రిజిస్ట్రేషన్లు పెండింగ్: ఎంప్లాయ్మెంట్ అధికారి డిమాండ్ చేసినంత సొమ్ము ఇచ్చుకోలేక రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 40 మందికి పైగానే ఇంకా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. 35 ఏళ్ల క్రితం ఉక్కు భూసేకరణ అధికారులు జారీ చేసిన ఆర్ కార్డుల రికార్డులు ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్నాయి. భూసేకరణ కార్యాలయంలో డేటా కనిపించకపోవడం, డౌట్ఫుల్ జాబితాల్లో ఉండటం, కార్డుదారుల పేర్లలో రకరకాల తప్పులు చోటు చేసుకోవడంవంటి సమస్యలు తెలిసిందే. ఆ జాబితాను భూసేకరణ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు, ఇక్కడి సబ్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి కూడా పంపించారు. ఈ జాబితానే సతీష్‌కుమార్ తనకు వరంగా మలచుకున్నారు. భూసేకరణ విభాగం అధికారులు కోరిన సమాచారాన్ని అందజేసి తప్పులను సరిచేసుకొని ఆర్ కార్డులను మార్చుకొని ఇక్కడికి వచ్చినా.. డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకొనే పరిస్థితి లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలున్నాయి. తనకు జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి వచ్చిన జాబితాలో సంబంధిత ఆర్ కార్డు డేటా సరిగ్గా లేదని, అందువల్ల దాన్ని నమోదు చేయలేమంటూ తొలుత తిప్పి పంపడం, ఆ తరువాత డ బ్బులు తీసుకొని పని పూర్తి చేయడం ఈ అధికారికి పరిపాటిగా మారిందన్న ఆరోపణలు తీవ్రంగానే ఉన్నా యి. కార్డులో దొర్లిన తప్పు తీవ్రతనుబట్టి రూ.15 వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు పాపం పండింది. ఆ అధికారి ఏసీబీకి దొరికిపోయారని నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు తనఖాపెట్టి నగదు ఇచ్చా: తనకు అంత పెద్ద మొత్తంలో లంచం ఇవ్వగలిగే స్తోమత లేకపోయినా తన కుమారుడి భవిష్యత్తు కోసం ఉన్న ఒక్క ఇంటిని తనఖా పెట్టి డబ్బులు అప్పు తెచ్చానని బాధితుడు టి.రామయ్య పేర్కొన్నాడు. స్టీల్‌ప్లాంట్ కోసం సర్వం కోల్పోయిన తమను అధికారులు ఇలా ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించానని చెప్పారు. -
ఆదాయ వనరులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పన్నుల ద్వారా వచ్చే ఆదాయ వనరులను పెంచేందుకు విప్లవాత్మకమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పన్నులు ఎగవేసే అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో వాణిజ్యపన్నుల శాఖ పనితీరుపై సీఎం సమీక్షించారు. వాణిజ్యపన్నుల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను పరిశీలించారు. జీరో వ్యాపారం, పన్ను ఎగవేత, తక్కువ పన్ను చెల్లించి ఎక్కువ వ్యాపారం చేయడం వంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. తెలంగాణకు ఉన్న నాలుగు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులున్నాయని, వాటిని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీతో సరిహద్దుల్లోని 7 చెక్‌పోస్టులకు భవనాలు లేవని, రోడ్లపైనే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని సీటీ శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చెక్‌పోస్టులకు ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడి లీజు పద్ధతిన భూమి తీసుకొని చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. రెండు చెక్‌పోస్టులకు భూమి అందుబాటులో ఉందని అధికారులు పేర్కొనగా, వెంటనే పనులు జరిగేలా చూసేందుకు నిధులు కేటాయిస్తామని సీఎం చెప్పారు. వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగాల నియామకానికి ఇప్పటికే అనుమతిచ్చామని, ఇంకా ఖాళీలు ఉంటే వాటిని కూడా భర్తీ చే స్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ వి.అనిల్ కుమార్, అదనపు కమిషనర్లు చంద్రశేఖర్‌రెడ్డి, రేవతి రోహిణి (ఎన్ఫోర్స్మెంట్)తో పాటు సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, శాంతికుమారి హాజరయ్యారు. -
ఆదాయ వనరులు పుష్కలం.. అభివృద్ధి చేయండి
సీఎంకు వివరించిన కలెక్టర్ జానకి నెల్లూరు సాక్షి, ప్రతినిధి: నెల్లూరు జిల్లాలో ఆదాయవనరులు పుష్కలంగా ఉన్నాయి. అన్నిరంగాలపై దృష్టిపెడితే జిల్లా మరింత ప్రగతి సాధించే అవకాశం ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్ జానకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పలు ప్రతిపాదనలు చేశారు. విజయవాడలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ముందుగా సూచించిన మేరకు ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసి తీసుకురావాలని ఆయా జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బుధవారం సీఎంతో సమావేశమైన కలెక్టర్ జానకి ‘జిల్లా మత్స్య ఉత్పత్తులకు నెలవు. ఈ సంవత్సరం సుమారు రూ.1,200 కోట్ల టర్నోవర్ జరిగింది. మత్స్య పరిశ్రమను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. అందుకోసం విరివిగా కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటుచేయాలి. అదేవిధంగా చేనేత ఉత్పత్తులకు జిల్లా దేశస్థాయిలో ప్రసిద్ధి చెందింది. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించడంతో పాటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో విద్యుత్, నీరు సరఫరా చేసి పరిశ్రమలు అభివృద్ధిచేయాలి. పులికాట్, నేలపట్టు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఆ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.’ అని కలెక్టర్ జానకి సీఎం చంద్రబాబునాయుడికి వివరించారు. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. -
నగర పంచాయతీల్లో పన్నుల మోత!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి కొత్త ప్రభుత్వం మార్గాలు అన్వేషిస్తోంది. వీటి పరిధిలో ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల మోత మోగించాలని నిర్ణయించింది. ఆయా పురపాలక సంఘాల్లో అభివృద్ధికయ్యే నిధులను స్థానికంగా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పన్నుల వడ్డనకు ప్రతిపాద నలు రూపొందిస్తోంది. దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన బడంగ్‌పేట, పెద్ద అంబర్‌పేట, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీల ప్రజలపై పన్నుల భారం పడనుంది. ఆస్తిపన్ను, బెటర్మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను సహా పలు కేటగిరీల టాక్సులపై ప్రతిపాదనలు పంపాలని నగర పంచాయతీల కమిషనర్లకు రాష్ట్ర పురపాలకశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పన్నుల పెంపుపై పురపాలికల యంత్రాంగం తర్జనభర్జనలు పడుతోంది. నాలుగు నగర పంచాయతీల పరిధిలో సాలీనా రూ.10 కోట్ల ఆదాయం రాకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం.. పన్ను అసెస్మెంట్ పరిధిలోకి రాని కట్టడాలపై దృష్టి సారించాలని ఆదేశించింది. భారమే.. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలుగా ఉండి... ఇటీవల నగర పంచాయతీలుగా ఏర్పడిన ఈ ప్రాంత ప్రజలపై వివిధ రకాల పన్నుల మోత మోగనుంది. కేవలం ఒకట్రెండు పన్నులు చెల్లింపుతో మమ అనిపించే స్థానికులు ఇకపై అనేక రూపాల్లో పన్నులు చెల్లించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను, బెటర్మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను తదితరాల మదింపుపై పురపాలక సంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూలు కావడంలేదు. ఈ నేపథ్యంలో అన్ అసెస్డ్ ప్రాపర్టీలను గుర్తించడం ద్వారా రాబడి పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నాయి. అంతే కాకుండా పన్నుల నిర్ధారణలో హేతుబద్ధత పాటించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించిన క్రమంలో... ప్రతి ఇంటి నీ సర్వే చేయాలని నిర్ణయించింది. పంచాయతీలతో పోలిస్తే నివాస గృహాలపై ఆస్తిపన్ను భారం రెట్టింపు కానుంది. అదేసమయంలో వాణిజ్య భవనాల టాక్సులు గణనీయంగా పెరిగే అవకాశముంది. పంచాయతీలతో పోలిస్తే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు అడ్డగోలుగా పెరిగాయని ఆందోళనతో ఉన్న స్థానికులకు తాజా ప్రతిపాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా, పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల పెంపే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. -
సీమాంధ్రలో ఆదాయ వనరులు తక్కువ
తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమవతి విజయనగరం ఫూల్‌బాగ్, న్యూస్‌లైన్ : తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమవతి అన్నారు. పట్టణంలోని అశోక్ బంగ్లాలో శుక్రవారం టీడీపీ జిల్లాస్థాయి ‘మినీ తెలుగునాడు’జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 40 శాతం విస్తీర్ణం ఉన్న తెలంగాణ ప్రాంతానికి 60 శాతం ఆదా య వనరులు ఉంటే, 60 శాతం విస్తీర్ణం ఉన్న సీమాంధ్ర ప్రాంతానికి 40 శాతం మాత్రమే ఆదాయ వనరులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు లాంటి అనుభవజ్జుడైన ముఖ్యమంత్రి అవసరం సీమాంధ్రకు ఉం దని చెప్పారు. దేశానికి నరేంద్రమోడీ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు ఆమె ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్. కోట, నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం, చీపురు పల్లి, పార్వతీపురం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయు డు, మీసా ల గీత, కె.ఎ. నాయుడు, కిమిడి మృణాళిని, బొబ్బిలి చిరంజీవులు, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి శోభాస్వాతీరాణి, టీడీపీ జిల్లా కార్యదర్శి ఐవీ పీ రా జు, బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి తెంటు లక్ష్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పైసా ఖజానాకు చేరాలి: నరసింహన్
ప్రత్యేక చర్యలకు అధికారులకు గవర్నర్ ఆదేశం ఏ పథకం, కార్యక్రమం ఆగరాదని సూచన ఆదాయంలో రూ.20వేల కోట్ల తగ్గుదల ఉందన్న అధికారులు సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో పేర్కొన్న ప్రతిపైసా ఖజానాకు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అధికారులను ఆదేశించారు. ఇటు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులను నూటికి నూరుశాతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్ర పన్నుల నుంచి రావాల్సిన మొత్తాలను రాబట్టాలని, ఇందుకోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పన్నులకు సంబంధించిన మొత్తం బకాయిలను పైసాతో సహా వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఏ పథకం, కార్యక్రమాలు ఆగరాదని, ఎప్పటిలాగానే అవన్నీ కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వనరులపై గవర్నర్ శనివారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. - నిర్ధారించిన సమయంలో అంటే మార్చి నెలాఖరులోగా బడ్జెట్లో పేర్కొన్న మేరకు ఆయా రంగాల నుంచి ఆదాయాన్ని రాబట్టి తీరాలని ఆదేశించారు. - ఆదాయ వనరులను సమకూర్చే శాఖల అధికారులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తామన్నారు. - అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల విస్తీర్ణాన్ని వెంటనే లె క్కించి నిబంధనల మేరకు రైతులకు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. - రాష్ట్ర ఆర్థిక ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్, ఆదాయ వనరులు, వ్యయం వివరాలతో ప్రత్యేకంగా గవర్నర్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో రూ.40 వేల కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.29 వేల కోట్లే వచ్చాయని, రూ.10 వేల కోట్లు తగ్గుదల ఉందని పేర్కొన్నారు. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయ శాఖల ద్వారా మార్చి నెలాఖరుకు రూ.80 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.70 వేల కోట్లే వచ్చాయని, ఇందులో రూ.10 వేల కోట్ల తగ్గుదల ఉందని అధికారులు వివరించారు. అత్యవసరాలకే చెల్లింపులు: ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగియనున్నందున నిధుల వ్యయంపై ఆర్థిక శాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆర్థిక సంవత్సరాన్ని రెవెన్యూ లోటుతో ముగిస్తే గత తొమ్మిదేళ్ల ఆర్థిక క్రమశిక్షణ తప్పినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనల ప్రకారం ప్రభుత్వం రెవెన్యూ మిగుల్లో ఉండాలి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి రెవెన్యూ లోటు కొనసాగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రూ.800 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్లు తెలిసింది. అందువల్ల ఇప్పటినుంచే వ్యయాన్ని కట్టడి చేయకపోతే మార్చి నెలాఖరుకు రెవెన్యూ మిగుల్లోకి రావడం కష్టమేనని ఓ అధికారి అన్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన పన్నులవాటా నుంచి గ్రాంట్ల రూపంలో రాబడి తగ్గిపోవడంతో నిధుల లభ్యత తగ్గింద న్నారు. ఇది ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీతభత్యాలు, అత్యవసరాలు, ఎన్నికలకు సంబంధించిన వాటికే నిధులను విడుదల చేయాలని, మిగతా రంగాలకు నిలుపుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.