సీమాంధ్రలో ఆదాయ వనరులు తక్కువ
తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమవతి
విజయనగరం ఫూల్‌బాగ్, న్యూస్‌లైన్ : తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమవతి అన్నారు. పట్టణంలోని అశోక్ బంగ్లాలో శుక్రవారం టీడీపీ జిల్లాస్థాయి ‘మినీ తెలుగునాడు’జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 40 శాతం విస్తీర్ణం ఉన్న తెలంగాణ ప్రాంతానికి 60 శాతం ఆదా య వనరులు ఉంటే, 60 శాతం విస్తీర్ణం ఉన్న సీమాంధ్ర ప్రాంతానికి 40 శాతం మాత్రమే ఆదాయ వనరులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు లాంటి అనుభవజ్జుడైన ముఖ్యమంత్రి అవసరం సీమాంధ్రకు ఉం దని చెప్పారు.
దేశానికి నరేంద్రమోడీ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు ఆమె ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్. కోట, నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం, చీపురు పల్లి, పార్వతీపురం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయు డు, మీసా ల గీత, కె.ఎ. నాయుడు, కిమిడి మృణాళిని, బొబ్బిలి చిరంజీవులు, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి శోభాస్వాతీరాణి, టీడీపీ జిల్లా కార్యదర్శి ఐవీ పీ రా జు, బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి తెంటు లక్ష్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు.