అట్టుడుకుతున్న సీమాంధ్ర | Live updates: protests across Seemandhra over bifurcation of the state | Sakshi
Sakshi News home page

అట్టుడుకుతున్న సీమాంధ్ర

Published Fri, Oct 4 2013 11:34 AM | Last Updated on Mon, Jun 18 2018 8:13 PM

Live updates: protests across Seemandhra over bifurcation of the state

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర భగ్గుమంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్యవాదుల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి.

 

లైవ్ అప్డేట్స్ చూడండి.

కేంద్రమంత్రుల దిష్టి బొమ్మలపై కోడిగుడ్లు, టమోటాలతో దాడి
ఒంగోలు: విభజనపై కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఒంగోలు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించాలి. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను కార్పొరేషన్ ఉద్యోగులు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. కోల్కత్తా - చెన్నై జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. అలాగే జిల్లాలోని కనిగిరి చర్చ్ సెంటర్లో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. చంద్రబాబు పోస్టర్లను తగులబెట్టారు. పామూరు బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముక్కు కాశిరెడ్డి, వైఎమ్ ప్రసాద్ రెడ్డిలు నిరసన చేపట్టారు.

 

రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా: దేవినేని నెహ్రూ
విజయవాడ: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడంతో రాజకీయాలను నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్టానంతో ఏం డీల్ కుదుర్చుకున్నారో వెల్లడించాలని నెహ్రూ డిమాండ్ చేశారు. ఆ డీల్ వివరాలు సామాన్యులకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

యూపీఏ అధ్యక్షురాలు సోనియా ఏం చెప్పిందో మంత్రులు, ఎంపీలు వెళ్లడించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే విభజన నిర్ణయాన్న వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతం రెడ్డి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నగరంలోని వి.ఎం.రంగా విగ్రహం ఎదుట ఉన్న రహదారిపై వంగవీటి రాధా  రాస్తారోకో నిర్వహించారు. దాంతో బారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగర కాంగ్రెస్ కార్యాలయానికి ఆ పార్టీ కార్యకర్తలు తాళం వేశారు.

 

తెలంగాణ నోట్ను రాహుల్ చించెయాలి: కొణతాల
విశాఖపట్నం: నేరచరితుల ఆర్డినెన్స్ను చించేసిన రాహుల్ ... కేబినెట్లో పెట్టిన తెలంగాణ నోట్ను కూడా చించేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ శుక్రవారం అనకాపల్లిలో అభిప్రాయపడ్డారు. అలా చేయకుంటే రాహుల్ చరిత్ర హీనులవుతారని పేర్కొన్నారు. రాజకీయ సంక్షోభంతోనే సమైక్యాంధ్ర సాధ్యమవుతోందని రామకృష్ణ తెలిపారు.
 

ద్రాక్షారామంలో పిల్లి సుభాష్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష:
కాకినాడ: రాష్ట్ర విభజన ఆమోదాన్ని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్ష చేపట్టింది. కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, రామచంద్రాపురం, కాజులూరులలో సమైక్యవాదులు చేపట్టిన 72 గంటల బంద్ కొనసాగుతుంది.

అయితే తెలంగాణ ఏర్పాటు అనివార్యమవుతున్న నేపథ్యంలో...విభజనతో తలెత్తే సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని... సీఎం సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గతంలో చేసిన తీర్మానాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై..జేఎన్టీయూ విద్యార్దుల దాడి చేశారు. ఆ దాడిలో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమైనాయి. స్థానికంగా పరిస్తితి తీవ్ర ఉద్రిక్తం మారింది.
 

సోనియా ముందు సీమాంధ్ర కేంద్రమంత్రులు పిల్లులు:ఏపీఎన్జీవో నేత

రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర మంత్రులు సోనియా గాంధీ ముందు పిల్లుల్లా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వాళ్లను మళ్లీ గెలిపించే పరిస్థితి లేదని ఏపీ ఎన్జీవో నేత సత్యనారాయణ మండిపడ్డారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరై తిరిగి వెళ్తూ హయత్ నగర్ ప్రాంతంలో తెలంగాణ వాదుల రాళ్లదాడికి గురైన ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజ్యాంగ సంక్షోభం ద్వారానే విభజనను అడ్డుకోవాలని నాయకులకు సత్యానారాయణ పిలుపునిచ్చారు.

 

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి:
అనంతపురం: ప్రజా భయంతోనే టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఉదయం అనంతపురంలో తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ దాడిని ఆయన ఖండించారు. అనంతరం గుర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను దమ్ముంటే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్నాథరెడ్డి టీడీపీకి సవాల్ విసిరారు. జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లాలోని రాయదుర్గం బంద్కు జేఏసీ పిలుపు నిచ్చింది. అలాగే రామ్నగర్లోని రైల్వేగేట్ను సమైక్యవాదులు ధ్వంసం చేశారు. అనంతరం వారు రైలు పట్టాలపై నిరసన తెలిపారు. దాంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపైకి ఎక్కి సమైక్యవాదులు తమ ఆందోళన చేపట్టారు. విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. దాంతో బెంగళూరు - హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం


 

విజయనగరంలో ఎస్పీ వాహనం దగ్దం:

రాష్ట్ర విభజనపై నోట్ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ విజయనగరంలో  నిర్వహిస్తున్న బంద్ తీవ్ర ఉద్రికత్త పరిస్థితులకు దారితీసింది. శుక్రవారం ఉద్యమకారులు ఎస్పీ వాహనాన్ని తగులబెట్టారు. డీఎస్పీ వాహనాన్నీ ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. విద్యార్థులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి తరలివచ్చి నిరసన తెలిపారు.

 

వైఎస్ఆర్ కడప జిల్లా:
కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చిన 72 గంటల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కడప నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అంజాద్ బాషా, మాసీమ బాబ్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో బంద్ కొనసాగుతుంది. అలాగే రైల్వే కోడూరులో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు తీవ్రంగా జరుగుతోంది. వీటితోపాటు ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ బంద్ కొనసాగుతుంది. రాచమల్లు ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహిస్తున్నారు. పట్టణంలో జరగుతున్న బంద్కు ఏపీఎన్జీవోలు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు మద్దతు తెలిపాయి. వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పులివెందులలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా  రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.

 

సచివాలయంలోకి రాకపోకలు బంద్:

హైదరాబాద్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. శుక్రవారం నాడు వారు సచివాలయం మెయిన్ గేట్ వద్ద బైఠాయించి తమ నిరసన తెలిపారు. సచివాలయంలోకి రాకపోకలను వారు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత అడ్డదిడ్డంగా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.

 

రాజకీయాల నుంచి తప్పుకుంటున్న: రాయపాటి
న్యూఢిల్లీ: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గుంటూరు లోక్సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు శుక్రవారం వెల్లడించారు. తమను మభ్యపెట్టి    కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆమోదిస్తు కేంద్ర మంత్రి వర్గం నిన్న సాయంత్రం నిర్ణయం తీసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయపాటి సాంబశివరావు తెలిపారు.

 

శ్రీకాకుళం జిల్లా:
శ్రీకాకుళం: పాతపట్నంలోని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు క్యాంప్ కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం సమైక్యవాదులు ముట్టడించారు. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు.అనంతరం మంత్రి కార్యాలయానికి తాళాలు వేసి సమైక్యవాదులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే రణస్థలంలో సమైక్యవాదులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో  ఆంధ్ర - ఒరిస్పా సరిహద్దుల వద్ద వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

 

పశ్చిమగోదావరి జిల్లా:
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా 72 గంటల బంద్ కొనసాగుతోంది. జంగారెడ్డి గుడెంలో మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు సమైక్యవాదులు శుక్రవారం ఉదయం నరసాపురంలో యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రి  చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల దిష్టి బొమ్మలను దహనం చేశారు. పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కూడా బంద్ ప్రశాంతంగా సాగుతోంది. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 72 గంటల పాటు బంద్ జరుగుతోంది.తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ సీపీ నేత తోట గోపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం 57వ రోజుకు చేరాయి.

 

చిత్తూరు జిల్లా:
చిత్తూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లాలోని వరదాయపాలెం మండలం కడూర్ క్రాస్ రోడ్డు వద్ద సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. అందులోభాగంగా జాతీయ రహదారిపై ముళ్లకంచెలు వేసి రాస్తారోకో చేపట్టారు. దాంతో తిరుపతి-చెన్నై హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా 72 గంటల బంద్ ప్రశాంతంగా సాగుతోంది. అలాగే జిల్లాలో వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలకు స్వచ్ఛందంగా మూసివేశారు.

 

విజయనగరం జిల్లా:
విజయనగరం: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ విజయనగరం పట్టణంలో విద్యార్థులు శుక్రవారం కదం తొక్కారు. పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారాయణకు చెందిన కళాశాల,లాడ్జీపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. దాంతో కళాశాల కిటికి అద్దాలు పగిలాయి. అలాగే బొత్సకు చెందిన లాడ్జీలోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే విద్యార్థుల రాళ్ల దాడిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దాంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. బొత్స నివాసాన్ని ముట్టడించేందుకు సమైక్యవాదులు మరోసారి యత్నించారు. చీపురపల్లి - శ్రీకాకుళంతోపాటు ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దుల్లోని జాతీయ రహాదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆరబిందో ఫార్మసీకి చెందిన బస్సుపై ఈ రోజు ఉదయం సమైక్యవాదులు రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలకొట్టారు.

 


కర్నూలు జిల్లా:
కర్నూలు: రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కర్నూలు నగరంలోని సమైక్యవాదులు శుక్రవారం జిల్లా కాంగ్రెస్, సీపీఐ కార్యాలయాలపై రాళ్ల దాడి చేశారు. ఆ దాడిలో ఆ రెండు పార్టీ కార్యాలయ భవనాల కిటికి అద్దాలు పగిలిపోయాయి. అలాగే స్వల్పంగా ఫర్నిచర్ ధ్వంసమైంది. రాష్ట్రాన్ని విభజిస్తే తమ భవిష్యత్తు అంధకారం అవుతోందని సమైక్యవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే విభజనపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్న సమైక్యవాదులు ఈ రోజు ఉదయం టీజే వెంకటేశ్ ఇంటిపై దాడి చేశారు. గతంలో రాజధానిగా ఉన్న కర్నూలు పట్టణాన్ని త్యాగం చేసి నష్ట పోయామని, తమకు మరోసారి అన్యాయం జరుగుతోందని సమైక్యవాదులు  ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా:
గుంటూరు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం టీ నోట్ ఆమోదించిన నేపథ్యంలో శుక్రవారం సమైక్యవాదులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో సమైక్యవాదులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి. అందులోభాగంగా ఈ రోజు ఉదయం నగరంలోని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. అయితే అప్పటికే మంత్రి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దాంతో పోలీసులకు, సమైక్యవాదుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే శంకర విలాస్ సెంటర్ సమీపంలోని బ్రిడ్జ్పై సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై బారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.


కృష్ణా జిల్లా:
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విజయవాడ నగరంలోని సమైక్యవాదులు, ఏపీఎన్జీవోల ఆగ్రహాం కట్టలు తెంచుకొంది. దాంతో శుక్రవారం ఉదయం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై గొల్లపూడి వద్ద వారు రాస్తారోకో నిర్వహించారు. దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల్ని భారీగా నిలిచిపోయాయి. అలాగే బెంజి సర్కిల్తోపాటు ఆ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాం వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దాంతో అటు మచిలీపట్నం, ఇటు ఏలూరు వైపు నుంచి వచ్చే వాహానాలు జాతీయ రహదారిపై బారులు తీరాయి. వీటితోపాటు బుడమేరు వంతెనపై సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు సంయుక్తంగా నూజివీడు - విజయవాడ రహదారిపై బైటాయించారు. దాంతో నూజివీడు నుంచి విజయవాడ వైపు, విజయవాడ నుంచి నూజివీడు వైపు వెళ్లే వాహనాలు బారీగా నిలిచిపోయాయి.

 

కేంద్ర మంత్రి పదవులకు కిల్లి కృపారాణి, పురందేశ్వరి, పల్లంరాజు, చిరంజీవి తదితరులు రాజీనామా చేశారు.అయితే, వాటిని ఆమోదింపజేసుకోవడంపై మాత్రం వారికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించలేదు. చాలామంది మంత్రులు ఫోన్లు స్విచాఫ్ చేసుకుని మీడియాకు కూడా అందుబాటులో లేకుండా పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement