రాష్ట్రపతి వద్దో, న్యాయస్థానంలోనో విభజన ఆగిపోవచ్చు: ఆనం
రాష్ట్రపతి నుంచి తెలంగాణ బిల్లు వచ్చిన తరువాతే అసెంబ్లీలో చర్చ జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూల, ప్రతికూల వాదనలు విని, వాటిని నమోదుచేసి రాష్ట్రపతికి అసెంబ్లీ స్పీకర్ నివేదిస్తారని, గతంలో జరిగిన విభజనలన్నీ శాసనసభ ఆమోదంతోనే జరిగాయని ఆయన తెలిపారు. రాష్ట్రపతి స్థాయిలో గానీ, న్యాయస్థానాల్లో గానీ ఎక్కడో ఒకచోట విభజన ప్రక్రియ నిలిచిపోతుందనే విశ్వాసం తనకుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే, విభజన అనివార్యం అయినప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని, తాము పార్టీవైపా, ముఖ్యమంత్రి వైపా అని ప్రశ్నిస్తే మాత్రం విచిత్రమైన సమస్యలో ఉన్నామని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తమముందు ప్రశ్న అయితే ఉందిగానీ దానికి సమాధానం లేదని తెలిపారు. అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్రే ప్రశ్నార్ధకంగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాము కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడికీ వెళ్లే ప్రసక్తి లేదని, అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ను విడిచి వెళ్లరని, ఆయన కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని ఆనం తెలిపారు. ప్రజాభిప్రాయం వినిపించే స్వేచ్చ తమ పార్టీలో ఉంది కాబట్టే ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్ర విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, ఇప్పటికైనా సమైక్యమని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని సాక్షితో మంత్రి ఆనం వ్యాఖ్యానించారు.