దాదా మదిలో ఏముందో?
శీతాకాల విడిదిలో ప్రణబ్‌కు పిటిషన్ల వెల్లువ
రెండు వాదనలనూ ఆసక్తిగా వింటున్న రాష్ట్రపతి
తన ఆంతర్యం మాత్రం అంతుచిక్కనివ్వని వైనం
విభజన, సమైక్యవాదుల్లో ఎవరి భాష్యం వారిదే
పిటిషన్లన్నీ ఎప్పటికప్పుడు కేంద్ర హోం శాఖకు
వాటిపై నివేదికను అధ్యయనం చేయనున్న దాదా
సాక్షి, హైదరాబాద్: రెండు భిన్న వాదనలు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి సమస్యలు వారివి. అందరూ ప్రథమ పౌరునికే మొర పెట్టుకుంటున్నారు. ఆయన కూడా వారు చెప్పేదంతా చాలా ఓపిగ్గా వింటున్నారు. భిన్న వాదనలతో వారిస్తున్న వినతిపత్రాలను సహనంతో స్వీకరిస్తున్నారు. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు కేంద్ర హోం శాఖకు పంపి పూర్తి వివరాలు కోరుతున్నారు. విభజన బిల్లు అసెంబ్లీ నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేరాల్సి ఉన్నందున, అప్పుడు దానిపై ఆయన తీసుకునే నిర్ణయమే అత్యంత కీలకంగా మారనుంది. అందుకే శీతాకాల విడిది కోసం పది రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన రాష్ట్రపతి ముందు విభజన, సమైక్యవాద నేతలు బారులు తీరుతున్నారు. అయితే వారి వాదనలన్నీ వింటున్నా, తన మనసులో ఏముందన్నది మాత్రం ఆయన ఎవరికీ అంతుచిక్కనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో ప్రణబ్ ఆంతర్యమేమిటి, రాజకీయాల్లో తలపండి, కాంగ్రెస్‌లో కొనసాగినంత కాలం ట్రబుల్ షూటర్‌గా పేరుబడ్డ ఆయన విభజన బిల్లుపై ఎలాంటి వైఖరి తీసుకుంటారు వంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను రాష్ట్రానికి పంపిన ప్రణబ్, ఆ తర్వాత కొద్ది రోజులకే, అంటే డిసెంబర్ 19న శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడం తెలిసిందే. అప్పటి నుంచీ అన్ని రాజకీయ పార్టీలకూ ఆయనే కేంద్ర బిందువుగా మారారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నాయకులంతా విభజన అంశంపై ప్రణబ్‌ను వరుసపెట్టి కలుస్తున్నారు. ఆయన హైదరాబాద్ చేరుకోవడానికి ఒకరోజు ముందే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు విరామం ప్రకటించారు. అంతకుముందే విభజన బిల్లును సభలో చర్చకు పెట్టిన నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు ప్రణబ్‌ను కలసి బిల్లుపై తమ అభిప్రాయాలను వినిపించారు.
జనవరి 23లోగా బిల్లుపై మండలి, అసెంబ్లీ అభిప్రాయాలు తీసుకుని జనవరి 26 నాటికి దాన్ని తిప్పి పంపాలంటూ ప్రణబ్ గడువు నిర్దేశించారు. అప్పటినుంచి సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు మధ్య నెల పదిహేను రోజులకు మించి గడువు లేకపోవడంతో విభజన బిల్లు భవితవ్యమేమిటన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బిల్లు తన వద్దకు పరిశీలనకు ప్రణబ్ ఎంత సమయం తీసుకుంటారన్నది కూడా ప్రధానంగా మారింది. ప్రణబ్ మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ వెంటనే ఆయన కోరిన మేర కు నేతల వినతిపత్రాలపై వివరణలతో కూడిన నివేదికను హోం శాఖ ఆయనకు అందజేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
గడువు పెంచుతారా?: విభజన బిల్లుపై మండలి, అసెంబ్లీల్లో చర్చకు ఇచ్చిన గడువును రాష్ట్రపతి పెంచుతారా లేదా? అన్నది కూడా ఆసక్తికరంగానే మారింది. మరింత గడువు కావాలని సీమాంధ్ర నేతలు, ఇచ్చిన గడువునే సద్వినియోగం చేసుకోవడం గనుక పొడిగించొద్దని తెలంగాణ నేతలు ఆయనకు విన్నవించారు. ఆయన మాత్రం వారెవరికీ ఏమీ చెప్పలేదు. ఓపిగ్గా తమ మాట విన్నారు గనుక తాము కోరినట్టే చేస్తారంటూ ఎవరికి వారు తమకు తోచిన భాష్యం చెప్పుకుంటున్నారు. బిల్లుపై అసెంబ్లీలో అందరి అభిప్రాయాలూ వ్యక్తమయ్యేలా చూడాలని ఒకట్రెండు సందర్భాల్లో ప్రణబ్ అన్నారు గనుక మరింత గడువిస్తారని సీమాంధ్ర నేతలంటున్నారు. గడువు విషయం ఎలా ఉన్నా అసలు విభజనపై ప్రణబ్ ఆంతర్యమేమిటన్నది కూడా చర్చనీయంగానే మారింది. బిల్లు తన వద్దకు తిరిగి రాగానే దాన్ని కేంద్ర కేబినెట్‌కు పంపిస్తారా, తద్వారా సాధారణ ఎన్నికలకు ముందే అది పార్లమెంటు ముందుకెళ్లేలా చూస్తారా అన్నవే ఇప్పుడు కీలకంగా మారాయి. తనకు బాగా సన్నిహితులైన కొందరు నేతలు కలిసినప్పుడు కూడా వీటిపై ప్రణబ్ తన ఆంతర్యాన్ని మాటమాత్రంగా కూడా బయట పెట్టలేదు. పైగా తాను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని కొందరితో ఆయన చెప్పిన మాటపైనా పలు విశ్లేషణలు సాగుతున్నాయి. 2014లోగా విభజన జరగబోదన్నది దాని అర్థమని కొందరు, జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు.
విభజనకు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకమని కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం ప్రణబ్ స్పష్టంగా చెప్పేవారని సమైక్యవాదులు అంటున్నారు. అయితే కేంద్ర మంత్రివర్గం తనకు పంపిన ముసాయిదాను ఏమాత్రం జాప్యం చేయకుండా ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి పంపడం ఆయన ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతోందని తెలంగాణవాదులు వాదిస్తున్నారు. కాకపోతే ఈ తరహా విభజన దేశంలో గతంలో ఎన్నడూ లేనిది గనుక ప్రణబ్ ఆచితూచి స్పందిస్తున్నారని రాష్ట్రపతి నిలయం వర్గాలు చెబుతున్నాయి. ‘‘రాష్ట్రాల విభజన విషయంలో గత సంప్రదాయాలు, ప్రాతిపదిక, అసెంబ్లీ తీర్మానం వంటివేవీ లేకుండా ముసాయిదా తయారైంది. పైగా ఉమ్మడి రాజధాని ఏర్పాటు వంటి సంక్లిష్ట అంశాలెన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి’’ అంటూ గుర్తు చేస్తున్నాయి. ఆయన ఢిల్లీ చేరాక వినతిపత్రాలు, వాటిపై కేంద్ర హోం శాఖ నివేదికలను వడబోసి, ఆ తర్వాతే ముందుకు వెళ్తారని వివరిస్తున్నాయి.