ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ పెద్దల యోచన
రాష్ట్ర విభజనపై కేంద్రం చురుగ్గా కదులుతూ తెలంగాణ బిల్లు త్వరలోనే అసెంబ్లీకి చేరే సూచనలున్న నేపథ్యంలో అసెంబ్లీ వర్గాలు సభా వ్యవహారాలపై దృష్టి సారించాయి. టీ బిల్లుపై సభలో చర్చ సజావుగా, ప్రశాంతంగా ముగిసేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఉభయ సభల్లోనూ ఒకేసారి చర్చ జరగవచ్చని భావిస్తున్నా.. ఉభయసభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి బిల్లుపై చర్చను ముగిస్తే మంచిదన్న ఆలోచనతోనూ ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. వచ్చేనెల మొదటి వారంలో అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రావచ్చన్న సంకేతాలు అసెంబ్లీ వర్గాలకు అందుతున్నారుు. ముసాయిదా బిల్లును ఇప్పటికే సిద్ధం చేసిన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) తుది మెరుగులు దిద్ది కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపనుంది. అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్లిన అనంతరం మొదటివారం మధ్య తేదీల్లోనే అసెంబ్లీకి రావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయానికి పదిరోజుల గడువు ఇవ్వొచ్చని, ఆలోగా అంటే డిసెంబర్ 10 నాటికి రాష్ట్ర అసెంబ్లీలో చర్చ ముగించుకుని తిరిగి ఆ బిల్లు రాష్ర్టపతికి చేరుతుందని చెబుతున్నారు. టీ-బిల్లుపై అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ చర్చ సాగనుంది. అయితే ప్రత్యేక పరిస్థితులున్న సమయంలో అసెంబ్లీ, మండలిలను వేర్వేరుగా సమావేశపరచాలా? లేదా సంయుక్త సమావేశంగా ఉభయ సభలను ఒకేదగ్గర చేర్చి ప్రక్రియను ఒకే సమయంలో పూర్తి చేయించాలా? అన్న చర్చ కూడా కాంగ్రెస్ పెద్దల్లో సాగుతోంది. బడ్జెట్ సమావేశం సందర్భంగా గవర్నర్ ప్రసంగించేటప్పుడు మాత్రమే ఉభయసభల సంయుక్త సమావేశం జరుగుతుంది. ఇప్పుడీ విభజన బిల్లుపై సమావేశం కూడా అదేరీతిన చేపడితే సరిపోతుందని మంత్రులు, పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. వేర్వేరుగా జరిగితే అసెంబ్లీ సమావేశం ప్రారంభమయ్యాక గంట వ్యవధి తరువాతే మండలి భేటీ ఉంటుంది. అసెంబ్లీలో పాల్గొనే మంత్రులు, సీఎం మండలికి రావాలి. విభజనపై అసెంబ్లీలో చర్చ కీలకమైనందున మండలిని వేరుగా సమావేశపరిస్తే సీఎం సహా మంత్రులు మండలికి వెళ్లేందుకు వీలుండకపోవచ్చని భావిస్తున్నారు. దీంతో ఉభయసభల సం యుక్త సమావేశం ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వ పెద్దలు దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని అసెంబ్లీవర్గాలు వివరించాయి.
బందోబస్తు ఏర్పాట్లపై స్పీకర్ దృష్టి
అసెంబ్లీలో చర్చ కీలకంగా మారే పరిస్థితులు కన్పిస్తుండటంతో అసెంబ్లీ వర్గాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారుు. టీ బిల్లును వ్యతిరేకించడానికి సమైక్యవాదులు, విభజనను ఆమోదింపచేసుకోవడానికి తెలంగాణవాదులు పట్టుదలతో ఉండడంతో పరిస్థితి వేడెక్కేలా ఉం ది. సభ లోపల జరిగే ప్రతి పరిణామమూ రెండు ప్రాంతాల్లో చర్య, ప్రతిచర్యలకు ఆస్కారమివ్వవచ్చని భావిస్తున్న ముఖ్య నేతలు ఆ పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అసెంబ్లీని సమావేశపరిచి విభజన బిల్లుపై చర్చిస్తే తలెత్తే పరిణామాలను అంచనా వేస్తున్న స్పీకర్ అధికారులకు ఆ మేరకు సూచనలిస్తున్నారు. సభలోపల, బయట తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టారు.
టీడీపీ, కాంగ్రెస్‌ల రెండు నాల్కల ధోరణితోనే సమస్య
టీ-బిల్లుపై చర్చ సందర్భంగా ప్రాంతాలవారీగా ఎవరి అభిప్రాయం వారు చెప్పుకొనే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సీమాం ధ్ర ఎమ్మెల్యేలు సమైక్య రాష్ట్రాన్ని, తెలంగాణ ఎమ్మెల్యేలు విభజనను సమర్థిస్తూ ప్రసంగాలు చేస్తారు. వైఎస్సార్‌సీపీ సమైక్యవాదాన్ని వినిపించనుంది. కాంగ్రెస్, టీడీపీలు షరా మామూలుగా రెండునాల్కల ధోరణి ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. తమపార్టీ నేతలకు ప్రాంతాలవారీగా వారి అభిప్రాయాలు చెప్పుకొనేందుకు అవకాశం కల్పించామని పీసీసీ చీఫ్ బొత్స తెలిపారు. టీడీపీ కూడా అదే బాటలో వెళ్లనుందని తెలుస్తోంది. ఇలా ప్రధాన పార్టీలు భిన్నాభిప్రాయాలను చెప్పే క్రమంలో విభేదాలు రేగి ఉద్రిక్తతకు దారితీస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని అసెంబ్లీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రత్యేక సమావేశాలా? శీతాకాల సమావేశాలా?
మరోవైపు మొదటివారంలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక సమావేశాలా? లేక శీతాకాల సమావేశాలా? అన్నది సందిగ్ధంగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 21తో ముగిశాయి. ఆరు నెలలలోపు అంటే డిసెంబర్ 20లోగా కచ్చితంగా సభ తిరిగి సమావేశమవ్వాలి. ప్రస్తుతం రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో చర్చించాల్సి ఉన్నందున శీతాకాల సమావేశాల మాదిరి గాక ప్రత్యేక సమావేశాలుగానే కొనసాగిం చే అవకాశాలున్నాయి. ప్రత్యేక సమావేశంగా పరిగణిస్తే కేవలం టీ బిల్లుపైనే చర్చను చేపట్టేలా ఎజెండాను పరిమితం చేయడానికి ఆస్కారముంటుంది. అలాగాక శీతాకాలపు సాధారణ సభగా అసెంబ్లీని సమావేశపరిస్తే టీ-బిల్లుతో పాటు ఇతర అంశాల్ని ఎజెండాలో చేర్చాల్సి ఉంటుంది. టీ-బిల్లు అంశం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఇతర అంశాలపై చర్చకు ఆస్కార మివ్వరాదన్న ఉద్దేశమే అధికార కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. సభ సాధారణమా? ప్రత్యేకమా? అన్నదానితో సంబంధం లేకుండా ఎజెండాను ఖరారు చేసేది సభా వ్యవహారాల సలహా సంఘమని(బీఏసీ), అక్కడి నిర్ణయం మేరకు ఎజెండా ఖరారవుతుందంటున్నారు. సమావేశాలకు ముందుగా ఎమ్మెల్యేలు, పార్టీల నేతలతో భేటీ కావాలని స్పీకర్ యోచిస్తున్నట్టు సమాచారం. టీ-బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువుననుసరించి అసెం బ్లీ ఎన్ని రోజులు జరగాలో నిర్ణయిస్తారు. మాట్లాడేందుకు ఎంతమందికి అవకాశమివ్వాలి? ఏ పార్టీకి ఎంత సమయమి వ్వాలన్న అంశాలపైనా బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.