ఇంకా సమైక్యమనడం సరికాదు
విభజన అనివార్యమని తేలింది: సీమాంధ్ర కేంద్రమంత్రులు
- సీమాంధ్రకు లాభం చేకూర్చేందుకే ఢిల్లీ పెద్దలను కలుస్తున్నాం
- హైదరాబాద్‌ను యూటీ, పోలవరం పూర్తి చేయాలని అడిగాం
- సీమాంధ్ర రాజధాని కోసం నిపుణుల కమిటీ వేయాలని కోరాం
- జైరాం, చిదంబరంలతో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీలు
- రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తామంటూ వారికి హామీ
- తమ ప్రతిపాదనలు జీవోఎం నివేదికలో చేర్చాలని వజ్ఞప్తి
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
పరిస్థితులను చూస్తుంటే రాష్ట్ర విభజన అనివార్యమని తేటతెల్లమైందని.. ఈ తరుణంలో ఇంకా కలిసి ఉండాలని పట్టుపట్టడం సరికాదని సీమాంధ్ర కేంద్రమంత్రులు మీడియాతో వ్యాఖ్యానించారు. ‘‘మేం ఈ విషయం గ్రహించిన తరువాతే సామరస్యంగా విడిపోయి సీమాంధ్రకు ఏ విధంగా లాభం చేకూర్చాలి? ఏ విధంగా సమన్యాయం పొందాలి? అనే దిశగా ఢిల్లీ పెద్దలను కలుస్తున్నాం’’ అని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే విభజన బిల్లు ఖచ్చితంగా వస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సదుపాయాలన్నీ సీమాంధ్రలో ఏర్పాటు చేసుకునే వరకు మాత్రమే ఆ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్రాన్ని కోరామని శీలం చెప్పారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, జె.డి.శీలం, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మిలు బుధవారం ఉదయం సంయుక్తంగా జీవోఎం సభ్యులు జైరాంరమేశ్, చిదంబరంలను వారి వారి నివాసాలకు వెళ్లి కలిశారు. రాష్ట్ర విభజనకు తాము పూర్తిగా సహకరిస్తామని వారికి హామీ ఇచ్చారు. అయితే.. జీవోఎం నివేదికలో తమ ప్రతిపాదనలను పొందుపరచాలని అభ్యర్థించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో హైదరాబాద్‌ను శాశ్వతంగా యూటీ చేయాలని చిరంజీవి, సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు హైదరాబాద్‌కు యూటీ హోదా ఇస్తే చాలని శీలం విజ్ఞప్తిచేశారు. పోలవరం ప్రాజెక్టుపై వినిపిస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆ ప్రాజెక్టును తప్పనిసరిగా నిర్మించి తీరాల్సిందేనని కోరారు. ఆయా అంశాలపై జీవోఎం భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని జైరాం పేర్కొన్నట్లు తెలిసింది. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వద్దకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. విభజన విషయంలో ఏకపక్షంగా వ్యవహరించకుండా సీమాంధ్రకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. జైరాంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు యూటీ హోదా ఇస్తే అందరి ఆమోదం ఉంటుందని, సీమాంధ్ర ప్రజల్లోనూ 90 శాతం మంది మద్దతు పలుకుతారని జీవోఎం సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. 1956కు పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్‌ను విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కలపాల్సిందేనని కూడా గట్టిగా కోరామన్నారు. అలాగే సీమాంధ్రలో ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలనే అంశంపై నిపుణుల కమిటీని వేయాలని కోరినట్లు పురందేశ్వరి తెలిపారు. పాలనా సౌలభ్యం, నీటి వసతి, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలకు అనుకూలమైన చోట మాత్రమే కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉన్నప్పటికీ దానిపై చర్చించలేదని సీమాంధ్ర నేతలు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యూటీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలను కూడా కలవాలని భావించిన సీమాంధ్ర కేంద్రమంత్రులు వారి అపాయిట్‌మెంట్లు కోరారు.
ఆ భావన పక్కన పెడితే మేలు: లగడపాటి
రాష్ట్రం అనివార్యమనే భావనతోనే సీమాంధ్ర కేంద్రమంత్రులు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నారని.. వారు అలాంటి భావనను పక్కనపెడితేనే మేలని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఏమాత్రం లేవని అభిప్రాయపడ్డారు. ‘‘జీవోఎం నివేదిక పూర్తి కావాలి. అటు నుంచి కేబినెట్‌కు వెళ్లాలి. తరువాత రాష్ట్రపతి, అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లాలి. మధ్యలో సీఎం ఉన్నారు. విభజనను ఆయన అడ్డుకుంటారనే నమ్మకం మాకుంది’’ అని చెప్పుకొచ్చారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటు ఆయా అసెంబ్లీల తీర్మానం తరువాత ఐదు నుంచి పదే ళ్ల సమయం పట్టినందున రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావటం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు.