సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా డ్రామాలు మొదలుపెట్టారు. గురువారమే మొదలుపెట్టిన ఈ తతంగాన్ని శుక్రవారం కూడా కొనసాగించారు. పురందేశ్వరి, కిల్లి కృపారాణి తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేసినట్టు చెబుతున్నారు. కానీ వారు తమ రాజీనామా లేఖలను ప్రధానమంత్రికి మాత్రం పంపిన దాఖలాలు కనిపించట్లేదు. కేంద్ర మంత్రి చిరంజీవి కూడా రాజీనామా చేసినట్లే చెప్పినా, ఆయనది కూడా అదే పరిస్థితి.
అసలు రాజీనామా చేసినట్లయితే.. ఆ విషయాన్ని మీడియాకు బహిరంగంగా ప్రకటించి, లేఖలను కూడా ప్రదర్శించడం ఆనవాయితీ. కానీ తమ పదవులను వదులుకోడానికి ఏమాత్రం ఇష్టం లేని కేంద్ర మంత్రులు, చివరకు మీడియాకు కూడా అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. అసలు వాళ్లు నేరుగా రాజీనామాలను ఆమోదింపజేసుకునే పరిస్థితి ఉందా లేదా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
వాస్తవానికి ఈ నాయకుల్లో చాలామందికి చాలాకాలం తర్వాత పదవులు లభించాయి. మరికొందరు ఇన్నాళ్లూ సహాయ మంత్రులుగా ఉన్నా, ఇటీవలే కేబినెట్ ర్యాంక్ సాధించారు. కావూరి సాంబశివరావు లాంటి వాళ్లకు సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత మాత్రమే పదవులు లభించాయి. అందుకే వీళ్లు కేవలం ప్రకటనలు చేసి తప్పించుకుంటున్నారు తప్ప నిజాయితీ కనిపించట్లేదు. సీమాంధ్రలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలను చల్లార్చడానికే ఇలా చేస్తున్నారని, కేవలం ప్రజాగ్రహం నుంచి తప్పించుకోడానికే మాటలు చెబుతున్నా, ఆచరణకు మాత్రం దూరంగా ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఎటూ లేదు కాబట్టి, ఈ చివరి ఏడాది కాలం కూడా పదవులు అనుభవించాలన్నదే వాళ్ల ఆలోచన అని విమర్శకులు అంటున్నారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీ'డ్రామా'లు
Published Fri, Oct 4 2013 11:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement