అసెంబ్లీకి బిల్లు పంపిస్తాం
విభజనపై రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం
వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హామీ
బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్, సీపీఐ ఎంపీ డి.రాజాతోనూ నేతల భేటీలు
అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరామే తప్ప ఏనాడూ విభజనకు అంగీకారం తెలుపలేదు: విజయమ్మ
సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుందని సూచన
కొడుకు అయినందునే 16 నెలలు జైలుకు పంపారా? అని దిగ్విజయ్‌కు సూటి ప్రశ్న
వైఎస్సార్ కాంగ్రెస్‌కు నష్టం కలిగించేందుకే దిగ్విజయ్ వ్యాఖ్యలన్న ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై పూర్తిగా రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమకు హామీ ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ తెలిపారు. విభజన విషయంలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోరాలని, అక్కడ చర్చ జరగాలని తాము చేసిన విన్నపానికి రాష్ట్రపతి స్పందిస్తూ.. రాజ్యాంగ సూత్రాల ప్రకారం నడుచుకుంటానని, బిల్లు తన వద్దకు వచ్చిన వెంటనే రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తానని అన్నట్లు చెప్పారు. అసెంబ్లీలో తగిన సమయం ఇచ్చి ప్రజాప్రతినిధులు, పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటామని, అభిప్రాయాలు తెలుసుకున్నాకే పార్లమెంట్‌కు పంపిస్తానని ప్రణబ్ చెప్పినట్లు విజయమ్మ వెల్లడించారు. రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఢిల్లీకి రావాల్సి ఉందని, అయితే షరతులతో కూడిన బెయిల్ కావడం, సమైక్యం కోసం ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుండటంతో ఆయన రాలేకపోయారని విజయమ్మ తెలిపారు. వైఎస్ జగన్ దీక్షపై రాష్ట్రపతి సైతం ఆరా తీశారని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సైతం సూచన చేశారని తెలియజేశారు.
25 నిమిషాలపాటు రాష్ట్రపతితో భేటీ..
సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన విజయమ్మ నేతృత్వంలోని బృందం బుధవారం ప్రణబ్ ముఖర్జీతో సమావేశమైంది. సుమారు 25 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో విజయమ్మతో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమైక్యత కోరుతూ వైఎస్ విజయమ్మ రాష్ట్రపతికి ఓ మెమొరాండాన్ని సమర్పించారు. రాష్ట్ర విభజనపై పార్టీ వైఖరిని స్పష్టం చేయడంతోపాటు, పలు సందర్భాల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని, 2009లో రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విభజనపై చెప్పిన అంశాలు, 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు సమయంలో జరిగిన నిర్ణయం, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ తెలిపిన వైఖరులను మెమొరాండంలో ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో సీమాంధ్రలో 70 రోజులుగా జరుగుతున్న ఉద్యమ తీరును ఆయనకు వివరించారు. ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు ఏ స్థాయిలో ఉద్యమిస్తున్నదీ తెలియజేశారు. సీమాంధ్రుల ఆందోళనను ఖాతరు చేయకుండా, కేబినెట్ నోట్‌కు ఆమోదం తెలుపడానికి ముందు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోరకుండా అడ్డగోలుగా చేసిన నిర్ణయాన్ని ఆయనకు వివరించారు. మెజార్టీ రాష్ట్ర ప్రజలు విభజన కోరడం లేదని, ఈ దృష్ట్యా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు విన్నవించారు.
ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయాలి..
రాష్ట్రపతితో భేటీ అనంతరం విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. 70 రోజులుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతోందని, 60 శాతం ప్రజలు రోడ్లపైకి వచ్చారని తెలిపారు. నాలుగు రోజులుగా సీమాంధ్రలో కరెంట్ లేదని, తాగునీరు దొరకడం లేదని, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ రాష్ర్టపతి దృష్టికి, ఇతర జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇదే సమయంలో 2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చి రాజీనామాలు సమర్పించాయని, ఇప్పుడూ అదేరీతిన అన్ని పార్టీలు కలిసి రావాల్సి ఉందన్నారు. నిర్ణయం వెలువడిన రోజే తమ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేశారని, అలాగే టీడీపీ, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయాలని సూచించారు. కేంద్ర మంత్రులు సైతం రాజీనామాలు సమర్పిస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని, విభజన ఆగిపోతుందని అన్నారు.
వైఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ విభజనకు అనుకూలమని చెప్పలేదు
విభజనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ సైతం అంగీకరించిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయమ్మ దుయ్యబట్టారు. ‘2001లో వైఎస్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఉన్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రెండో ఎస్సార్సీనే తమ విధానమని చెప్పారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు సమయంలోనూ రెండో ఎస్సార్సీనే తమ విధానమని చెప్పారు. అప్పుడు దీనికి టీఆర్‌ఎస్ సైతం అంగీకరించింది. ఇక తమ పార్టీ సైతం తండ్రిలా అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం చేయాలని చెప్పింది తప్పితే ఎక్కడా విభజించమని చెప్పలేదు’ అని వెల్లడించారు. విభజన నిర్ణయం వచ్చిన తొలిరోజు నుంచీ తమ పార్టీ పోరాటాలు చేస్తోందని గుర్తు చేశారు. నిత్యం తమ పార్టీ నేతలంతా ప్రజాందోళనలో కలిసి పోరాడుతున్నారని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ప్రజా పోరాటాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం తీసుకోమంటే దానర్థం విభజించమని కాదని స్పష్టం చేశారు.
విభజనకు అనుకూలంగానే బాబు దీక్షా..?
టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షను ఈ సందర్భంగా విజయమ్మ తప్పుపట్టారు. ఇప్పటికే విభజనకు అనుకూలమని పలుమార్లు లేఖలిచ్చిన బాబు, ఇప్పుడు విభజన కోరుతూనే దీక్ష చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజాందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నా బాబు ఎక్కడా సమైక్యాంధ్ర అనడం లేదని విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, రోశయ్య కమిటీ, ఆంటోనీ కమిటీ, కేబినెట్ నోట్ తర్వాత సైమన్ కమిటీలా మంత్రుల బృందాన్ని పంపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విభజన ఎలా జరపాలన్న ఉద్దేశ ంతోనే సైమన్ కమిటీ వస్తోంది తప్పితే, విభజన జరగకుండా ఆలోచనలు చేసే పరిస్థితి లేదన్నారు.
కొడుకు అయినందుకే జైలుకు పంపారా..?
వైఎస్ జగన్ తన కొడుకు లాంటి వాడని దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై విజయమ్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు రోల్‌మోడల్ అంటారు. అందుకే ఆయన పేరును చార్జిషీట్‌లో పెట్టారా? ఇక జగన్ కొడుకు లాంటి వాడంటారు.. అందుకే 16 నెలలు జైలుకు పంపారా?’ అని ధ్వజమెత్తారు. కేవలం తమ పార్టీ, జగన్ ఇమేజ్‌లను దెబ్బతీసేందుకే దిగ్విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
రాజ్‌నాథ్, రాజాలతోనూ భేటీ: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీపీఐ సీనియర్ నేత, ఎంపీ డి.రాజాలతో విడివిడిగా భేటీలు నిర్వహించింది. రాష్ట్ర సమైక్యత అవసరాన్ని వివరిస్తూ వారికి మెమొరాండాన్ని సమర్పించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, సమైక్యం కోసం తమతో కలిసి రావాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్లు విజయమ్మ తెలిపారు. దీనిపై రాజ్‌నాథ్ స్పందిస్తూ, ‘మేము తెలంగాణకు అనుకూలమైనప్పటికీ విభజన విధానం బాగాలేదు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేందుకు సహకరిస్తాం’ అని చెప్పారన్నారు. ఈ సందర్భంగా 2000లో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ కానీ, అసెంబ్లీ తీర్మానంకానీ చేయాలని సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ చెప్పిన అంశాన్ని గుర్తుచేశామన్నారు. ఇక పొత్తుల విషయం మాట్లాడేందుకు ఇప్పుడు సమయం కాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందించారు.
వాస్తవాలను వక్రీకరించొద్దని దిగ్విజయ్‌కు మేకపాటి సూచన
విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ అంగీకారం తెలిపిందని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తోసిపుచ్చారు. తాము ఏనాడూ విభజనకు అనుకూలమని చెప్పలేదని, అఖిలపక్షంలో ఇచ్చిన లేఖలో ఎక్కడా విభజించమని లేదని తెలిపారు. దిగ్విజయ్ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. కేవలం జగన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకే దిగ్విజయ్ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌పై ఎన్ని కుట్రలు చేసినా ఆయన ప్రభంజనాన్ని ఆపలేరని, 2014 ఎన్నికల్లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ 30కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని అన్నారు.