సాక్షి, హైదరాబాద్: పన్నుల ద్వారా వచ్చే ఆదాయ వనరులను పెంచేందుకు విప్లవాత్మకమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పన్నులు ఎగవేసే అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో వాణిజ్యపన్నుల శాఖ పనితీరుపై సీఎం సమీక్షించారు. వాణిజ్యపన్నుల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను పరిశీలించారు. జీరో వ్యాపారం, పన్ను ఎగవేత, తక్కువ పన్ను చెల్లించి ఎక్కువ వ్యాపారం చేయడం వంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది.
తెలంగాణకు ఉన్న నాలుగు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులున్నాయని, వాటిని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీతో సరిహద్దుల్లోని 7 చెక్‌పోస్టులకు భవనాలు లేవని, రోడ్లపైనే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని సీటీ శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చెక్‌పోస్టులకు ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడి లీజు పద్ధతిన భూమి తీసుకొని చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. రెండు చెక్‌పోస్టులకు భూమి అందుబాటులో ఉందని అధికారులు పేర్కొనగా, వెంటనే పనులు జరిగేలా చూసేందుకు నిధులు కేటాయిస్తామని సీఎం చెప్పారు.
వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగాల నియామకానికి ఇప్పటికే అనుమతిచ్చామని, ఇంకా ఖాళీలు ఉంటే వాటిని కూడా భర్తీ చే స్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ వి.అనిల్ కుమార్, అదనపు కమిషనర్లు చంద్రశేఖర్‌రెడ్డి, రేవతి రోహిణి (ఎన్‌ఫోర్స్‌మెంట్)తో పాటు సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, శాంతికుమారి హాజరయ్యారు.
ఆదాయ వనరులు పెంచాల్సిందే!
Published Sat, Aug 1 2015 1:28 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
Advertisement
Advertisement