ఖజానాకు ‘సుగంధ’ నామం
భారీగా సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణా
పెద్ద ఎత్తున పన్నుల ఎగవేత
చర్యలు మరిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
ప్రత్యేక నిఘా వ్యవస్థ కోసం సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇందుకోసం స్మగ్లర్లు అడ్డదారులు తొక్కుతూ ఖజానాకు ‘సుగంధ’నామం పెడుతున్నారు. ఫలితంగా వాణిజ్య పన్నుల శాఖకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. దీనిపై ఆలస్యంగా మేల్కొన్న వాణిజ్యపన్నుల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా వ్యవస్థ కోసం సిఫార్సు చేసి ఊరుకున్నారు. కానీ, కఠిన చర్యలకు వెనకాడుతున్నారు.
అక్రమ రవాణా తీరు..
యాలకులు, లవంగాలు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలకు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. నిబంధనల ప్రకారం వీటిని దిగుమతి చేసుకోవాలంటే వ్యాపారులు పెద్దమొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వారు దొంగదారులను ఆశ్రయిస్తున్నారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా పండుతాయి. నిఘా లోపించడంతో.. అక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలను రాష్ట్రంలోని తూర్పుగోదావరి, విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాలకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి గిరిజన గ్రామాల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మన రాష్ట్రంలో పండిన పంట కూడా ఇలానే వెళుతోంది.
వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సంయుక్త పర్యవేక్షణలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 60 అడ్డదారుల్లో ఇవి రవాణా అవుతున్నాయని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
అడ్డదారులతోపాటు.. పర్మిట్ ఉండి చెక్‌పోస్టుల ద్వారా వెళ్లే లారీల్లోనూ దొంగచాటుగా పంపుతున్నట్లు తేలింది.
కిలో లవంగాలను రూ. 950 నుంచి రూ. 1250లకు కొనుగోలు చేస్తున్న దళారులు.. రూ. 4వేలకుపైనే అమ్ముకుంటున్నట్లు తెలిసింది. ఒక్కో లారీలో 15 టన్నుల వరకూ సుగంధ ద్రవ్యాలు రవాణా అవుతున్నాయి. సరైన మార్గంలో వెళ్తే 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రూపాయి పన్ను చెల్లించకుండా అడ్డదారుల్లో రోజూ 10లారీల వరకు రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయని అధికారుల అంచనా. అలా ఏటా రూ. 15 కోట్లకుపైనే పన్ను ఆదాయానికి గండిపడుతోంది.
తమ శాఖ ఇప్పటి వరకూ చెక్‌పోస్టుల వద్దే నిఘా ఉంచిందని, గిరిజన గ్రామాల్లో, మారుమూల మార్గాల్లో నిఘాకు తగిన వ్యవస్థ లేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంటున్నారు. అయితే, స్థానికంగా రాజకీయ ఒత్తిడులు, క్షేత్రస్థాయి అధికారులు భారీగా ముడుపులు అందుకోవడం అక్రమార్కులకు దారిచూపుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.