
ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (pmjay) పథకంలో అవకతవకులు జరిగాయి. కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడీ ఏక కాలంలో దాడులకు దిగింది.
2023లో పార్లమెంటులో కాగ్ నివేదికను ప్రవేశ పెట్టింది. జార్ఖండ్‌లో ఆయుష్మాన్ పథకం పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగిందనేది ఆ నివేదిక సారాశం. రోగులను చేర్చుకోకుండా, బీమా మొత్తాన్ని మోసపూరితంగా క్లయిమ్ చేస్తున్నారని అందులో పేర్కొంది. కాగ్ తన రిపోర్ట్‌లో దేశంలోని 212 ఆస్పత్రులలో పీఎంజేఏవైలో ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.
చికిత్స అందించకుండా
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయుష్మాన్ భారత్ పథకం కింద మోసపూరిత కార్యకలాపాలు, ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించి జార్ఖండ్‌లోని రాంచీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పీఎంజేఏవైలోని నెట్ వర్క్ ఆస్పత్రులలో ఎటువంటి వైద్య చికిత్స లేకుండా, ఏ రోగిని చేర్చకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ దాడులకు దిగింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
పీఎంజేఏవై పథకం కింద
పీఎంజేఏవై పథకం కింద కేంద్రం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తుంది. ఈ పథకంలో రూ.5లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ప్రస్తుతం దాదాపు 12.3 కోట్ల కుటుంబాలకు అందుబాటులో ఉంది. తాజాగా కేంద్రం ఈ పథకాన్ని 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వర్తించేలా మార్పులకు శ్రీకారం చుట్టింది.