అత్యవసరాల్లో అనుకూలం
సమీపంలోని ఆస్పత్రిలోనే చికిత్స
హాస్పిటల్ బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు
షరతుల మేరకే క్లెయిమ్ ఆమోదం
లేదంటే రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లాల్సిందే
వీలున్నంత వరకు నెట్‌వర్క్‌కే ప్రాధాన్యం
ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో ఉన్న ముఖ్యమైన సదుపాయాల్లో ఒకటి నగదు రహిత వైద్యం. ముందస్తు ప్రణాళికతో లేదా అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఈ సదుపాయం ఎంతో అక్కరకు వస్తుంది. సాధారణంగా బీమా సంస్థ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనే ఈ నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేది. నెట్‌వర్క్ జాబితాలో లేని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే, సొంతంగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తప్పిస్తూ.. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత వైద్యం పొందేందుకు వీలుగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ ఏడాది జవనరి నుంచి ‘ఎక్కడైనా నగదు రహితం’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలేమిటో చూద్దాం.
బీమా సంస్థ నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లోనూ నగదు రహిత చికిత్స పొందడమే నూతన విధానంలోని సౌలభ్యం. ప్రతి బీమా సంస్థ నెట్‌వర్క్ హాస్పిటల్స్ పేరుతో ఒక జాబితా నిర్వహిస్తుంటుంది. ఆ జాబితాలోని ఏ హాస్పిటల్‌లో చికిత్స పొందినా బీమా సంస్థే నేరుగా చెల్లింపులు చేస్తుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ నెట్‌వర్క్ ఆస్పత్రిలోనే చికిత్స పొందాలంటే సాధ్యపడకపోవచ్చు. ప్రమాదానికి గురైనప్పుడు వేగంగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు.
ఆ ఆస్పత్రి బీమా నెట్‌వర్క్‌లో భాగంగా లేకపోతే? బిల్లు భారీగా వస్తే..? ఆ మొత్తాన్ని రోగి సంబందీకులు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయి, సత్వర వైద్యం అందాల్సిన సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి తరుణంలో సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎక్కడైనా నగదు రహితం ఉపయోగపడుతుంది. అత్యవసరమనే కాదు, ముందుగా అనుకుని నిర్ణిత సమయానికి తీసుకునే చికిత్సలకు సైతం నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌కు వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కడైనా నగదు రహితం విధానం ఎలా పనినిచేస్తుందో తెలుసుకోవడం అవసరం.
నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే..
జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి రావడానికి ముందు కూడా కొన్ని బీమా సంస్థలు నాన్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ జనరల్, బజాజ్ అలియాంజ్ జనరల్ సైతం నాన్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశాయి.
ముందస్తుగా నిర్ణయించుకుని, తీసుకునే చికిత్స విషయంలో బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్ (టీపీఏ)కు రెండు నుంచి మూడు రోజుల ముందు (48–72 గంటలు) తెలియజేయడం తప్పనిసరి. ఈ మెయిల్ లేదంటే ఇతర ఆన్‌లైన్ మార్గాల ద్వారా లేదంటే లిఖిత పూర్వకంగా బీమా సంస్థకు తెలియజేయవచ్చు. అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సి వస్తే కనుక నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చేరిన 24 నుంచి 48 గంటల్లోపు (బీమా సంస్థ ఆధారంగా వేర్వేరు) విషయాన్ని తెలియజేయాలి.
15 పడకలు తప్పనిసరి..
నగదు రహిత వైద్యం పొందేందుకు ఎంపిక చేసుకునే ఆస్పత్రిలో కనీసం 15 పడకలు (బెడ్స్) ఉండాలన్నది నిబంధన. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నిబంధనలకు అనుగుణంగా, హాస్పిటల్ అనే నిర్వచనానికి అనుగుణంగా నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్ పనిచేస్తూ ఉండాలి. గుర్తింపు కార్డులు, పాలసీ డాక్యుమెంట్లు, మెడికల్ రిపోర్ట్‌లు, పి్రస్కిప్షన్లు, బిల్లులు నిర్ధేశిత ఫార్మాట్‌లో బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుంది. నగదు రహిత వైద్యానికి అనుమతించే ముందు నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్ నుంచి ఆమోద లేఖను చాలా బీమా సంస్థలు కోరుతున్నాయి. ఆస్పత్రి బిల్లులు నిజమైనవేనా? ప్రామాణిక అడ్మిషన్ ప్రక్రియ విధానాన్నే అనుసరిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగానే చికిత్సా విధానాలు ఉన్నాయా? అని బీమా సంస్థలు పరిశీలిస్తాయి.
ఇక పాలసీకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధుల చికిత్సా క్లెయిమ్‌లో వేచి ఉండాల్సిన కాలం), కోపే క్లాజ్, మినహాయింపులు, ముందస్తు వ్యాధుల నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని గమనించాలి. కొన్ని చికిత్సలకు సంబంధించి (ఉదాహరణకు కేటరాక్ట్) ఉప పరిమితులు ఉంటే, వాటి విషయంలోనూ నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. పాలసీలో ప్రత్యేకమైన రైడర్ తీసుకుంటే తప్ప కాటన్, ఫేస్ మాస్‌్కలు, సర్జికల్ గ్లోవ్‌లు, నెబ్యులైజేషన్ కిట్‌లకు పరిహారం రాదు. ఏవైనా అదనపు చార్జీలు (కవరేజీలోకి రానివి) విధిస్తే, పాలసీదారు సొంతంగా చెల్లించుకోవాలి.
చార్జీల పట్ల అవగాహన
నెట్‌వర్క్ ఆస్పత్రులు వివిధ రకాల చికిత్సలకు వసూలు చేసే చార్జీల వివరాలు బీమా సంస్థ రికార్డుల్లో ఉంటాయి. దీనివల్ల పాలసీదారు సొంత పాకెట్‌పై భారం పడదు. నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చికిత్సలకు ఎంత చార్జీ వసూలు చేస్తారన్నది కీలకం అవుతుంది. నెట్‌వర్క్ హాస్పిటల్‌కు మించి నాన్ నెట్‌వర్క్ ఆస్పత్రి చార్జీ చేస్తే, అప్పుడు క్లెయిమ్ పూర్తిగా రాకపోవచ్చు. పైగా ఆస్పత్రి పడకలు, ఏ ప్రాంతంలో ఉందన్న దాని ఆధారంగా చికిత్సల ధరలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చికిత్సకు నెట్‌వర్క్ హాస్పిటల్‌లో రూ.50,000 పరిమితి ఉందనుకోండి.
అదే నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో ఇదే చికిత్సకు రూ.70,000 వేలు చార్జ్ చేస్తే, పాలసీదారు తాను సొంతంగా రూ.20,000 చెల్లించాల్సి వస్తుంది. అందుకని నగదు రహిత వైద్యం కోరుకునే వారు తమ పాకెట్ నుంచి పెద్దగా చెల్లించొద్దని భావిస్తే, అప్పుడు బీమా సంస్థ నెట్‌వర్క్ హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది. కొన్ని సందర్భాల్లో నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. అలాంటప్పుడు పాలసీదారు సొంతంగా చెల్లించి, డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లాల్సి వస్తుంది. రోగికి శరవేగంగా చికిత్స అవసరమైతే తప్పించి, మిగిలిన వాటికి నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను ఎంపిక చేసుకోకపోవడం మంచిది.
నెట్‌వర్క్–నాన్ నెట్‌వర్క్
బీమా సంస్థ నగదు రహిత వైద్యం అందించేందుకు వీలుగా పలు ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందానికి వచ్చిన ఆస్పత్రులు నెట్‌వర్క్ జాబితాలో ఉంటాయి. ఇలా ఒప్పందం చేసుకునే సమయంలోనే చికిత్సల ధరల విషయంలో బీమా సంస్థ ఆస్పత్రులతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. దీనివల్ల బీమా సంస్థకు కొంత భారం తగ్గుతుంది. నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌తో ఈ అనుకూలత బీమా సంస్థలకు ఉండదు.
బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు
అన్నింటికంటే ముఖ్యమైనది.. చికిత్స కోసం ఎంపిక చేసుకునే నాన్ నెట్‌వర్క్ ఆస్పత్రి బీమా సంస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు. బ్లాక్ లిస్ట్‌లోని ఆస్పత్రిలో చేరడం వల్ల నగదు రహిత వైద్యం అందదు. రీయింబర్స్‌మెంట్‌కు కూడా అవకాశం ఉండదు. దీనివల్ల మొత్తానికే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అత్యవసరంగా చికిత్స అవసరమైనప్పుడు కూడా బీమా సంస్థ పోర్టల్‌కు వెళ్లి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితాను ఓ సారి పరిశీలించడం ఎంతో మంచిది. ఇక ముందస్తు ప్రణాళికతో తీసుకునే చికత్సలకు బీమా సంస్థ నెట్‌వర్క్‌లోని హాస్పిటల్‌కు వెళ్లడమే మేలు. ఎందుకంటే నెట్‌వర్క్ ఆస్పత్రులు బీమా సంస్థ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు దాదాపుగా ఎదురుకావు.
నెట్‌వర్క్ హాస్పిటల్‌తో లాభాలు
► నెట్‌వర్క్ (ఎంపానెల్డ్) ఆస్పత్రుల్లో టారిఫ్‌లు బీమా సంస్థతో కుదిరిన అంగీకారం మేరకు ఉంటాయి. చికిత్సల చార్జీలు నిర్ధేశిత పరిమితుల పరిధిలోనే ఉంటాయి. దీంతో క్లెయిమ్‌కు సత్వర ఆమోదం లభిస్తుంది. వేగంగా డిశ్చార్జ్ కావచ్చు.
► నెట్‌వర్క్ హాస్పిటల్‌లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ పరిష్కారం సాఫీగా, వేగంగా జరుగుతుంది.
► నెట్‌వర్క్ ఆస్పత్రులు అన్నింటిలోనూ చికిత్సల నాణ్యాత ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో రోగులకు చికిత్సల తర్వాత సమస్యల రిస్క్ తగ్గుతుంది.
► ఆస్పత్రి, బీమా సంస్థ మధ్య విశ్వసనీయమైన బంధం వల్ల చికిత్సల బిల్లులను మరీ పెద్దవి చేసి చూపించడం ఉండదు. అనవసర ప్రక్రియలు, ఔషధాల వినియోగం ఉండదు. మోసాల రిస్క్ తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment