ఆరోగ్య బీమా భారం తగ్గేదెలా..? | Health insurance premiums likely to have increased every year..special story | Sakshi
Sakshi News home page

ఆరోగ్య బీమా భారం తగ్గేదెలా..?

Published Mon, Dec 11 2023 12:47 AM | Last Updated on Mon, Dec 11 2023 5:57 AM

Health insurance premiums likely to have increased every year..special story - Sakshi

రమణ్‌సింగ్‌ (68)కు ఇటీవలే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి పాలసీ రెన్యువల్‌ నోటీస్‌ వచి్చంది. చూస్తే ప్రీమియం గతేడాది కంటే గణనీయంగా పెరిగిపోయింది. ఏకంగా 30 శాతం అధికంగా చెల్లించాల్సి రావడంతో దీన్ని ఎలా అధిగమించాలా? అనే ఆలోచనలో పడ్డాడు. రమణ్‌సింగ్‌కు మాత్రమే ఈ అనుభవం పరిమితం కాదు. దాదాపు అన్ని బీమా సంస్థలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను ఇటీవలి కాలంలో పెంచేశాయి. దీంతో సగటు మధ్యతరగతి వాసులపై హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రూపంలో భారం పెరిగిపోయింది.

కరోనా విపత్తు తర్వాత నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు గణనీయంగా పెరగడం పాలసీదారులకు తెలిసిన అనుభవమే. దీనికి క్లెయిమ్‌లు భారీగా పెరిగిపోవడమే కారణమని బీమా సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో వృద్ధులకు హెల్త్‌ కవరేజీ విషయంలో కొన్ని బీమా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అధిక ప్రీమియంకు తోడు, పలు షరతులు పెడుతున్నాయి. వృద్ధులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం భారంగా మారుతున్న తరుణంలో దీన్ని తగ్గించుకునే మార్గాల గురించి చర్చించే కథనమే ఇది.

బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇన్‌కర్డ్‌ క్లెయిమ్‌ రేషియో 2020–21లో 94 శాతంగా ఉంటే, అది 2021–22 సంవత్సరానికి 109 శాతానికి పెరిగింది. ఇన్‌కర్డ్‌ క్లెయిమ్‌ రేషియో 100 శాతానికి దిగువన ఉంటేనే బీమా సంస్థలకు లాభం ఉన్నట్టు. 100 అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, తమకు వస్తున్న ప్రీమియానికి మించి అవి చెల్లింపులు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

‘‘గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు పెరిగిపోయాయి. కరోనా తర్వాత అన్ని వయసుల వారి నుంచి క్లెయిమ్‌లు 10–30 శాతం వరకు ఎక్కువయ్యాయి. దీనివల్ల వృద్ధులపై భారం పెరిగిపోయింది. వీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పైగా వృద్ధుల్లో క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే సదుపాయం అందరికీ ఉండదు’’ అని పాలసీబజార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ సింఘాల్‌ తెలిపారు.

వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ. దీంతో ఈ వయసులోని వారికి సహజంగానే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో క్లెయిమ్‌లు పెరగడంతో బీమా సంస్థలు ప్రీమియంను మరింత పెంచాయి.   ‘‘వృద్ధులకు సహజంగా హెల్త్‌ రిస్క్‌లు ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరు హెల్త్‌ కవరేజీ ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. కనుక క్లెయిమ్‌ల రిస్క్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ధారిస్తుంటాయి.

30 ఏళ్ల వయసు వారి ప్రీమియంతో పోలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం 2.5 రెట్ల నుంచి 4 రెట్ల వరకు అధికంగా ఉంటుంది’’ అని గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ డైరెక్ట్‌ సేల్స్‌ హెడ్‌ వివేక్‌ చతుర్వేది తెలిపారు. సీనియర్‌ సిటిజన్లలో కొందరికి బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. వారికి ముందస్తుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వచి్చన ఫలితాలే దీనికి కారణమని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో తపన్‌ సింఘాల్‌ పేర్కొన్నారు.

కోపేమెంట్‌..
కోపేమెంట్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే, ప్రతి క్లెయిమ్‌లో పాలసీదారు తన వంతు కొంత భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. సాధారణంగా ఈ కోపేమెంట్‌ అనేది బీమా కవరేజీలో 10 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటుంది. 20 శాతం కోపేమెంట్‌ ఎంపిక చేసుకుంటే, క్లెయిమ్‌ మొత్తంలో పాలసీదారు 20 శాతం, మిగిలిన 80 శాతం బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది.

క్లెయిమ్‌లో తన వైపు భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థ ప్రీమియంలో తగ్గింపును ఇస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోపేమెంట్‌తో ప్రీమియంలో ఆదా అయిన మొత్తం కంటే, క్లెయిమ్‌ వచి్చనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తమే అధికంగా ఉంటుంది. అయినా సరే భారీ ప్రీమియం చెల్లించడం కష్టమనుకునే వారు కోపేమెంట్‌ ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. దీనివల్ల పాలసీ ప్రీమియంలో 30–40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.

‘‘వృద్ధులకు అదనపు వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది. కనుక వారు ఆసుపత్రిలో చేరితే ఎక్కువ రోజుల పాటు ఉండాల్సి రావచ్చు. అందుకని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ఎంపిక చేసుకునే వారు ఇన్‌ పేషెంట్‌ (ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే వారు)లో గరిష్ట కవరేజీని ఆఫర్‌ చేసే ప్లాన్‌ను పరిశీలించాలి. వ్యాధుల వారీగా ఎవైనా మినహాయింపులు, ఉప పరిమితులు, కోపేమెంట్‌ ఉన్నాయేమో పరిశీలించాలి’’ అని తపన్‌ సింఘాల్‌ సూచించారు.   

డిడక్టబుల్‌..
పాలసీదారులు ప్రీమియం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో మరొకటి డిడక్టబుల్‌ క్లాజ్‌. ఇది కూడా కోపేమెంట్‌ మాదిరే పనిచేస్తుంది. ఉదాహరణకు రూ.50,000 డిడక్టబుల్‌ అనే క్లాజ్‌ ఉందనుకుంటే.. రూ.50,000 మించిన క్లెయిమ్‌లకే బీమా సంస్థలు చెల్లింపులు చేస్తాయి. కోపేమెంట్‌ అలా కాదు. 10 శాతం కోపే ఉంటే రూ.50,000 క్లెయిమ్‌లో పాలసీహోల్డర్‌ రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. బీమా సంస్థ రూ.45,000 చెల్లిస్తుంది. కోపేమెంట్‌ అనేది ప్రతి క్లెయిమ్‌కు వర్తిస్తుంది.

అదే డిడక్టబుల్‌ అనేది ఏడాది మొత్తానికి (కొన్ని బీమా సంస్థల్లో) స్థిరంగా ఉంటుంది. డిడక్టబుల్‌ ఎంత ఎక్కువ పెట్టుకుంటే, ప్రీమియం అంత మేర తగ్గుతుంది. క్లెయిమ్‌లలో ఆ మేర భారం పాలసీదారులపై పడుతుంది. మరొక ఉదాహరణలో.. ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకుంటే రూ.2,00,000 బిల్లు వచి్చంది. డిడక్టబుల్‌ రూ.20,000 ఉంటే, అప్పుడు పాలసీదారు ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన రూ.1,80,000 కోసం బీమా సంస్థ వద్ద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. డిడక్టబుల్‌లో ఇప్పటి వరకు చెప్పుకున్నది స్వచ్చందమైనది.

రూమ్‌ రెంట్‌
ఆస్పత్రిలో చేరిప్పుడు పొందే రూమ్‌ వసతి కూడా ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఎలాంటి పరిమితులు లేని ప్లాన్‌తో పోలిస్తే సింగిల్‌ రూమ్, షేరింగ్‌ రూమ్‌ ఆప్షన్‌తో కూడిన పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు ఉంటాయి. అన్నింటిలోకి షేరింగ్‌ తక్కువగా ఉంటుంది. కనుక షేరింగ్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రీమియం తగ్గేలా చూసుకోవచ్చు.

ఒకవేళ షేరింగ్‌ ఎంపిక చేసుకుంటే.. ఆస్పత్రిలో చేరినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ షేరింగ్‌ వసతికే పరిమితం కావడం మంచిది. ఖరీదైన వసతి తీసుకుంటే ఆస్పత్రి బిల్లులో కొంత పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం రూమ్‌ రెంట్‌ వరకే పరిమితం కాదు. ఎందుకంటే ఖరీదైన వసతిలో ఉండి పొందే వైద్యం సాధారణ షేరింగ్‌ రూమ్‌లో పొందే వైద్యంతో పోలిస్తే అధిక వ్యయాలతో ఉంటుంది. కనుక పాలసీ క్లాజ్‌లో ఉన్న వసతికి మించి ఖరీదైన వసతిలో ఉంటే బిల్లులో కొంత మొత్తాన్ని పాలసీదారు చెల్లించాలి.

ఫిట్‌గా ఉంటే ప్రయోజనం
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం ద్వారా ప్రీమియంలో తగ్గింపు పొందే అవకాశం ఉంది. రోజువారీ వ్యాయామం చేసే పాలసీహోల్డర్లకు బీమా సంస్థలు రివార్డు పాయింట్లు కేటాయిస్తున్నాయి. ఒక ఏడాది మొత్తం మీద ఇలా పొందిన రివార్డు పాయింట్లను, మరుసటి ఏడాది రెన్యువల్‌ ప్రీమియంలో తగ్గింపునకు వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు రోజువారీ 10,000 అడుగులు నడవడం. లేదంటే రోజులో కనీసం 4,000 అడుగులు నడవడం వంటివి. లేదా జాగింగ్‌ చేయడం ద్వారా హెల్త్‌ రివార్డులు సంపాదించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ హెల్త్‌ రివార్డులతో ప్రీమియంలో నూరు శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.  

పోర్టింగ్‌
మొబైల్‌ నంబర్‌ పోర్టబులిటీ మాదిరే, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను కూడా ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు పోర్టింగ్‌ పెట్టుకోవచ్చు. బీమా సంస్థ సేవలు నచ్చకపోయినా, ప్రీమియం భారం అనిపించినా.. కారణం ఏదైనా పోర్టింగ్‌ సదుపాయం ఉంది. పోర్టింగ్‌ వల్ల పూర్వపు బీమా సంస్థలో పొందిన ప్రయోజనాలు క్యారీ ఫార్వార్డ్‌ (బదిలీ) అవుతాయి. పోర్టింగ్‌ వల్ల నో క్లెయిమ్‌ బోనస్‌ ఒక్కటి నష్టపోవాల్సి రావచ్చు.

పాత సంస్థలో ముందు నుంచి ఉన్న వ్యాధులకు వెయిటింగ్‌ పీరియడ్‌ పూర్తి చేసి ఉంటే, కొత్త సంస్థలో మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. పాలసీ రెన్యువల్‌ గడువుకు 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు కొత్త సంస్థ వద్ద పోర్టింగ్‌ అభ్యర్థన దాఖలు చేసుకోవాలి. ప్రస్తుత పాలసీలోని కవరేజీ ఫీచర్లతో పోలిస్తే, మెరుగైన సదుపాయాలతో తక్కువ ప్రీమియంతో ఆఫర్‌ చేస్తున్న సంస్థకు మారిపోవడం వల్ల కొంత ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది.  

సూపర్‌ టాపప్‌
వృద్ధాప్యంలో నామమాత్రపు కవరేజీ చాలకపోవచ్చు. మెరుగైన కవరేజీతోనే తగినంత రక్షణ లభిస్తుంది. కానీ, మెరుగైన కవరేజీ కోసం ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌ను పరిమిత కవరేజీతో తీసుకోవాలి. దీనివల్ల ప్రీమియం తగ్గించుకోవచ్చు. దీనికి అదనపు కవరేజీతో సూపర్‌ టాపప్‌ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకే పాలసీని అధిక కవరేజీతో తీసుకోవడంతో పోలిస్తే ప్రీమియం చాలా వరకు తగ్గుతుంది.

ఉదాహరణకు రూ.5 లక్షలకు బేసిక్‌ ప్లాన్‌ తీసుకుని, దీనికి రూ.20 లక్షల సూపర్‌ టాపప్‌ చేసుకున్నారని అనుకుందాం. క్లెయిమ్‌ రూ.5 లక్షలు దాటినప్పుడు, అదనపు మొత్తానికి సూపర్‌ టాపప్‌ ఇచి్చన బీమా సంస్థ నుంచి చెల్లింపులు వస్తాయి. రెగ్యులర్‌ ప్లాన్‌తో పోలిస్తే ఇలా చేయడం వల్ల ప్రీమియంను 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ టాపప్‌ ప్లాన్లు కూడా ఉన్నాయి. కానీ టాపప్, సూపర్‌ టాపప్‌ మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

టాపప్‌ ప్లాన్‌లో ఒక పాలసీ సంవత్సరంలో ప్రతి క్లెయిమ్‌కు విడిగా నిర్ణీత మొత్తం దాటినప్పుడే చెల్లింపులు లభిస్తాయి. సూపర్‌ టాపప్‌ ప్లాన్‌లో అలా కాదు. ఏడాది మొత్తం మీద నిర్ధేశిత డిడక్టబుల్‌ ఒక్కటిగానే ఉంటుంది. అంటే బేస్‌ ప్లాన్‌ రూ.5 లక్షలు తీసుకున్నారు. దీనికి టాపప్‌ జోడించుకుంటే, ప్రతి క్లెయిమ్‌లోనూ రూ.5 లక్షలు మించినప్పుడే, రూ.5 లక్షలు మినహాయించి (డిడక్టబుల్‌) మిగిలినది టాపప్‌ నుంచి చెల్లింపులు వస్తాయి.

అదే సూపర్‌ టాపప్‌లో.. ఒక ఏడాదిలో మూడు పర్యాయాలు ఆస్పత్రిలో చేరి (రూ.3లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు) రూ.10 లక్షలు బిల్లు వచి్చ నా, రూ.5 లక్షలు డిడక్టబుల్‌ పోను, మిగిలిన రూ.5 లక్షలను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. బేస్‌ ప్లాన్‌ పరిమిత కవరేజీతో తీసుకుని, సూపర్‌ టాపప్‌ జోడించుకోలేని వారు.. చిన్న వాటికి క్లెయిమ్‌ చేసుకోకుండా ఉంటే మంచిది. దీనివల్ల నో క్లెయిమ్‌ బోనస్‌ రూపంలో బీమా కవరేజీని ఎలాంటి అదనపు ప్రీమియం లేకుండా నూరు శాతం వరకు పెంచుకోవచ్చు.

వీటిని అనుసరించొచ్చు..
     హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను చిన్న వయసులోనే తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆ వయసులో ఉండవు. దీంతో ప్రీమియం తక్కువగా ఉంటుంది. నేరుగా 60 ఏళ్ల తర్వాత పాలసీ తీసుకునే వారితో పోలిస్తే, ముందు నుంచే హెల్త్‌ కవరేజీలో ఉన్న వారికి ప్రీమియం కొంత తక్కువ ఉంటుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. వారికి రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని అధిక ప్రీమియాన్ని కంపెనీలు చార్జ్‌ చేస్తుంటాయి.

► హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా బీమా సంస్థ పోర్టల్‌ నుంచి కొనుగోలు చేస్తే ప్రీమియం 5–10% తక్కువగా ఉంటుంది. కమీషన్లు, ఇతర వ్యయాల భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థలు డిస్కౌంట్‌ ఇస్తాయి. పైగా ఆన్‌లైన్‌లో అన్ని బీమా సంస్థల ప్లాన్ల ఫీచర్లు, ప్రీమియంను పోల్చి చూసుకునే వెసులుబాటు పాలసీబజార్‌ వంటి వేదికలు కలి్పస్తున్నాయి. ఈ విధంగానూ ప్రీమియం భారం తగ్గవచ్చు.
► విడిగా ప్లాన్‌ తీసుకోవడానికి  బదులు కుటుంబం అంతటికీ ఒక్కటే ఫ్లోటర్‌ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది.  
► అవసరం లేని కవరేజీలకు దూరంగా ఉండాలి. అవసరం లేని యాడాన్‌లను జోడించుకుంటే ప్రీమియం భారం పెరుగుతుంది.  
► రూ.5 లక్షల బేసిక్‌ కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.20–50 లక్షలకు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ జోడించుకుంటే ప్రీమియం ఆదా అవుతుంది.
► తమ పిల్లలు కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తుంటే, వారి కార్యాలయం తరఫున తల్లిదండ్రులు కవరేజీ కల్పించుకోవడం ఒక మార్గం. గ్రూప్‌ ప్లాన్‌ కావడంతో ప్రీమియం తగ్గుతుంది.
► ఇక ప్రీమియంలో ఆదా కోరుకునే వారు ఒక ఏడాదికి కాకుండా మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించడాన్ని పరిశీలించొచ్చు. దీనివల్ల ప్రీమియంలో 10 శాతం వరకు ఆదా అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement