ఈపీఎఫ్‌ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?  | Sakshi explanation Of EPF claim Details | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..? 

Published Mon, Apr 28 2025 5:56 AM | Last Updated on Mon, Apr 28 2025 7:55 AM

Sakshi explanation Of EPF claim Details

నిబంధనలు, అర్హతలు తెలుసుకోవాలి

విద్య, వైద్యం, ఇంటి కోసం తీసుకోవచ్చు

ఇంటి కోసం 90% వరకు అనుమతి

మిగిలిన వాటికి ఉపసంహరణ పరిమితంగానే 

కొన్ని క్లెయిమ్‌లకు కనీస సర్వీస్‌ ఉండాల్సిందే

ఐదేళ్లలోపు రూ. 50 వేలు మించితే టీడీఎస్‌

వేతన జీవుల్లో అధిక శాతం మందికి నెలవారీ ఖర్చులు ఆదాయాన్ని మించుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణాలను ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితమే పర్సనల్, క్రెడిట్‌ కార్డ్, బంగారం రుణాలు గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా పెరిగిపోవడం చూస్తున్నాం. కానీ, ఒక్కసారి ఈ రుణ చక్రంలోకి దిగితే.. అది అంత తొందరగా విడిచిపెట్టదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఇటీవలి కాలంలో వేతన జీవుల నుంచి భవిష్యనిధి క్లెయిమ్‌లు పెరగడం చూస్తున్నాం. అత్యవసరాల్లో ఈపీఎఫ్‌ నుంచి పాక్షిక ఉపసంహరణ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకుంటున్నారు. నిర్దేశిత అర్హతలు, నిబంధనల మేరకే ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ చేసుకోగలరు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిపుణులు అందిస్తున్న సమాచారం ఇది...     

‘ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌’ (ఈపీఎఫ్‌) వేతన జీవుల భవిష్యత్‌ లక్ష్యాల కోసం ఉద్దేశించిన సాధనం అని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్‌ అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో సొంతిల్లు, వైద్య అవసరాల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. భవిష్యత్‌ లక్ష్యాల కోసం ఉద్దేశించిన ఈ నిధిని తాత్కాలిక అవసరాల కోసం ఖాళీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. 

కానీ, ఆర్థిక, అత్యవసర పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించినప్పుడు.. రుణాలు తీసుకోవడం వల్ల చెల్లింపులు భారంగా మారతాయి. కనుక విశ్రాంత జీవనం కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కలిగిన వారు.. విద్య, వైద్యం, వివాహం వంటి అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన అవసరాల్లో ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ను పరిశీలించొచ్చు. అలాంటి సందర్భాల్లో ఎంత మేర వెనక్కి తీసుకోవచ్చు? అర్హతల గురించి ఉద్యోగులకు తప్పక అవగాహన ఉండాలి.  

ఏ అవసరానికి ఎంత? 
వివాహం లేదా ఉన్నత విద్య కోసం ఈపీఎఫ్‌ నిధిని వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీసం ఏడేళ్ల పాటు ఈపీఎఫ్‌ సభ్యుడు/సభ్యురాలిగా ఉంటేనే ఈ అవసరాల కోసం క్లెయిమ్‌ చేసుకునేందుకు అర్హత లభిస్తుందని ప్రావిడెంట్‌ ఫండ్‌ మాజీ ప్రాంతీయ కమిషనర్‌ సంజయ్‌ కేసరి తెలిపారు. ఉద్యోగంలో చేరిన తేదీ క్లెయిమ్‌ తేదీకి ఏడేళ్ల ముందు అయి ఉండాలన్నారు. ఈ నిబంధనలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. తన సర్విస్‌ మొత్తంలో ఉన్నత విద్య (పదో తరగతి తర్వాత చదువులు), వివాహ అవసరాల కోసం కలిపి మూడు పర్యాయాలు ఉపసంహరణకు వెళ్లొచ్చు. ఒకవేళ వైద్యం కోసం అయితే సర్విస్‌తో సంబంధం లేకుండా క్లెయిమ్‌కు వెళ్లొచ్చు. గరిష్టంగా క్లెయిమ్‌ ఇన్ని సార్లు అన్న పరిమితి అయితే లేదు. 

వివాహం 
ఉద్యోగి తన సొంత వివాహం కోసం, తన తోడ బుట్టిన వారి వివాహం కోసం, తన పిల్లల వివాహాల కోసం పీఎఫ్‌ నిధిని పొందొచ్చు. కనీసం ఏడేళ్ల సర్వీస్‌ ఉండాలి. ఉద్యోగి వాటాల రూపంలో జమలు, వడ్డీ నుంచి 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. 

వైద్యం 
సభ్యుడు, అతను/ఆమె జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తన పిల్లల వైద్యం కోసం తీసుకోవచ్చు. వైద్య అవసరాలకు కనీస సర్వీస్‌ నిబంధన వర్తించదు. ఎన్ని పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చన్న పరిమితి లేదు. ఉద్యోగి స్వీయ జమల రూపంలో పోగైన మొత్తం, వడ్డీ లేదా.. నెలవారీ మూలవేతనం, డీఏకి ఆరు రెట్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. 

ఇల్లు
ప్లాట్‌ కొనుగోలు లేదా ఇల్లు/ఫ్లాట్‌ నిర్మాణం, కొనుగోలు కోసం ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పీఎఫ్‌ క్లెయిమ్‌కు వెళ్లొచ్చు. కనీసం ఐదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి సొంతంగా లేదా జీవిత భాగస్వామితో కలసి జాయింట్‌గా ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండడం తప్పనిసరి. ప్లాట్‌ కొనుగోలుకు అయితే నెల జీతానికి 24 రెట్లు.. ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం అయితే నెలవారీ జీతానికి 36 రెట్లు.. లేదా ఉద్యోగి, యాజమాన్యం జమలు, వీటిపై వడ్డీ మొత్తం.. లేదా కొనుగోలు/నిర్మాణ వ్యయం.. ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.  

గృహ నవీకరణ 
ఇల్లు నిర్మించుకున్న ఐదేళ్ల తర్వాత అనుమతిస్తారు. ఉద్యోగి నెలవారీ మూలవేతనం, డీఏకి 12 రెట్ల వరకు తీసుకోవచ్చు. లేదా ఉద్యోగి స్వీయ జమలు, వాటిపై వడ్డీ.. లేదా నవీకరణకు అయ్యే వ్యయం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్నే అనుమతిస్తారు.  

గృహ రుణం తీర్చివేసేందుకు 
కనీసం మూడేళ్ల సర్విస్‌ పూర్తి చేసి ఉండాలి. బ్యాలన్స్‌ నుంచి 90% వెనక్కి తీసుకోవచ్చు.  

విద్య 
తన కుమారుడు లేదా కుమార్తెల ఉన్నత విద్య కోసమే భవిష్య నిధి నుంచి పాక్షిక ఉపసంహర ణకు అనుమతిస్తారు. కనీసం ఏడేళ్ల సర్విస్‌ ఉండాలి. ఉద్యోగి జమలు, వడ్డీ మొత్తం నుంచి 50 శాతాన్ని తీసుకోవచ్చు. ఇలా 3 పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చు. ఈ 3 సార్లు అన్న పరిమితి వివాహం, విద్యకు కలిపి వర్తిస్తుంది.  

ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో.. 
ఒకచోట ఉద్యోగం కోల్పోవడం లేదంటే మానివేసి.. నెల రోజులకు పైగా మరో ఉపాధి లేని పరిస్థితుల్లో పీఎఫ్‌ బ్యాలన్స్‌ నుంచి 75 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉపాధి లేకుండా రెండు నెలలు దాటిపోతే అప్పుడు మిగిలిన 25 శాతాన్ని కూడా వెనక్కి తీసేసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఒక సంస్థలో ఉద్యోగం మానేశామన్న కారణంతో పీఎఫ్‌ ఖాతాను ఖాళీ చేయాలనేమీ లేదు. మరో సంస్థలో చేరిన తర్వాత పీఎఫ్‌ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. తద్వారా అందులో ప్రయోజనాలను అలాగే కొనసాగించుకోవచ్చు.

ఉపసంహరణ ఎలా..? 
ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ ప్రక్రియను ఈపీఎఫ్‌వో ఎంతో సులభతరం చేసింది. ఈపీఎఫ్‌ ఇండియా పోర్టల్‌కు వెళ్లి కుడి భాగంలో పైన కనిపించే ‘ఆన్‌లైన్‌ క్లెయిమ్స్‌’ దగ్గర క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ప్రత్యేక విండో తెరుచుకుంటుంది. అక్కడ ‘యూఏఎన్‌’ నంబర్, పాస్‌వర్డ్‌ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్‌ అవ్వాలి. లాగిన్‌ పూర్తయిన తర్వాత పైన కనిపించే ఆప్షన్లలో ‘ఆన్‌లైన్‌ సర్విసెస్‌’ సెక్షన్‌లో ‘క్లెయిమ్‌ ఫారమ్‌’ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్‌కు లింక్‌ చేసిన బ్యాంక్‌ ఖాతా నంబర్‌ను నమోదు చేసి ధ్రువీకరించాలి. అక్కడ పీఎఫ్‌ అడ్వాన్స్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

ఆ తర్వాత సెలక్ట్‌ సర్వీస్‌ దగ్గర పనిచేస్తున్న సంస్థను ఎంపిక చేసుకోవాలి. దాని కింద క్లెయిమ్‌ దేనికోసమన్న కారణాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అక్కడ కోరిన వివరాలు ఇచ్చి దరఖాస్తును సమర్పించాలి. చివరిగా మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన అనంతరం అది విజయవంతంగా దాఖలవుతుంది. క్లెయిమ్‌ దరఖాస్తు పురోగతిని సైతం ఇదే మాదిరి లాగిన్‌ అయ్యి చెక్‌ చేసుకోవచ్చు. పరిశీలన కోసం చెక్‌ కాపీని స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి రావచ్చు. కనుక ముందే సిద్ధం చేసుకోవాలి. సంబంధిత చెక్‌ లీఫ్‌పై సభ్యుడి పేరు, బ్యాంక్‌ ఖాతా తదితర వివరాలు ఉండాలి. ఉమంగ్‌ యాప్‌ నుంచి కూడా క్లెయిమ్‌ దాఖలు చేసుకోవచ్చు.  

అదే ఆఫ్‌లైన్‌లో క్లెయిమ్‌ దరఖాస్తు సమర్పించేందుకు, కావాల్సిన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళితే సరిపోతుంది. అక్కడ విత్‌డ్రాయల్‌ ఫారమ్‌ పూరించి, వారు కోరినట్టు డాక్యుమెంట్లను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ దరఖాస్తు 3–4 రోజుల్లో పరిష్కారం అవుతుంది. క్లెయిమ్‌ రూ. లక్ష లోపు ఉంటే ఆటోమేటిక్‌గా అనుమతి లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో ఇందుకు 10–20 రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్‌ ఖాతా నుంచి ఉపసంహరించుకున్న నిధులను, రుణం కాదు కనుక తిరిగి జమ చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ఈపీఎఫ్‌ బ్యాలన్స్‌పై ఎలాంటి రుణ సదుపాయం లేదు.  

→ క్లెయిమ్‌ భారీగా ఉంటే అప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు లేదా వైద్య డాక్యుమెంట్ల కాపీలు అప్‌లోడ్‌ చేయాల్సి రావచ్చు.  
→ అర్హతలు, పరిమితులను ఒక్కసారి సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్యమైన అవసరాల్లోనే ఈపీఎఫ్‌ను వివేకంగా ఉపయోగించుకోవాలన్నది నిపుణుల సూచన.  
→ ఈపీఎఫ్‌ క్లెయిమ్‌కు వెళ్లే ముందు తమ కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయేమో ఒక్కసారి సరిచూసుకోవాలి. అంటే బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఆధార్, పాన్‌ వివరాలు నమోదు చేసి, ధ్రువీకరించి ఉండాలి. దీనివల్ల క్లెయిమ్‌ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉంటుంది.  

54 ఏళ్లు నిండితే..
54 ఏళ్లు నిండిన తర్వాత, ముందస్తు పదవీ విరమణ/వయోభారం రీత్యా విరమణ చేసిన వారు 58 ఏళ్లు రాకముందే మొత్తం పీఎఫ్‌ బ్యాలన్స్‌లో 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు.

పన్ను భారం? 
ఈపీఎఫ్‌ ఖాతా ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత ఉపసంహరణకు వెళితే ఆ మొత్తంపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ సర్విస్‌ ఐదేళ్లలోపు ఉండి, ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే అప్పుడు దీనిపై 10 శాతం టీడీఎస్‌ మినహాయిస్తారు. పాన్‌ నంబర్‌ ఇవ్వకపోతే 20 శాతం టీడీఎస్‌ పడుతుంది. ఐదేళ్లలోపు రూ.50 వేలకు మించి ఉపసంహరించుకుంటే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి రాకపోతే, పీఎఫ్‌పై మినహాయించిన టీడీఎస్‌ను రిఫండ్‌ కోరొచ్చు. ఒకవేళ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురై లేదా కంపెనీ మూసివేసిన కేసుల్లో ఉద్యోగులు పీఎఫ్‌ నిధిని ఉపసంహరించుకుంటే, అప్పుడు సర్విస్‌ ఐదేళ్లలోపు ఉన్నా సరే ఆ మొత్తం పన్ను పరిధిలోకి రాదు.  

    – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement