మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోంది. ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది ఆరోగ్య బీమాను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ ప్రస్తుతం మారుతున్న విధానాలకు అనుగుణంగా లేకపోవచ్చు. మార్కెట్‌లో పోటీ నెలకొని ఇతర కంపెనీలు తక్కువ ప్రీమియంతో మరింత మెరుగైనా సదుపాయాలుండే పాలసీని అందిస్తుండవచ్చు. అలాంటి సందర్భంలో పాలసీను రద్దు చేసుకోకుండా ‘పోర్టబిలిటీ’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల పాలసీను వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీని పెంచడానికి, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ‘పోర్టబిలిటీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వెయిటింగ్ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య బీమా పాలసీని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు.
ప్రస్తుత పాలసీ నిబంధనలు, షరతులు మీ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు పోర్ట్‌కు ప్రయత్నించాలి.
పాలసీ చెల్లించే విలువ తక్కువగా ఉంటూ, ప్రీమియం అధికంగా ఉన్నప్పుడు పోర్ట్‌ను పరిశీలించవచ్చు. అయితే అందులో అధిక క్లెయిమ్ ఇచ్చే సంస్థలను ఎంచుకుంటే ఉత్తమం.
స్థానిక ఆసుపత్రులు బీమా సంస్థ నెట్‌వర్క్ కవరేజ్ జాబితాలో లేనప్పుడు ఈ విధానాన్ని పరిశీలించాలి.
ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పాలసీ రెన్యువల్ చేయడానికి 45 రోజుల ముందే అవసరమైన చర్యలు ప్రారంభించాలి.
ప్రస్తుతం చాలా సంస్థలు రెన్యువల్‌కు ఒక రోజు ముందు, పాలసీ గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పోర్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.
పోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మేలు.
తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత కొత్త సంస్థ పాలసీని ఇవ్వలేమంటే ఇబ్బందులు ఎదురవుతాయి.
గమనించాల్సినవి..
పాలసీని పోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు ప్రధానంగా బీమా మొత్తంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక బీమా సంస్థలో రూ.5లక్షల పాలసీ ఉందనుకుందాం. బోనస్‌తో కలిపి ఈ మొత్తం రూ.7.50లక్షలు అయ్యింది. కొత్త బీమా సంస్థకు మారి, రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు కొత్త సంస్థ రూ.7.5 లక్షల వరకే పాత పాలసీగా భావిస్తుంది. మిగతా రూ.2.5 లక్షలను కొత్త పాలసీగానే పరిగణిస్తుంది. ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనికి ఇతర షరతులూ వర్తిస్తాయి.
ఇదీ చదవండి: 13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్
వివరాలు అన్నీ తెలపాలి..
కొత్త సంస్థకు మారేటప్పుడు ఇప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లెయిమ్ వివరాలు స్పష్టంగా చెప్పాలి. ఆరోగ్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించీ వివరించాలి. పాలసీ ఇవ్వరు అనే ఆలోచనతో చాలామంది ఇవన్నీ చెప్పరు. కానీ, పాలసీ వచ్చిన తర్వాత ఇవి బయటపడితే పరిహారం లభించదు.
Comments
Please login to add a commentAdd a comment