
సంరక్షకులుగా, కుమార్తెలుగా, మాతృమూర్తులుగా తమ కుటుంబాల సంక్షేమం కోసం మహిళలు సమాజంలో ఎంతో కీలకమైన, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించడంలో వారు సాధారణంగానే తమ సొంత ఆర్థిక, వైద్య భద్రత విషయాలను అంతగా పట్టించుకోరు. అందుకే చాలా మంది మహిళలకు తగినంత బీమా భద్రత లేకపోవడమో లేదా పూర్తిగా తమ జీవిత భాగస్వామి లేదా బంధువు బీమాపైనో ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటోంది. జీవిత కాలం ఎక్కువగా ఉండటం, కెరియర్‌లో అంతరాయాలు, భారీ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లాంటి ప్రత్యేక ఆరోగ్య, ఆర్థిక సవాళ్లెన్నో మహిళలకు ఉంటాయి. అందుకే వారి స్వాతంత్య్రానికి, స్థిరత్వానికి తగినంత బీమా రక్షణ ఉండటం ఎంతో అవసరం.
కీలకంగా బీమా ..
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవించినప్పటికీ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిమితుల కారణంగా సుదీర్ఘ కాలం పాటు మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండకపోవచ్చు. సమగ్రమైన బీమా కవరేజీ ఉంటే సముచితమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి అవకాశాలు గణనీయంగా మెరుగుపడగలవు. 2023, 2024 మధ్య కాలంలో చూస్తే 15 నుంచి 49 ఏళ్ల వరకు వయస్సున్న మహిళల్లో 30 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య బీమా గానీ ఆర్థిక రక్షణ కవచం గానీ లేదని వెల్లడైంది. ఇలా చాలా మంది మహిళలు తమ సొంత అవసరాలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలకే ప్రాధాన్యమిస్తుంటారు. ఆర్థిక పరిమితుల వల్ల నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతుంటారు.
మెటర్నిటీ, కుటుంబ భద్రత
ప్రసవానికి పూర్వ పరీక్షలు, ప్రసవ వ్యయాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల వైద్య అవసరాలకు అవసరమైన కీలక ఆర్థిక సహాయాన్ని మెటర్నిటీ ఇన్సూరెన్స్ అందిస్తుంది. పిల్లల కోసం సన్నద్ధమవుతున్న యువ జంటలకు ఇలాంటి పాలసీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శిశుజననం, సంబంధిత ఖర్చుల విషయంలో ఆర్థికంగా సన్నద్ధంగా ఉండేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. చాలా మంది మహిళలు సాధారణంగా ఉద్యోగాలు చేసే సంస్థ ఇచ్చే బీమాపైనో లేదా జీవిత భాగస్వామి బీమాపైనో ఆధారపడుతుంటారు. కానీ సొంతంగా పాలసీ ఉంటే మరింత ఆర్థిక భద్రత ఉంటుంది. కెరియర్ మార్పుల వల్ల లేదా జీవితంలో మార్పుల వల్ల కవరేజీపై ప్రభావం పడే పరిస్థితుల్లో ఇదెంతో అండగా ఉంటుంది.
రిటైర్మెంట్, దీర్ఘకాలిక సంరక్షణ ప్రణాళిక
మహిళలు సాధారణంగా పెద్ద వయస్సులోని బంధువుల బాగోగులను చూసుకునే సంరక్షకుల పాత్రను కూడా పోషిస్తూ ఉంటారు. ఇది భావోద్వేగాలపరంగా, ఆర్థికంగా భారంగా ఉండొచ్చు. దీర్ఘకాలిక సంరక్షణ బీమా అనేది వైద్య వ్యయాలను, ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంరక్షకులు అలాగే వారిపై ఆధారపడిన వారికి కూడా మెరుగైన సహాయం లభించేలా తోడ్పడుతుంది. అంతేగాకుండా, జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ త ర్వాత కూడా స్థిరమైన, మెరుగైన జీవితాన్ని సాగించేలా మహిళలు పెన్షన్ ప్లాన్లు లేదా యాన్యుటీ ఆధారిత బీమా పాలసీలను తప్పక పరిశీలించాలి.
వైకల్యం, ఆదాయ భద్రత
పిల్లల సంరక్షణ కోసం కావచ్చు లేదా వయస్సు పైబడుతున్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం కావచ్చు చాలా మంది మహిళలకు కెరియర్‌లో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. దీనితో వారు పని చేసే కంపెనీల నుంచి బీమా ప్రయోజనాలు పరిమితంగానే ఉండొచ్చు. అలాగే దీర్ఘకాలిక పొదుపు కూడా తగ్గుతుంది. అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడి పని చేసే పరిస్థితి లేనప్పుడు కూడా స్థిరమైన ఆదాయం లభించేలా డిజేబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక భద్రతను అందిస్తుంది. జీవితపు అనిశ్చితుల్లోనూ ఆర్థిక భద్రత ఉండేందుకు ఈ రక్షణ ఉపయోగపడుతుంది.
స్థిరమైన భవిష్యత్తుకు రక్షణ కవచం
మహిళలు తమ ఆర్థిక స్వతంత్రత, ఆరోగ్య సంరక్షణ భద్రతకు తప్పక ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత ముందుగా సమగ్ర బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అనూహ్య ఆర్థిక కష్టాల నుంచి రక్షణను, దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వీలవుతుంది. క్రియాశీలకమైన చర్యలు తీసుకోవడం ద్వారా అనుకోని సవాళ్ల నుంచి మహిళలు తమను, తమ కుటుంబాలను రక్షించుకోవచ్చు.
స్వతంత్రంగా నిర్ణయాలు
తొలినాళ్లలోనే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మహిళలు ఆర్థిక ప్రణాళికల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. చిన్న వయస్సులోనే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ–ఎగ్జిస్టింగ్ కండీషన్స్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజన్స్ కూడా తగ్గుతాయి. యుక్తవయస్సులోని చాలా యువతులకు తమ తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభిస్తుంది. అయితే, స్వతంత్ర పాలసీకి మారడం వల్ల, డిపెండెంట్ కవరేజీ వయో పరిమితిని దాటిన తర్వాత కూడా నిరంతరాయ కవరేజీ, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
ఇదీ చదవండి: ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?
స్మార్ట్ ఆర్థిక ప్రణాళిక
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 80డీ కింద జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఆ రకంగా చూస్తే ఇవి ఆర్థికంగా స్మార్ట్ పెట్టుబడి సాధనాలుగా కూడా ఉంటాయి. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన మహిళలకు తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ, తద్వారా దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రత ప్రయోజనాలు లభిస్తాయి. మెటర్నిటీ కేర్, డెలివరీ, ఫెర్టిలిటీ చికిత్సలు సహా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోగ్యసంరక్షణ అవసరాలను తీర్చే విధంగా బీమా పాలసీలు ఉంటాయి. మూడేళ్ల పాటు లైఫ్ కవరేజీ సహా సరోగేట్ తల్లులకు పూర్తి కవరేజీ ఉండాలని బీమా రంగ నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నిర్దేశిస్తోంది.
-అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్
Comments
Please login to add a commentAdd a comment