ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా? | Reduce Burdens to the Health Insurance Premium | Sakshi
Sakshi News home page

ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?

Published Mon, Feb 24 2025 3:58 AM | Last Updated on Mon, Feb 24 2025 3:58 AM

Reduce Burdens to the Health Insurance Premium

ప్రీమియం తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలు

సమ్‌ అష్యూర్డ్‌ పరిమితంగానే తీసుకోవాలి

దీనికి సూపర్‌ టాపప్‌ జోడించాలి

బోనస్, రీస్టోరేషన్‌ ఫీచర్లు ఉండాలి

కేలరీలు ఖర్చు చేస్తే రాయితీ

క్రెడిట్‌ స్కోరు బలంగా ఉన్నా డిస్కౌంట్‌  

ఆరోగ్య అత్యవసర స్థితి చెప్పి రాదు. ఆహారం, నిద్ర వేళల్లో మార్పులు.. గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల ప్రభావంతో జీవనశైలి వ్యాధుల రిస్క్‌ పెరిగింది. వీటి కారణంగా ఆస్పత్రి పాలైతే బిల్లులు చెల్లించడం మెజారిటీ వ్యక్తులకు అసాధ్యమే కాదు, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి. ఇలాంటి అనిశ్చితులకు రక్షణ కవచమే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ.

 కరోనా తర్వాత వీటి ప్రీమియంలు దాదాపుగా రెట్టింపయ్యాయి. మోయలేనంత భారంగా మారాయి. ఇది చూసి ఇప్పటికీ హెల్త్‌ ప్లాన్‌కు దూరంగా ఉన్నవారు ఎందరో. కానీ, ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ ఇది తప్పనిసరి. కావాలంటే ప్రీమియం తగ్గించుకునే మార్గాన్ని వెతకండి. అంతేకానీ, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా రక్షణ కల్పించే హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉండొద్దనేది నిపుణుల మాట!      

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అధ్యయనం ప్రకారం.. దేశంలో 35 శాతం మంది హైపర్‌టెన్షన్‌ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నారు. 10 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్‌ను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మరోవైపు వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సా విధానాలు.. మరింత కచ్చితత్వంతో, మెరుగైన ఫలితాలనిచ్చే రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యయాలను అందరూ భరించలేరు. అందుకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తప్పకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను వీలైనంత చిన్న వయసులోనే తీసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఖరారవుతుంది. వయసు, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను బీమా సంస్థ పాలసీ జారీకి ముందు మదింపు చేస్తుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు విషయంలో.. 25 ఏళ్ల వయసు వ్యక్తికి, 40 ఏళ్ల వయసు వ్యక్తికి ప్రీమియంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చిన్న వయసులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, ఆ తర్వాతి కాలంలో ప్రీమియం పెరగదా? అన్న సందేహం రావచ్చు. 

35 ఏళ్లు నిండిన తర్వాత, 45 ఏళ్లు, 55 ఏళ్లు, 60 ఏళ్లు నిండిన తర్వాత వయసువారీ ప్రీమియం రేట్లు కచ్చితంగా సవరణకు నోచుకుంటాయి. కానీ, 35–40 ఏళ్ల తర్వాత కొత్తగా పాలసీ తీసుకునే వారితో పోల్చితే, 25 ఏళ్లలోపు వారికి ప్రీమియం తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే, మూడేళ్లలో అన్ని రకాల వెయిటింగ్‌ పీరియడ్‌లు దాటేస్తారు. ముందస్తు వ్యాధులకు సైతం కవరేజీ అర్హత లభిస్తుంది. పైగా పాలసీ తీసుకుని 60 నెలలు (ఐదేళ్ల ప్రీమియం చెల్లింపులు) ముగిస్తే, ఆరోగ్య చరిత్రను సరిగ్గా వెల్లడించలేదనో, సమాచారం దాచిపెట్టారనే కారణంతో క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలతోపాటు ప్రీమియం భారం తగ్గుతుంది.  

బోనస్, రీస్టోరేషన్‌ 
కేవలం రూ.5 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌నే తీసుకున్నప్పటికీ అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కవరేజీని పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బీమా కంపెనీలు నో క్లెయిమ్‌ బోనస్, రీస్టోరేషన్‌ ఫీచర్లను అందిస్తున్నాయి. ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌ లేకపోతే 50–200 శాతం మేర సమ్‌ అష్యూర్డ్‌ (బీమా కవరేజీ)ను నో  క్లెయిమ్‌ బోనస్‌ రూపంలో బీమా సంస్థలు ఇస్తుంటాయి. 

అప్పుడు రూ.5 లక్షల కవరేజీ రూ.10–15 లక్షలకు చేరుతుంది. రీస్టోరేషన్‌ సదుపాయం అన్నది.. హాస్పిటల్‌లో చేరినప్పుడు కవరేజీ పూర్తిగా అయిపోతే అంతే మొత్తాన్ని తిరిగి ఆ పాలసీ సంవత్సరానికి పునరుద్ధరించడం. కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో ఒక్క రీస్టోరేషన్‌నే ఇస్తుంటే, కేర్, ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తదితర కంపెనీలు కొన్ని ప్లాన్లలో అపరిమిత రీస్టోరేషన్‌ సదుపాయాలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బేస్‌ సమ్‌ అష్యూర్డ్‌ తక్కువగా ఎంపిక చేసుకున్నప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా ప్రీమియం భారం తగ్గుతుంది.  

చిన్న క్లెయిమ్‌లకు దూరం
 ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్‌ లేకపోతేనే నో క్లెయిమ్‌ బోనస్‌ వస్తుంది. కనుక చిన్న క్లెయిమ్‌లకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు రూ.5 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు ఎలాంటి క్లెయిమ్‌ లేకపోతే ఏటా 50 నుంచి 100 శాతం చొప్పున సమ్‌ అష్యూర్డ్‌ పెరుగుతుంది. ఒకవేళ క్లెయిమ్‌ చేస్తే ఎంత అయితే పెరిగిందో, అంతే మేర తగ్గిపోతుంది. కనుక చిన్న క్లెయిమ్‌ కోసం రూ.2.5–5 లక్షల సమ్‌ అష్యూర్డ్‌ను ఒక ఏడాదిలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రూ.50 వేల లోపు చిన్న వ్యయాలను సొంతంగా భరించడమే మంచిది.  

మంచి ఆహారం, జీవనశైలి.. 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నాం కదా అన్న భరోసాతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తామా? అలా చేయడం మన సమస్యలను మరింత పెంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం తమ వంతు కృషి చేయాల్సిందే. దీనివల్ల ఆస్పత్రి పాలు కావడాన్ని సాధ్యమైన మేర నివారించొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో చాలా వరకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తే అంత ప్రయోజనం లభిస్తుంది.

 రోజువారీ నడక, పరుగు, ఏరోబిక్‌ వ్యాయా మాలు చేయడం ద్వారా హెల్త్‌ క్రెడిట్స్‌ పొందొచ్చు. వీటిని ప్రీమియంలో సర్దుబాటు చేసుకోవచ్చు. తద్వారా ప్రీమియంలో 100% రాయితీని సైతం కొన్ని సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం, గుట్కా/జర్దాలకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల గురించి ఆరోగ్య చరిత్రలో వెల్లడించాల్సిందే. వీటి కారణంగా ప్రీమియం గణనీయంగా పెరిగిపోతుంది. వీటిని మానేయడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు.

సూపర్‌ టాపప్‌ 
నేటి రోజుల్లో నలుగురు సభ్యుల ఒక కుటుంబానికి కనీసం రూ.10 లక్షల హెల్త్‌ కవరేజీ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది కూడా చాలకపోవచ్చు. కానీ, రూ.10 లక్షల హెల్త్‌ ప్లాన్‌ కోసం 30 ఏళ్ల వ్యక్తి కుటుంబానికి రూ. 20 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు రూ.5 లక్షల బేసిక్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌ పరిశీలించొచ్చు. దీనికి అదనంగా రూ.5 లక్షల డిడక్టబుల్‌తో సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవాలి.

 ఉదాహరణకు రూ.50 లక్షల సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ రూ.3,000కే వస్తుంది. ఇందులో మొదటి రూ.5 లక్షల బిల్లును మినహాయించి, ఆపై ఉన్న మొత్తానికి చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల హెల్త్‌ ప్లాన్‌ ప్రీమియం అందుబాటు ధరలోనే వస్తే, అప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ జోడించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది.  

మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ 
వ్యక్తిగత రుణ చరిత్రకు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.. కొన్ని బీమా సంస్థలు మెరుగైన సిబిల్‌ స్కోర్‌ ఉన్న కస్టమర్లకు ప్రీమియంలో తగ్గింపు ఇస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉందంటే.. ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని అర్థం. ఇలాంటి వారిని తక్కువ రిస్క్‌ కస్టమర్లుగా చూస్తూ ప్రీమియంలో డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. 15 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ, ఫీచర్లపై అవగాహన కలిగిన వారు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా ప్రీమియంలో డిస్కౌంట్‌ పొందొచ్చు. పైగా పాలసీబజార్‌ పోర్టల్‌పై మొబైల్‌ ఓటీపీతో లాగిన్‌ అయ్యి, అన్ని బీమా సంస్థల పాలసీలను పరిశీలించొచ్చు. వాటి ఫీచర్లు, ప్రీమియం వ్యత్యాసాన్ని గమనించొచ్చు. తద్వారా మెరుగైన ఫీచర్లతో, తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీని గుర్తించొచ్చు. బీమా సంస్థ పోర్టల్‌ ద్వారా నేరుగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్వయంగా వివరాలు నమోదు చేయడం, నియమ, నిబంధనల గురించి అవగాహన కూడా ఏర్పడుతుంది.  

కొంత రాజీపడితే? 
సదుపాయాల విషయంలో కొంత రాజీధోరణితో వెళ్లేట్టు అయితే అప్పుడు కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇందులో రూమ్‌ టైప్‌ ఒకటి. ఆస్పత్రిలో చేరినప్పుడు రోగికి ఐసీయూ వెలుపల పడక అవసరమవుతుంది. జనరల్‌ వార్డ్, షేరింగ్, సింగిల్‌ రూమ్, డీలక్స్‌ రూమ్‌ ఇలా పలు రకాలుంటాయి. పడక విషయంలో ఎలాంటి పరిమితుల్లేని పాలసీకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుంటారు. 

ఒక విధంగా ఇదే సౌకర్యమైనది. ప్రీమియం భరించగలిగే వారు రూమ్‌ రెంట్‌లో పరిమితులు లేకుండా ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారంగా భావించే వారు.. షేరింగ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు రూమ్‌ల్లోని సేవలతో పోల్చినప్పుడు షేరింగ్‌లో అందించే వైద్య సేవల చార్జీలు తక్కువగా ఉంటాయి. కనుక మొత్తం మీద బిల్లు తగ్గుతుంది. ఇది బీమా సంస్థపై భారాన్ని తగ్గిస్తుంది. 

షేరింగ్‌లోనూ రోగికి మెరుగైన సేవలే అందుతాయి. కనుక దీన్ని పరిశీలించొచ్చు. పైన చెప్పుకున్న అన్ని ఆప్షన్లు దాటి వచి్చన తర్వాత కూడా ప్రీమియం భారంగా అనిపిస్తే.. కోపేమెంట్‌కు వెళ్లడమే. ఈ విధానంలో ప్రతి ఆస్పత్రి బిల్లులో పాలసీదారు తన వంతు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు 10 శాతం కో–పేమెంట్‌ ఎంపిక చేసుకున్నారని అనుకుందాం. రూ.2 లక్షల బిల్లు వచి్చనప్పుడు రోగి తన జేబు నుంచి రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది.  ఇంతకంటే ఎక్కువ కోపేమెంట్‌ ఆప్షన్‌కైనా వెళ్లొచ్చు. కానీ, దీనివల్ల ఏటా ప్రీమియం భారం తగ్గుతుంది కానీ, ఆస్పత్రిలో చేరినప్పుడు ఆ మేరకు జేబుపై భారం పడుతుంది

ఈఎంఐ రూపంలో 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఏడాదికి ఒకే వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమాలో మాదిరి నెలవారీ లేదా త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి ఆప్షన్‌ లేదు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఒకే విడత అంత మొత్తం అంటే భారంగా అనిపించొచ్చు. అలాంటి వారు ఈఎంఐ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని రకాల కార్డులపై బీమా సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి.  

నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనే.. 
ప్రతి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో ఒక జాబితాను నిర్వహిస్తుంటుంది. తమ క్లయింట్లకు కొంచెం తగ్గింపు రేట్లపై సేవలు అందించే దిశగా ఆయా ఆస్పత్రులతో బీమా కంపెనీకి టైఅప్‌ ఉంటుంది. కనుక నాన్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో పోల్చి చూస్తే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం వల్ల తక్కువ చార్జీలు పడతాయి. ఈ మేరకు బీమా కంపెనీలకు ఆదా అవుతుంది. కనుక స్టార్‌ హెల్త్‌ వంటి కొన్ని బీమా సంస్థలు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి.  

ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ 
కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఇండివిడ్యువల్‌ హెల్త్‌ కవరేజీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది. దీనికి బదులు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో అందరికీ కలిపి కవరేజీ ఒక్కటే అవుతుంది. కనుక ప్రీమియం తగ్గుతుంది.  

వెల్‌నెస్‌ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.. 
తీసుకునే హెల్త్‌ ప్లాన్‌లో హెల్త్‌ చెకప్‌ వంటి వెల్‌నెస్‌ ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏడాదికోసారి ఉచితంగా అన్ని రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు అదనంగా పడే ప్రీమియం ఉండదు. కానీ, ఆరోగ్యం ఎలా ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ మేరకు కొంత ఆదా చేసినట్టే అవుతుంది. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement