health emergency
-
ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?
ఆరోగ్య అత్యవసర స్థితి చెప్పి రాదు. ఆహారం, నిద్ర వేళల్లో మార్పులు.. గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల ప్రభావంతో జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరిగింది. వీటి కారణంగా ఆస్పత్రి పాలైతే బిల్లులు చెల్లించడం మెజారిటీ వ్యక్తులకు అసాధ్యమే కాదు, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి. ఇలాంటి అనిశ్చితులకు రక్షణ కవచమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కరోనా తర్వాత వీటి ప్రీమియంలు దాదాపుగా రెట్టింపయ్యాయి. మోయలేనంత భారంగా మారాయి. ఇది చూసి ఇప్పటికీ హెల్త్ ప్లాన్‌కు దూరంగా ఉన్నవారు ఎందరో. కానీ, ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ ఇది తప్పనిసరి. కావాలంటే ప్రీమియం తగ్గించుకునే మార్గాన్ని వెతకండి. అంతేకానీ, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా రక్షణ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉండొద్దనేది నిపుణుల మాట! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం ప్రకారం.. దేశంలో 35 శాతం మంది హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నారు. 10 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్‌ను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మరోవైపు వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సా విధానాలు.. మరింత కచ్చితత్వంతో, మెరుగైన ఫలితాలనిచ్చే రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యయాలను అందరూ భరించలేరు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను వీలైనంత చిన్న వయసులోనే తీసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఖరారవుతుంది. వయసు, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను బీమా సంస్థ పాలసీ జారీకి ముందు మదింపు చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో.. 25 ఏళ్ల వయసు వ్యక్తికి, 40 ఏళ్ల వయసు వ్యక్తికి ప్రీమియంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చిన్న వయసులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, ఆ తర్వాతి కాలంలో ప్రీమియం పెరగదా? అన్న సందేహం రావచ్చు. 35 ఏళ్లు నిండిన తర్వాత, 45 ఏళ్లు, 55 ఏళ్లు, 60 ఏళ్లు నిండిన తర్వాత వయసువారీ ప్రీమియం రేట్లు కచ్చితంగా సవరణకు నోచుకుంటాయి. కానీ, 35–40 ఏళ్ల తర్వాత కొత్తగా పాలసీ తీసుకునే వారితో పోల్చితే, 25 ఏళ్లలోపు వారికి ప్రీమియం తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే, మూడేళ్లలో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్లు దాటేస్తారు. ముందస్తు వ్యాధులకు సైతం కవరేజీ అర్హత లభిస్తుంది. పైగా పాలసీ తీసుకుని 60 నెలలు (ఐదేళ్ల ప్రీమియం చెల్లింపులు) ముగిస్తే, ఆరోగ్య చరిత్రను సరిగ్గా వెల్లడించలేదనో, సమాచారం దాచిపెట్టారనే కారణంతో క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలతోపాటు ప్రీమియం భారం తగ్గుతుంది. బోనస్, రీస్టోరేషన్ కేవలం రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్నే తీసుకున్నప్పటికీ అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కవరేజీని పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బీమా కంపెనీలు నో క్లెయిమ్ బోనస్, రీస్టోరేషన్ ఫీచర్లను అందిస్తున్నాయి. ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే 50–200 శాతం మేర సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా సంస్థలు ఇస్తుంటాయి. అప్పుడు రూ.5 లక్షల కవరేజీ రూ.10–15 లక్షలకు చేరుతుంది. రీస్టోరేషన్ సదుపాయం అన్నది.. హాస్పిటల్లో చేరినప్పుడు కవరేజీ పూర్తిగా అయిపోతే అంతే మొత్తాన్ని తిరిగి ఆ పాలసీ సంవత్సరానికి పునరుద్ధరించడం. కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో ఒక్క రీస్టోరేషన్నే ఇస్తుంటే, కేర్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు కొన్ని ప్లాన్లలో అపరిమిత రీస్టోరేషన్ సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బేస్ సమ్ అష్యూర్డ్ తక్కువగా ఎంపిక చేసుకున్నప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా ప్రీమియం భారం తగ్గుతుంది. చిన్న క్లెయిమ్‌లకు దూరం ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతేనే నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. కనుక చిన్న క్లెయిమ్‌లకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఎలాంటి క్లెయిమ్ లేకపోతే ఏటా 50 నుంచి 100 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. ఒకవేళ క్లెయిమ్ చేస్తే ఎంత అయితే పెరిగిందో, అంతే మేర తగ్గిపోతుంది. కనుక చిన్న క్లెయిమ్ కోసం రూ.2.5–5 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఒక ఏడాదిలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రూ.50 వేల లోపు చిన్న వ్యయాలను సొంతంగా భరించడమే మంచిది. మంచి ఆహారం, జీవనశైలి.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అన్న భరోసాతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తామా? అలా చేయడం మన సమస్యలను మరింత పెంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం తమ వంతు కృషి చేయాల్సిందే. దీనివల్ల ఆస్పత్రి పాలు కావడాన్ని సాధ్యమైన మేర నివారించొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో చాలా వరకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తే అంత ప్రయోజనం లభిస్తుంది. రోజువారీ నడక, పరుగు, ఏరోబిక్ వ్యాయా మాలు చేయడం ద్వారా హెల్త్ క్రెడిట్స్ పొందొచ్చు. వీటిని ప్రీమియంలో సర్దుబాటు చేసుకోవచ్చు. తద్వారా ప్రీమియంలో 100% రాయితీని సైతం కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం, గుట్కా/జర్దాలకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల గురించి ఆరోగ్య చరిత్రలో వెల్లడించాల్సిందే. వీటి కారణంగా ప్రీమియం గణనీయంగా పెరిగిపోతుంది. వీటిని మానేయడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు.సూపర్ టాపప్ నేటి రోజుల్లో నలుగురు సభ్యుల ఒక కుటుంబానికి కనీసం రూ.10 లక్షల హెల్త్ కవరేజీ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది కూడా చాలకపోవచ్చు. కానీ, రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ కోసం 30 ఏళ్ల వ్యక్తి కుటుంబానికి రూ. 20 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు రూ.5 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ పరిశీలించొచ్చు. దీనికి అదనంగా రూ.5 లక్షల డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. ఉదాహరణకు రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ రూ.3,000కే వస్తుంది. ఇందులో మొదటి రూ.5 లక్షల బిల్లును మినహాయించి, ఆపై ఉన్న మొత్తానికి చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ ప్రీమియం అందుబాటు ధరలోనే వస్తే, అప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ వ్యక్తిగత రుణ చరిత్రకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.. కొన్ని బీమా సంస్థలు మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు ప్రీమియంలో తగ్గింపు ఇస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉందంటే.. ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని అర్థం. ఇలాంటి వారిని తక్కువ రిస్క్ కస్టమర్లుగా చూస్తూ ప్రీమియంలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. 15 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.ఆన్లైన్లో కొనుగోలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ, ఫీచర్లపై అవగాహన కలిగిన వారు ఆన్లైన్లో కొనుగోలు చేయడం ద్వారా ప్రీమియంలో డిస్కౌంట్ పొందొచ్చు. పైగా పాలసీబజార్ పోర్టల్‌పై మొబైల్ ఓటీపీతో లాగిన్ అయ్యి, అన్ని బీమా సంస్థల పాలసీలను పరిశీలించొచ్చు. వాటి ఫీచర్లు, ప్రీమియం వ్యత్యాసాన్ని గమనించొచ్చు. తద్వారా మెరుగైన ఫీచర్లతో, తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీని గుర్తించొచ్చు. బీమా సంస్థ పోర్టల్ ద్వారా నేరుగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్వయంగా వివరాలు నమోదు చేయడం, నియమ, నిబంధనల గురించి అవగాహన కూడా ఏర్పడుతుంది. కొంత రాజీపడితే? సదుపాయాల విషయంలో కొంత రాజీధోరణితో వెళ్లేట్టు అయితే అప్పుడు కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇందులో రూమ్ టైప్ ఒకటి. ఆస్పత్రిలో చేరినప్పుడు రోగికి ఐసీయూ వెలుపల పడక అవసరమవుతుంది. జనరల్ వార్డ్, షేరింగ్, సింగిల్ రూమ్, డీలక్స్ రూమ్ ఇలా పలు రకాలుంటాయి. పడక విషయంలో ఎలాంటి పరిమితుల్లేని పాలసీకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుంటారు. ఒక విధంగా ఇదే సౌకర్యమైనది. ప్రీమియం భరించగలిగే వారు రూమ్ రెంట్లో పరిమితులు లేకుండా ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారంగా భావించే వారు.. షేరింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు రూమ్‌ల్లోని సేవలతో పోల్చినప్పుడు షేరింగ్‌లో అందించే వైద్య సేవల చార్జీలు తక్కువగా ఉంటాయి. కనుక మొత్తం మీద బిల్లు తగ్గుతుంది. ఇది బీమా సంస్థపై భారాన్ని తగ్గిస్తుంది. షేరింగ్‌లోనూ రోగికి మెరుగైన సేవలే అందుతాయి. కనుక దీన్ని పరిశీలించొచ్చు. పైన చెప్పుకున్న అన్ని ఆప్షన్లు దాటి వచి్చన తర్వాత కూడా ప్రీమియం భారంగా అనిపిస్తే.. కోపేమెంట్కు వెళ్లడమే. ఈ విధానంలో ప్రతి ఆస్పత్రి బిల్లులో పాలసీదారు తన వంతు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు 10 శాతం కో–పేమెంట్ ఎంపిక చేసుకున్నారని అనుకుందాం. రూ.2 లక్షల బిల్లు వచి్చనప్పుడు రోగి తన జేబు నుంచి రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ కోపేమెంట్ ఆప్షన్‌కైనా వెళ్లొచ్చు. కానీ, దీనివల్ల ఏటా ప్రీమియం భారం తగ్గుతుంది కానీ, ఆస్పత్రిలో చేరినప్పుడు ఆ మేరకు జేబుపై భారం పడుతుందిఈఎంఐ రూపంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏడాదికి ఒకే వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమాలో మాదిరి నెలవారీ లేదా త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి ఆప్షన్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఒకే విడత అంత మొత్తం అంటే భారంగా అనిపించొచ్చు. అలాంటి వారు ఈఎంఐ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని రకాల కార్డులపై బీమా సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే.. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రులతో ఒక జాబితాను నిర్వహిస్తుంటుంది. తమ క్లయింట్లకు కొంచెం తగ్గింపు రేట్లపై సేవలు అందించే దిశగా ఆయా ఆస్పత్రులతో బీమా కంపెనీకి టైఅప్ ఉంటుంది. కనుక నాన్ నెట్వర్క్ ఆస్పత్రులతో పోల్చి చూస్తే నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం వల్ల తక్కువ చార్జీలు పడతాయి. ఈ మేరకు బీమా కంపెనీలకు ఆదా అవుతుంది. కనుక స్టార్ హెల్త్ వంటి కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఇండివిడ్యువల్ హెల్త్ కవరేజీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది. దీనికి బదులు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో అందరికీ కలిపి కవరేజీ ఒక్కటే అవుతుంది. కనుక ప్రీమియం తగ్గుతుంది. వెల్నెస్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.. తీసుకునే హెల్త్ ప్లాన్‌లో హెల్త్ చెకప్ వంటి వెల్నెస్ ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏడాదికోసారి ఉచితంగా అన్ని రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు అదనంగా పడే ప్రీమియం ఉండదు. కానీ, ఆరోగ్యం ఎలా ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ మేరకు కొంత ఆదా చేసినట్టే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దుమ్ము దుప్పట్లో విలాస నగరం
వాషింగ్టన్: ఆరు చోట్ల ఆరని పెను జ్వాలలు, కమ్మేసిన దుమ్ము, ధూళి మేఘాలు, నిప్పుకణికల స్వైరవిహారంతో లాస్ ఏంజెలెస్ నగర కొండప్రాంతాలు నుసిబారిపోతున్నాయి. వేల ఎకరాల్లో అటవీప్రాంతాలను కాల్చి బూడిదచేసిన వేడిగాలులు అదే బూడిదను జనావాసాల పైకి ఎగదోస్తూ మిగతా పరిసరాలను దమ్ముకొట్టుకుపోయేలా చేస్తున్నాయి. పొగచూరిన వాతావరణంలో సరిగా శ్వాసించలేక లక్షలాది మంది స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో జనం బయట తిరగొద్దని, హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నామని స్థానిక యంత్రాంగం శనివారం ప్రకటించింది. 10,000 భవనాలను కూల్చేసి, 11 మంది ప్రాణాలను బలిగొన్న కార్చిచ్చు ఇంకా చల్లారకపోగా తూర్పు దిశగా దూసుకుపోతుండటంతో స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమైంది. ఇప్పటికే మూడు లక్షల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఆస్తి నష్టం లక్షల కోట్లను దాటి లాస్ఏంజెలెస్ నగర చరిత్రలోనే అత్యంత దారుణ దావాగ్ని ఘటనగా మిగిలిపోయింది. పర్వత సానువుల గుండా వేడి గాలుల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో మంటలు మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించవచ్చన్న భయాందోళనలు పొరుగు ప్రాంతాలైన ఎన్సినో, వెస్ట్ లాస్ఏంజెలెస్, బ్రెంట్వుడ్వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మంటలు ఆపేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న అగ్నిమాపక సిబ్బందికి నీటి కష్టాలు మొదలయ్యాయి. ఫైరింజన్లకు సరిపడా నీటి సౌకర్యాలు లేకపోవడంపై కాలిఫోరి్నయా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంటా యెంజ్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా పూర్తిస్థాయిలో లేకపోవడంపైనా ఆయన ‘ఎక్స్’వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్న మంటలకుతోడు కొత్తగా గ్రనడా హిల్స్‌లో అంటుకున్న అగ్గిరవ్వలు ‘ఆర్చర్ ఫైర్’గా విస్తరిస్తూ ఇప్పటికే 32 ఎకరాలను దహించివేసింది. ఈ ప్రాంతంలోనే ఎంటర్టైన్మెంట్ దిగ్గజ కిమ్ కర్దాషియాన్ సోదరీమణుల ఇళ్లు, డిస్నీ కార్పొరేట్ ఆఫీస్ ఉన్నాయి. కార్చిచ్చులో కళాకారుల కలల సౌధాలు: వెనుక కొండలు, ముందు వినీలాకాశం, కింద సముద్ర తీరంతో అద్భుతంగా కనిపించే లాస్ ఏంజెలెస్‌లో చాలా మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఎంతో ఇష్టంతో ఇళ్లు కొన్నారు. వాటిల్లో చాలా మటుకు ఇప్పుడు కాలిపోయాయి. 76 ఏళ్ల అమెరికన్ కమేడియన్ బిల్లీ క్రిస్టల్ 1979లో పసిఫిక్ పాలిసేడ్స్‌లో కొనుగోలుచేసిన విలాసవంత భవనం తాజా మంటల్లో కాలిబూడిదైంది. మ్యాడ్ మ్యాక్స్ స్టార్ మేల్ గిబ్సన్, మరో నటుడు జెఫ్ బ్రిడ్జెస్, సెలబ్రిటీ టెలివిజన్ పర్సనాలిటీ ప్యారిస్ హిల్టన్, ‘ప్రిన్సెస్ బ్రైడ్’నటుడు క్యారీ ఎల్వీస్, ప్రముఖ నటుడు మ్యాండీ మూర్, మీలో వెంటిమిగ్లియా, లీటన్ మీస్టర్, ఆడమ్ బ్రాడీ, ఆంటోనీ హాప్కిన్స్, జాన్ గుడ్మాయ్న్, మైల్స్ టెల్లర్, అన్నా ఫారిస్, పాలిసేడ్స్ గౌరవ మేయర్ ఎజీన్ లేవీ, క్రిస్సీ టీగెన్, జాన్ లెజెండ్, మార్క్ మరోన్, మార్క్ హామిల్ల ఇళ్లు సైతం మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. లిడియా, హర్స్ట్, ఆర్చర్, ఈటన్, కెన్నెత్, పాలిసేడ్స్ ఫైర్ దావాగ్నులు మొత్తంగా 37,579 ఎకరాల్లో విస్తరించాయి. -
ఎంపాక్స్ క్లేడ్ 1బీ తొలి కేసు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్1’ వేరియంట్ ఎంపాక్స్ వైరస్ భారత్‌లోకి అడుగుపెట్టింది. క్లేడ్ 1బీ పాజిటివ్ కేసు భారత్‌లో నమోదైందని సోమవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు తిరిగొచి్చన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్ 1బీ వైరస్‌ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. క్లేడ్ 1బీ వేరియంట్ కేసులు విజృంభించడతో ఆగస్ట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం తెల్సిందే. విదేశాల నుంచి వస్తూ ఎంపాక్స్ రకం వ్యాధి లక్షణాలతో బాధపడేవారు తక్షణం ఆరోగ్య శాఖకు వివరాలు తెలపాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. కోలుకున్న ‘క్లేడ్2’ రోగి క్లేడ్2 వేరియంట్‌తో ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 26 ఏళ్ల రోగి కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. హరియాణాలోని హిసార్‌కు చెందిన ఈ వ్యక్తి సెపె్టంబర్ ఎనిమిదో తేదీన ఆస్పత్రిలో చేరడం తెల్సిందే. -
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలన గాడితప్పి ప్రజారోగ్యం పడకేసి తెలంగాణ మొత్తం విషజ్వరాల బారిన పడినందున.. వెంటనే ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచి్చందని, కానీ దీనిద్వారా అసలైన సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో చెరువులను పరిరక్షించాల్సిందేనని, కానీ ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు. కబ్జాల వివరాలు బయట పెట్టాలని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. దేవాదాయ భూములు, అసైన్డ్ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్నాక.. వాటిపై ప్రతాపం చూపొద్దన్నారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రుణమాఫీ చేయలేదు.. తులం బంగారం లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వ లేదని ఎద్దేవా చేశారు. ఉచితాలు, హామీలు, గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు హామీలిచ్చి.. గద్దెనెక్కాక ప్రజలను గోస పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అవినీతి, అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీస్తున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీ కటాకట్ కటాకట్ డబ్బులు వేస్తామని చెప్పారు.. ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఫటాఫట్ దివాలా తీశాయని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణనుæ ఢిల్లీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కోర్టులకు రాజకీయ రంగు పులమడం కాంగ్రెస్‌కే చెల్లిందన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామన్న.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, అన్ని విషయాలకు కోర్టులు, న్యాయ వ్యవస్థ ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా లక్ష్మణ్ చెప్పారు. అధికారంలోకి రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలకు పిచ్చి ముదిరిందని, ఇప్పటికే ఆ పార్టీ ఖేల్‌ఖతం.. దుకాణం బంద్ అయ్యిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కొత్తగా కలిసేది ఏముంది? వాళ్లు ఎప్పుడో కలిశారు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో బీజేపీ ఉద్యమ బాట పడుతుందని, త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తుందని లక్ష్మణ్ వెల్లడించారు. -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్‌లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్‌కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్‌కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్‌ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్‌గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్‌నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మంకీపాక్స్ లక్షణాలు ఇవే.. చికిత్స గురించి తెలుసా?
ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ (ఎంపాక్స్) మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎంపాక్స్ సుమారు 70 దేశాలకు పాకింది. ఇప్పటివరకు 100 మంది ఎంపాక్స్‌తో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే..సుమారు 17 వేలకుపైగా అనుమానిత కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం ఇది రెండోసారి. కాంగోలో మంకీ పాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ విజృంభించడం సహా ఇతర చుట్టు పక్కల 12 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.ఎంపాక్స్‌ను మంకీపాక్స్ అని కూడా అంటారు. 1958లో కోతులలో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీనిని తొలిసారిగా గుర్తించారు. ఇటీవలి మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి.మంకీపాక్స్ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలుగజేస్తాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్ వ్యాధి.. స్వలింగ సంపర్గం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. మంకీపాక్స్ గురించి ప్రపంచదేశాలకు దశాబ్దాలుగా తెలుసు. దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. స్మాల్‌పాక్స్ (మశూచి) వ్యాక్సిన్నే మంకీపాక్స్ బాధితులకు ఇస్తున్నారు. అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. డెన్మార్క్‌కు చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. -
కరోనా పీడ విరగడైంది: డబ్యూహెచ్‌వో
జెనీవా: కరోనా మహమ్మారి పీడ దాదాపుగా విరగడైనట్టే. గత మూడున్నరేళ్లుగా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ దశను దాటేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కోవిడ్–19 అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఇకపై చూడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధ్నామ్ వెల్లడించారు. కనీవినీ ఎరుగని రీతిలో లాక్డౌన్లతో నాలుగ్గోడల మధ్య ప్రజలు బందీగా ఉండడం, ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవడం వంటి వాటితో కరోనా కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ బలహీనపడిపోయినప్పటికీ ఇంకా ముగింపు దశకు చేరుకోలేదని టెడ్రోస్ చెప్పారు. ఇప్పటికీ ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయని, ప్రతీ వారం కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. 2020 జనవరి 30 డబ్ల్యూహెచ్ఓ కోవిడ్–19ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. -
బీజింగ్‌లో కోవిడ్ బీభత్సం
బీజింగ్: కరోనా చైనాను చిదిమేస్తోంది. బీజింగ్‌లో కోవిడ్ రోగులు వెల్లువలా ఆస్పత్రులకు తరలివస్తున్నారు. నగరంలోని చుయాంగ్‌లియూ ఆస్పత్రిలో పరిస్థితే అక్కడి ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దర్పణం పడుతోంది. ఆస్పత్రిలోని బెడ్లు అన్నీ కోవిడ్ వృద్ధ రోగులతో నిండిపోయాయి. అయినా రోగులు వస్తుండటంతో బంధువులు వేచి ఉండే గదుల్లో, కారిడార్లలో వైద్యం చేస్తున్నారు. ఉన్న అన్ని వీల్చైర్లలో రోగులు కూర్చొనే ఆక్సిజన్ వెంటెలేషన్తో శ్వాసిస్తున్నారు. మరింత అత్యవసర వైద్యసేవలు అవసరమైన రోగులకు చికిత్సచేయడంలో వైద్యులు, నర్సులు మునిగిపోయారు. జీరో కోవిడ్ పాలసీతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు శతథా ప్రయత్నించి చైనా చేతులెత్తేయడంతో దేశంలో వైద్యారోగ్య పరిస్థితి దయనీయంగా తయారైంది. అత్యవసరమైతే తప్ప సొంతూర్లకు రావొద్దని అక్కడి హునాన్ప్రావిన్స్లోని షావోయాంగ్ కౌంటీ, అన్హుయీ ప్రావిన్స్‌లోని షాయూగ్జియాన్ కౌంటీలతోపాటు గన్సు ప్రావిన్స్‌లోని క్వింగ్యాంగ్ తదితర నగర పాలనాయంత్రాంగాలు ప్రజలను హెచ్చరించాయి. చైనాలో వైద్య అత్యయక స్థితిపై వాస్తవిక సమాచారం అందితే ఇతర దేశాలు సరైన విధంగా సమాయత్తం అయ్యేందుకు వీలుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ బుధవారం హితవుపలికారు. -
మాయదారి రోగమే కానీ...
ఒకటింకా పూర్తిగా పోనే లేదు... మరొకటి పులి మీద పుట్రలా వచ్చి మీద పడింది. రెండున్నరేళ్ళుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా పూర్తిగా ఇంటిదారి పట్టకుండానే ఇప్పుడు మంకీపాక్స్ వంతు. 75కి పైగా దేశాల్లో 16 వేల మంకీపాక్స్ కేసులు బయటపడడంతో ఈ వ్యాధి అంతర్జాతీయ వార్త అయింది. మంకీపాక్స్ వైరస్ అంతర్జాతీయ స్థాయిలో కలవరపెడుతున్న అత్యవసర ప్రజారోగ్య పరిస్థితి అంటూ జూలై 23న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గరిష్ఠ స్థాయి హెచ్చరిక జారీ చేయడంతో కలకలం మొదలైంది. నిన్నమొన్నటి దాకా సురక్షితంగా ఉన్నామనుకున్న మన దేశంలోనూ కేరళలో మొదలై ఢిల్లీ వరకు గత పది రోజుల్లో మొత్తం 4 కేసులు బయటపడ్డాయి. తాజాగా తెలంగాణలో మరో అనుమానిత కేసుతో అప్రమత్తత అవసరమని అర్థమవుతోంది. 2009 నుంచి గత 14 ఏళ్ళలో జికా, ఎబోలా, పోలియో, స్వైన్‌ఫ్లూ, కోవిడ్ తదితర 7 సార్లే అంతర్జాతీయ అత్యవసర స్థితిని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. వాటిలో గత మూడేళ్ళలో వచ్చినవి – కోవిడ్, మంకీపాక్స్. హఠాత్తుగా తలెత్తి, అంతర్జాతీయ సరిహద్దులు దాటి, దేశాలన్నీ కలసి సమష్టి చర్యలు చేపట్టాల్సిన వ్యాధుల విషయంలోనే డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటిస్తుంటుంది. పెరుగుతున్న కేసులతో మంకీపాక్స్‌పై భారత ప్రభుత్వం సైతం ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిం చాల్సి వచ్చింది. నిజానికి, డబ్ల్యూహెచ్ఓ తాజా ప్రకటన కన్నా చాలా ముందే మన ప్రభుత్వం మేల్కొంది. మే నెలాఖరుకే ఇది సంక్షోభంగా పరిణమించవచ్చని భావించి, మంకీపాక్స్‌పై రాష్ట్రా లకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్క కేసొచ్చినా, వ్యాధి విస్ఫోటనంగానే భావించాలంది. కొంతకాలంగా అమెరికా, ఐరోపాలలో మంకీపాక్స్ విరివిగా కనిపిస్తోంది. ఆఫ్రికాలో ఈ వ్యాధి సాధారణమైనా, భారత్‌లో చాలా ఏళ్ళ తర్వాత ఈ వ్యాధి పొడసూపడంతో ఆగి, ఆలోచించాల్సి వస్తోంది. అయితే, కరోనాలా మంకీపాక్స్ శ్వాసకోశ వ్యవస్థను ఇబ్బంది పెట్టదు. త్వరితగతిన వ్యాప్తి చెందదు. ప్రాణాంతకం కాదు కాబట్టి, అతిగా ఆందోళన పడాల్సిన పని లేదు. మంకీపాక్స్‌కు ఇప్పటి దాకా నిశ్చయమైన రోగనిరోధక చికిత్సంటూ లేకున్నా, మశూచికి ఇతర దేశాల్లో వాడిన 2వ, 3వ జనరేషన్ టీకాలు దీనికీ 85 శాతం మేర పనిచేస్తాయని ప్రస్తుతమున్న అవగాహన. కరోనా పుణ్యమా అని అత్యవసర స్థితిని ఎదుర్కోవడంలో వచ్చిన అనుభవంతో మన దేశం అడుగేయాలి. చికిత్స కన్నా నివారణే మిన్న గనక రోగుల క్వారంటైన్, సన్నిహిత కాంటాక్ట్‌ల ట్రేసింగ్, టెస్టింగ్, టీకాలు ముఖ్యం. ఈ వ్యాధి నిజంగానే ఓ విస్ఫోటనం కాకుండా చూసేందుకు అదే మార్గం. జంతువుల నుంచి వచ్చే ‘జూనోటిక్ వ్యాధుల’కు మంకీపాక్స్ ఉదాహరణ. ప్రధానంగా కోతులు, ఎలుకలు, ఉడుతల లాంటి జంతువులకు సన్నిహితంగా మెలగడంతో వ్యాపించే మంకీపాక్స్ వైరస్ సైతం మశూచి కారక వైరస్ల కుటుంబానికి చెందినదే. కరోనాలా భారీగా కేసులు రాకపోయినా, దానిలా ఇది ప్రాణాంతకం కాకపోయినా మంకీపాక్స్‌పై జాగ్రత్త తప్పదు. సాధారణంగా వ్యాధి ప్రబలిన విదేశాలకు వెళ్ళి వచ్చినవారిలో, మరో రోగికి సన్నిహితంగా మెలిగినవారిలోనే 14 నుంచి 21 రోజుల్లో మంకీపాక్స్ బయటపడుతోంది. నూటికి 99 కేసులు మగవారిలో, అదీ స్వలింగ సంపర్కుల్లోనే కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణమేదీ చేయకపోయినా ఢిల్లీలో ఒకరికి ఈ వ్యాధి రావడంతో రోగి ఎవరితో సన్నిహితంగా తిరిగారు, లైంగిక అభిరుచి ఏమిటనేది కీలకమైంది. మంకీపాక్స్ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్ఐవీ బాధితులు సహా కొన్ని వర్గాల వ్యక్తులకు కళంకం ఆపాదించే ముప్పుంది. పరోక్షంగా తమ లైంగిక అభిరుచులను బయటపెట్టి, తమపై ముద్ర వేస్తారనే భయం ఉంటుంది. కాబట్టి, నిఘా కేంద్రాలు, లైంగిక ఆరోగ్యశాలల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ర్యాండమ్ టెస్టింగ్ చేయాలి. ఎయిడ్స్‌పై రహస్య స్క్రీనింగ్ నిర్వహించిన అనుభవం మనకుంది గనక, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో)తోనే ఆ పని చేయించవచ్చు. ఆర్టీపీసీ ఆర్ కిట్లు, టీకాలు, చికిత్సా విధానాలను సర్కారు సత్వరం సిద్ధం చేయాలి. 1980లకే మనం దేశం నుంచి మశూచిని పారదోలాం. అలా దేశంలో నూటికి 70 మంది మశూచి టీకాలు వేయించుకోని వారే. దానికి వాడే మందులూ మన దగ్గర అందుబాటులో లేవు. గనక ముందుజాగ్రత్తగా విదేశాల నుంచి మందులు తెప్పించడం, టీకాల ఉత్పత్తిని ప్రోత్సహించడం అవసరం. డెన్మార్క్‌లోని పరిశోధనాశాలలో 1958లో కోతుల్లో మంకీపాక్స్‌ను కనుగొన్నారు. 1970లో నేటి డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మనుషుల్లో తొలిసారి ఇది బయటపడి, ఆఫ్రికా దేశాల్లో ప్రబలింది. ఇవాళ మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో సాధారణ జలుబు లాంటి ఎండెమిక్‌గా మారిందనేది చరిత్ర. కాబట్టి, ఆందోళన బదులు అంతర్జాతీయ సమాజం పరస్పర సహకారంతో, సమష్టి ప్రయత్నాలతో, వ్యాప్తిని అడ్డుకొనే పనిచేయాలి. ఇది మరో మహమ్మారిగా మారకుండా జాగ్రత్త పడాలనేదే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలోని సారాంశంగా గ్రహించాలి. ఇప్పటికే కరోనాతో జాగ్రత్తలు అలవాటయ్యాయి గనక ప్రభుత్వమూ ప్రజల్లో చైతన్యం పెంచాలి. రోగనిరోధక శక్తి తక్కువుండే చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకే మంకీపాక్స్ కొంత ప్రమాదకరం. లేదంటే 3 వారాల స్వీయ నిర్బంధం, తగిన ఉపశమన చికిత్సలతో నాలుగు వారాల్లో ఆరోగ్యవంతులు కావచ్చని గుర్తించాలి. వాట్సప్‌ల పుణ్యమా అని అసత్య సమాచారం ప్రబలే ప్రస్తుత పరిస్థితుల్లో చేయాల్సిందల్లా – భయపెట్టడం కాదు... అవగాహన కల్పించి అప్రమత్తం చేయడమే! -
ఆరోగ్యం గురించి ఢిల్లీకి వెళ్తున్న సీఎం కేసీఆర్
-
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
జనగామ: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. జనగామలోని జిల్లా ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితిని చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు స్కానింగ్ సేవలు లేక దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రోజువారీ కూలి చేసుకుంటేనే కడుపు నిండే పేదలు కరోనా బారిన పడితే ఆస్పత్రుల్లో ఐసోలేషన్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇంట్లో సౌకర్యాల లేమితో పాజిటివ్ రోగులు వేరుగా ఉండాలంటే బాధిత కుటుంబాలు నరకం చూస్తున్నాయని, దీంతో మిగతా వారికి సైతం వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. కరోనాపై కాంగ్రెస్ నేతలు మాట్లాడితే పారాసిటమాల్ సరిపోతుందని, మాస్క్ ఎందుకని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు మాస్క్ లేకుండా ఒక్క బాధితుడినైనా పరామర్శించారా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేసి, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తక్షణం హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎంపీలకు కేంద్ర బృందం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ఒత్తిడి చేశారని, అతితెలివి మానుకుని ఇప్పటికైనా కరోనా నివారణపై దృష్టి పెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచిం చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం చేస్తోన్న అంతంతమాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1% మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని, రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళనృత్యం చేస్తోందో ఈ శాతాలే నిదర్శనమని పేర్కొన్నారు. వీఐపీల ప్రాణాలకు ఇస్తోన్న విలువ పేద, మధ్యతరగతి ప్రజల ప్రాణాలకు ఇవ్వడం లేదని, ప్రభుత్వాస్పత్రికి వెళ్లడం కంటే శ్మశానానికి వెళ్లడం మేలన్న అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారని వివరిం చారు. కరోనా కట్టడిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఆమెను ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుదోవ పట్టించారు పారాసిటమల్ వేసుకుంటే చాల ని, వేడినీళ్లు తాగితే కరోనా పో తుందని ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మంత్రులు కూడా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేశారని రేవంత్ లేఖలో విమర్శించారు. టిమ్స్ ఆస్పత్రి విషయంలో హడావిడే తప్ప ఇంతవరకు ప్రారంభానికి ఎందుకు నోచుకోవడం లేదో సమాధానం చెప్పాలని డిమాం డ్ చేశారు. ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అనుసరించమని మొత్తుకుంటున్నా ప్రభుత్వం చెవికెక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిపుణులతో కమిటీ వేయాలని, అఖిలపక్షాన్ని పిలిచి సలహాలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదనే కారణంతో తన పార్లమెంట్ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి రైతుబంధు నిలిపివేయడంపై మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్లో విమర్శిస్తూ పోస్ట్ చేశారు. -
కోవిడ్ ఒక మహా విపత్తు
వాషింగ్టన్/లండన్/రోమ్: కోవిడ్ రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. ఈ వైరస్ ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను బలిగొంటూ తీవ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ కేసులు, మృతుల సంఖ్యలో అమెరికా అన్ని దేశాలను దాటేసి పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్ మృతులు ఇటలీని మించిపోయి 20 వేలు దాటిపోవడంతో అమెరికా ప్రభుత్వం మహా విపత్తుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకారంతో వ్యోమింగ్ రాష్ట్రాన్ని కూడా కోవిడ్ విపత్తు పరిధిలోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితులు విధించినట్టయింది. అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. కోవిడ్‌ను మహా విపత్తుగా గుర్తించడం వల్ల వైరస్ ముప్పు ఉన్నంతకాలం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిధులను అన్ని రాష్ట్రాలూ, స్థానిక ప్రభుత్వాలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విపత్తును ఎదుర్కొనేం దుకు నేరుగా వైట్ హౌస్ నిధులు అన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుంది. అత్యవసర సేవల్ని కూడా ఫెడరల్ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. కోవిడ్ ప్రభావం అత్యధికంగా న్యూయార్క్, న్యూజెర్సీలపై ఉంటే, ఇప్పుడిప్పుడే షికాగో వంటి రాష్ట్రాలకూ వ్యాధి విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కూడా 5 లక్షల 50 వేలకు చేరుకుంది. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి అధ్యక్షుడు ట్రంప్ 50 వేల మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. 60 వేల మంది మరణిస్తారని అంచనాలు కోవిడ్ మహమ్మారితో అమెరికాలో లక్ష నుంచి రెండు లక్షల మంది మరణిస్తారని తొలి దశలో అంచనా వేశారు. కానీ దేశం యావత్తూ లాక్డౌన్లో ఉండడం, 95 శాతానికి పైగా ఇళ్లు వదిలి బయటకు రాకుండా అత్యంత కఠినంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉండడంతో మృతుల సంఖ్య ఆ స్థాయిలో ఉండదని కోవిడ్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ భావిస్తోంది. ఈ విపత్తు నుంచి బయటపడే సమయానికి మృతుల సంఖ్య 60 వేలు దాటకపోవచ్చునని టాస్క్ ఫోర్స్ సభ్యులు అంచనా వేశారు. అమెరికాకు చేరుకున్న క్లోరోక్విన్ మాత్రలు కరోనా వైరస్‌ను నిరోధించడంలో అత్యంత కీలకంగా భావిస్తున్న మలేరియా వ్యాధికి వాడే క్లోరోక్విన్ మాత్రలు భారత్ నుంచి అమెరికాకు చేరుకున్నాయి. అమెరికా కోరినట్టుగా 35.82 లక్షల మాత్రలతో పాటు ఇతర ఔషధాల తయారీలో వినియోగించే ముడిపదార్థం 9 మెట్రిక్ టన్నుల్ని ప్రత్యేక కార్గో విమానంలో అమెరికాకు పంపింది. అవన్నీ శనివారం న్యూజెర్సీలో నేవార్క్ విమానాశ్రయానికి చేరుకున్నట్టుగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ ట్వీట్ చేశారు. ► సింగపూర్‌లో సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించినప్పటికీ 24 గంటల్లో 191 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 51 మంది భారతీయులు ఉన్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ► యూకేలో మృతులు 10 వేలు దాటేశాయి. ఒకే రోజు 657 మంది మృతి చెందడం ఆందోళన పెంచుతోంది. ► యూరప్ దేశాల్లో మృతుల సంఖ్య 75 వేలు దాటింది. స్పెయిన్‌లో ఆదివారం 610 మంది ప్రాణాలు కోల్పోయారు. ► చైనాలో మళ్లీ కరోనా కలవరం రేపుతోంది. మరో 100 కేసులు నమోదయ్యాయి. ► ప్రపంచ దేశాలన్నీ మరికొన్ని రోజులు లాక్డౌన్ పాటించాలని, లేదంటే రెండో విడత వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు హెచ్చరించింది. ఆస్పత్రి నుంచి బోరిస్ జాన్సన్ డిశ్చార్జి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆరోగ్యం బాగుపడడంతో లండన్‌లో సెయింట్ థామస్ నుంచి ఆయనను డిశ్చార్చి చేశారు. వైద్య సిబ్బంది తన ప్రాణాలు కాపాడారని, వాళ్లకి ఎప్పుడూ రుణపడి ఉంటానని ఇంటికి వెళ్లే సమయంలో జాన్సన్ పేరు పేరునా ఆస్పత్రిలో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారని, ఆయన విధులకు హాజరుకావడానికి మరి కొద్ది రోజుల సమయం పడుతుందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ వెల్లడించారు. -
ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వద్దు
సాక్షి, అమరావతి: హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని, లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆదివారం ఢిల్లీ నుంచి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు కేంద్రం రాష్ట్రాలకు జారీ చేస్తున్న మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేస్తున్నందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ► వివిధ రాష్ట్రాల సరిహద్దులు, జాతీయ రహదారులపై చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాలి. ఇందుకోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిధులను వినియోగించుకోవాలి. ► నిత్యావసర వస్తువులు, సరుకులు రవాణా చేసే వివిధ రకాల వాహనాలకు ఎక్కడా ఆటంకం లేకుండా వాటి నిర్ధేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా చూడాలి. అలాగే ప్రజలందరికీ నిత్యావసరాలు సక్రమంగా అందేలా చూడాలి. ► కోవిడ్ ఆస్పత్రులుగా గుర్తించిన చోట్ల తగిన సౌకర్యాలు పూర్తిగా అందుబాటులో ఉంచుకోవాలి. కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పటిష్టంగా అమలు చేస్తున్నాం: సతీష్ చంద్ర వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మాట్లాడుతూ.. ఏపీలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను రైతు బజార్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు వివరించారు. అలాగే ఒక్కో మనిషికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు వంటి రేషన్ సరుకులను 15 రోజులకు ఒకసారి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కర్ణాటకలోని కోలార్ నుంచి రాష్ట్ర సరిహద్దు చిత్తూరు జిల్లాకు చేరుకున్న 1,500 కూలీలకు సంబంధించిన అంశాన్ని ఆ రాష్ట్ర అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు. -
యూరప్ అతలాకుతలం
లండన్/వాషింగ్టన్ : చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఐరోపా దేశాలకు విస్తరించి అతలాకుతలం చేస్తోంది. ఇన్నాళ్లూ ఇటలీలో విజృంభించిన ఈ మహమ్మారి, ఇప్పుడు స్పెయిన్‌లో రాత్రికి రాత్రి ఉధృతమైపోయింది. ఒకే రోజు ఏకంగా 2,000 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 8 వేలకి చేరువలో ఉంటే 288 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. నిత్యావసర దుకాణాలు, ఫార్మసీలు మినహాయించి అన్నింటినీ మూసివేస్తున్నట్టు స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. రెండు వారాల పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. ఐరోపా దేశాల్లో 1,907 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 1.59 లక్షలకుపైగా నమోదుకాగా, మృతుల సంఖ్య ఆరువేలు దాటింది. స్పెయిన్ ప్రధాని భార్యకి కరోనా సామాన్యుల దగ్గర్నుంచి దేశా ధినేతల కుటుంబాల వరకు కరోనా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజాగా స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ భార్య బెగోనా గోమెజ్‌కు కరో నా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమె తన గదికే పరిమితమయ్యారు. ఇప్పటికే పెడ్రో కేబినెట్లో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. బ్రిటన్‌లో మరణాలు రెట్టింపు కేవలం 24 గంటల్లోనే బ్రిటన్‌లో కరోనా మహమ్మారి 10 మంది ప్రాణాలు తీసుకుంది. ఆ దేశంలో మృతుల సంఖ్య 11 నుంచి 21కి చేరుకుంది.కేసులు 1200వరకు పెరిగాయి. ఫ్రాన్స్‌లో కూడా కరోనా బెంబేలెత్తిస్తోంది. నైట్ లైఫ్‌కి పెట్టింది పేరైన ఫ్రాన్స్ అన్ని నైట్ క్లబ్బులు రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు మూసేసింది. అయితే ఆదివారం స్థానిక ఎన్నికల్ని మాత్రం య«థావిధిగా నిర్వహించింది. జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఇటలీలో కరోనా అదుపులోకి రావడం లేదు. ఒకే రోజు 368 మంది మృతి చెందగా 20% కేసులు పెరిగి 21 వేలు దాటేశాయి. చైనాలో ఆదివారం మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 3,199కి చేరుకుంది. ఇరాన్లో మరో 113 మంది ప్రాణాలు కోల్పోతే, కేసులు 724 పెరిగాయి. బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి ఎలిజబెత్ రాణి తరలింపునకు సన్నాహాలు కరోనా భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ (93), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (98) దంపతులను లండన్‌లోని బకింగ్çహామ్ ప్యాలెస్ నుంచి నార్‌ఫోల్క్‌లోని రాయల్ శాడ్రింగమ్ ఎస్టేట్‌కు తరలించనున్నారు. లండన్ నడిబొడ్డున బకింగ్‌హామ్ ప్యాలెస్ ఉండడంతో వచ్చిపోయే అతిథులు, సిబ్బంది ఎక్కువగా ఉంటారు. తొంభై ఏళ్ల వయసు దాటిన రాణిని అంతమంది మధ్యలో ఉంచడం ఇష్టం లేక 70 మంది సిబ్బందితో ఆమెను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు: 1,59,844 మృతుల సంఖ్య: 6,036 కోలుకున్నవారు: 74,000కు పైగా -
కరోనాపై డబ్ల్యూహెచ్ఓ యుద్ధం
బీజింగ్: చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న మహమ్మారి నావల్ కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) యుద్ధం ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది. భారత్ సహా ఇప్పటికే 20 దేశాలకు ఈ వ్యాధి త్వరితగతిన విస్తరిస్తోంది. తాజాగా బ్రిటన్‌లో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 వేల మంది ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు జెనీవాలో అత్యవసరంగా సమావేశమై గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టుగా ప్రకటించింది. కాగా, ఈ వైరస్ సోకిన కేరళకు చెందిన వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్రిశూర్ వైద్యులు తెలిపారు. చైనాకు బయల్దేరిన విమానం కరోనా వైరస్ భయంతో వూహాన్లో బిక్కుబిక్కు మంటూ ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా బీ746 విమానం శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి చైనాకు బయల్దేరి వెళ్లింది. ఈ విమానంలో ఐదుగురు వైద్యులు అయిదుగురు, పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. 400 మంది భారతీయుల్ని తీసుకొని శనివారం మధ్యాహ్నం వెనక్కి వస్తుంది. మరోవైపు సరిహద్దు భద్రతా దళం ఐటీబీపీ ఢిల్లీలో 600 పడకల ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా వైరస్ బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచింది. అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీ అంటే.. ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడి ఏదైనా వ్యాధి ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ ఉంటే అన్ని దేశాలు కలసికట్టుగా పోరాడడానికి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధిస్తారు. దీనినే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (పీహెచ్ఈఐసీ) అని అంటారు. పీహెచ్ఈఐసీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రపంచ దేశాలు ఈ వ్యాధిపై సంయుక్తంగా పోరాటం చేయాలి. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తారు. ఇప్పటివరకు గ్లోబల్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అయిదు సార్లు విధించారు. 2009 – స్వైన్ ఫ్లూ; 2014 – ఎబోలా 2014 – పోలియో మళ్లీ పడగ విప్పినప్పుడు 2016– జికా వైరస్ 2019– ఎబోలా -
భయంతో వణుకుతున్నారు.. అందుకే ఇలా..!
-
భయంతో వణుకుతున్నారు.. అందుకే ఇలా..!
బీజింగ్ : పొరుగు దేశం చైనాలో మొదలైన కరోనా కలకలం త్వరత్వరగా ప్రపంచాన్ని చుట్టేసేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 800 మంది ఈ వ్యాధి బారిన పడగా.. వారిలో 25 మంది ప్రాణాలు విడిచారు. దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేశాయి. విదేశాల నుంచి వచ్చేవారికి.. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేవారికి సమగ్రమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. (చదవండి : కరోనా వైరస్ గుప్పిట్లో చైనా..!) ‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు, క్రౌడ్ ఫండింగ్ ఇక బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ 20 మంది వైద్య సిబ్బంది కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో కరోనా రోగులకు చికిత్స అందించాలంటేనే వారు జంకుతున్నారు. ‘అత్యంత ప్రమాదకరమైన వస్తువు’గా.. కరోనా పేషంట్లను చూస్తున్నారు. కరోనా వైరస్ సోకిన ఓ పేషంట్లను ప్లాస్టిక్ ట్యూబుల్లో పెట్టి తరలిస్తున్నారు. హజ్మట్ సూట్లు ధరించి కరోనా పేషంట్‌ను తరలిస్తున్న ఈ దృశ్యం చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో వెలుగు చూసింది. ఇక కరోనాను మొదటగా గుర్తించిన వుహాన్ నగరం, హువాంగ్‌గాంగ్ నగరాల్ని మూసేశారు. చైనాలోని విష సర్పాల్లో మొదలైనా ఈ వైరస్.. మనుషులకు పాకినట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. (చదవండి : గ్రేటర్లో ‘కరోనా’ అలర్ట్!) -
ఢిల్లీకి మళ్లీ కాలుష్యం కాటు
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం దుప్పట్లో దేశ రాజధాని ఢిల్లీ ముసుగేసుకుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకరమైన స్థితికి దిగజారి పోయాయి. గురువారం రాత్రికి రాత్రే వాయు కాలుష్య సూచి 50 పాయింట్లు పెరిగిపోయి 459కి చేరుకుంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 599కి చేరుకోవడంతో ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకంలో ఏర్పడిన పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీసీఏ) వాయు కాలుష్య సూచీ అత్యంత తీవ్రమైన స్థితికి చేరుకుందని వెల్లడించింది. గత ఏడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చడం, దీపావళి పండుగ సమయంలో బాణాసంచా పేలుళ్లు, పరిశ్రమలు, వాహన కాలుష్యాలతో రాజధాని ఒక గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. దీంతో ఢిల్లీ పీసీఏ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు చర్యలు ప్రకటించారు. అందులో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కూడా ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యతను పర్యవేక్షించే 37 స్టేషన్లలో శుక్రవారం తెల్లవారుజాము సమయానికి ప్రమాదకరమైన సూచికలే కనిపించాయి. పొరుగు రాష్ట్రాలదే బాధ్యత: కేజ్రీవాల్ పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల్ని ఇష్టారాజ్యంగా కాల్చడం వల్లే ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కాలుష్యం తీవ్రతరం కావడంతో పాఠశాలల పిల్లలకు మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకునేలా మా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి అంకుల్ అంటూ హరియాణా సీఎంలు అమరీందర్ సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లను ఉద్దేశించి పిల్లలంతా లేఖలు రాయాలని సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం మొత్తంగా 50 లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తోంది. మాస్క్ లేకుండా బయటకు రావద్దని రాజధాని వాసులను సీఎం కోరారు. ఢిల్లీలో గాలి నాణ్యతా సూచీ (కాలుష్యం) పాయింట్లు ఎంత ఎక్కువగా ఉన్నాయో చెప్తూ జర్నలిస్ట్ విక్రమ్ చంద్ర ట్వీట్ చేసిన ఫొటో ఇది. -
రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి నుంచి కాలుష్య తీవ్రత ప్రమాదకరస్ధాయికి చేరడంతో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ప్రజారోగ్య ఎమర్జెన్సీని కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. గురువారం రాత్రి ఢిల్లీలో కాలుష్య స్ధాయి ప్రమాదకరంగా మారడంతో నవంబర్ 5 వరకూ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించారు. శీతాకాలంలో క్రాకర్స్ కాల్చడాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిషేధించింది. మరోవైపు కాలుష్యం ఎమర్జెన్సీ దశకు చేరుకోవడంతో స్కూళ్లలో చిన్నారులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్రీతింగ్ మాస్క్‌లను పంచారు. ఢిల్లీ నగరం గ్యాస్ ఛాంబర్‌గా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. హరియాణా, పంజాబ్ వంటి పొరుగు రాష్ట్రాల్లో ఈ సీజన్లో పంట వ్యర్ధాలను రైతులు తగలబెట్టడం వల్ల ఢిల్లీని కాలుష్యం ముంచెత్తుతోందని ఆయన ఆరోపించారు. కాగా వాయు నాణ్యత ప్రమాదకరంగా మారడంతో నవంబర్ 5 వరకూ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించారు. పాఠశాలలకు సెలవలు ప్రకటిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక వాహనాలకు సరి బేసి స్కీమ్ అమలు చేయడంతో పాటు నగరంలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధిస్తామని అధికారులు పేర్కొన్నారు. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్ధాయికి చేరడంతో ఢిల్లీలో మార్నింగ్ వాక్కు, కార్యాలయాలకు వెళ్లే స్ధానికులు మాస్క్‌లు ధరించి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. -
‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జనం రోగాలతో నానా కష్టాలు పడుతున్నారని, తక్షణమే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శనివారం వరంగల్ ఎంజీఎం వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అనంతరం శ్రవణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి విషజ్వరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ 1.82 లక్షల కోట్ల రూపాయలకు ప్రవేశపెట్టి అందులో వైద్య, ఆరోగ్య శాఖకు కేవలం రూ.5536 కోట్లు మాత్రమే కేటాయించారని, మొత్తం బడ్జెట్లో ఇది కేవలం మూడు శాతమేనని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల్లో సగటున వైద్య, ఆరోగ్య శాఖకు 4.8 శాతం చొప్పున బడ్జెట్ కేటాయించాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసిందని చెప్పడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ కమీషన్లు పొందేందుకే కాళేశ్వరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించారని శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక కేవలం కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులు మాత్రమే లబ్ధి పొందారని, ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌కు చెందిన ఒక కుక్కకు ఆనారోగ్యం చేస్తే వైద్యం చేసిన తర్వాత చనిపోయిందంటూ బంజారాహిల్స్ పోలీసులు పశువైద్యుడిపై కేసు పెట్టినట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తను దాసోజు శ్రవణ్ ఉటంకించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో డెంగీ కారణంగా ఒకేరోజు ఆరుగురు పిల్లలు మరణిస్తే ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆయన నిప్పులు చెరిగారు. ఇందుకు బాధ్యులుగా కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం కొత్త అసెంబ్లీ, సచివాలయలు కట్టేందుకు ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మహానగరంలోనే ఇలాంటి దుస్థితి నెలకొని ఉందంటే గ్రామాల్లో ముఖ్యంగా గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు ఎంత తీవ్రంగా జఠిలంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని దాసోజు శ్రవణ్ అన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో 20 రోజులకు ఒక్కసారి మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యాన్ని హెలికాఫ్టర్ ద్వారా సేవలు అందిస్తామని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ గాలి మాటగానే మిగిలిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో జిల్లా కేంద్రాల్లో వెయ్యి పడకలు, మండల కేంద్రాల్లో వంద పడకల ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని శ్రవణ్ నిలదీశారు. అయిదున్నరేళ్లు గడిచినా ఆ హామీకి దిక్కు లేదని దుమ్మెత్తిపోశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని వెయ్యి పడకల స్థాయికి తీసుకువచ్చారని, ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎంజీఎం ఆస్పత్రిని ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తగిన నిధులు ఇవ్వకుండా ఆస్పత్రికే అనారోగ్యం వచ్చిందనేలా చేశారన్నారు. హైదరాబాద్‌లోని నీలోఫర్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్లు పనిచేయక గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క రోజులో 21 మంది రోగులు చనిపోయారని, ఇలాంటి ఘటనల తర్వాత కూడా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం దారుణవిషయమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా రూ.35 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్లాన్ చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ చేయించి దాని నిర్మాణ వ్యయ్యం 80 వేల కోట్ల రూపాయలకు పెంచి 18 లక్షల ఎకరాల్ని సాగు లక్ష్యంగా చేసి ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేస్తోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న కేసీఆర్ చర్యల్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పాలన మొత్తంలో రూ.60 వేల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే అయిదున్నర సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆయన గణాంకాల్ని వివరించారు. కేవలం 60 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేశారని డాక్టర్ శ్రవణ్ నిప్పులు చెరిగారు. వైద్య, ఆరోగ్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. -
ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ!
న్యూయార్క్: కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎబోలా వైరస్ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించడంతో డబ్ల్యూహెచ్ఒ ఈ ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఈ వైరస్ మూడు సార్లు వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 ఆగస్టులో ఈ వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకూ 1,600 మంది మృత్యువాత పడ్డారు. మొదటిసారి 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. -
మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
విశాఖపట్నం: మన్యంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ మన్యంలో అనారోగ్యాలతో బాధపడుతున్న గిరిజనులను పరామర్శించేందుకు శుక్రవారం ఆయన విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రయాణించి బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. -
'రాష్ట్రంలో హెల్త్ ఎమెర్జన్సీ ప్రకటించాలి'
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలకు గురైన వేలాదిమంది ప్రజలు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక చికిత్స నిమిత్తం వెంటనే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని కోరుతూ.. ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రోగుల సంఖ్య విపరీతంగా పెరగడం వలన ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ సరిపోక ఆదివాసీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదలు కూడా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. -
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. పారిశుధ్య నిర్వహణ లోపం, వాతావరణ మార్పులతో డెంగీ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో డెంగీ మరణాలు పెద్ద సంఖ్యలో సంభవించినా ఆ సంఖ్యను రెండుకే పరి మితం చే స్తూ వైద్యారోగ్య మంత్రి ప్రకటన జారీ చేయడం ఆందోళన కలిగిస్తోందని పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే విష జ్వర పీడితుల సంఖ్య ఈ స్థాయికి చేరేది కాదన్నారు. క్రమం తప్పకుండా ఔషధాల సరఫరా, అందుకు తగిన బడ్జెట్ కేటాయింపు, వైద్య, ఆరోగ్య బృందంతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపించడంలో ఆ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
మాట మార్చారు !
హెల్త్ ఎమర్జెన్సీ అనేది చాలా తీవ్రమైన నిర్ణయం. ఇది ప్రకటిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మెడికల్ టీంలను పంపుతాయి. వైద్యశిబిరాలను నిర్వహిస్తాయి. నేను ఎమర్జెన్సీ ప్రకటించలేదు. ఇది ఎందుకు మీడియాలో వస్తోందో అర్థం కాలేదు. అప్రమత్తంగా ఉండాలని మాత్రమే∙చెప్పాం. – శశిధర్, కలెక్టర్ పిల్లలు డెంగీతో చనిపోయారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. అధికారులతో సమీక్ష నిర్వహించాం. హెల్త్ ఎమర్జెన్సీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకాధికారులతో నష్టనివారణ చర్యలు తీసుకుంటాం. – పల్లె రఘునాథరెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి (సాక్షిప్రతినిధి, అనంతపురం) అనంతపురం నగరంలో డెంగీతో పాటు విషజ్వరాల వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ప్రైవేటు క్లినిక్‌లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వచ్చినా రక్తపరీక్షలు చేయించుకునేందుకు రోగులు ల్యాబ్‌లకు పరుగులు పెడుతున్నారు. స్థానిక వినాయకనగర్‌లో ఇద్దరు చిన్నారులు డెంగీతో చనిపోవడంతో ఈ నెల 16 నుంచి మంత్రులు, కార్పొరేషన్ అధికారులు, జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తోంది. ఏకంగా హెల్త్ ఎమర్జెనీ కూడా ప్రకటించారు. నగరంలోని 50 డివిజన్లకు ప్రత్యేకాధికారులుగా జిల్లాస్థాయి అధికారులను నియమించారు. వీరు మూడురోజుల పాటు ఆయా డివిజన్లలో పర్యటించారు. అయితే.. సోమవారం ప్రత్యేకాధికారుల నియామకాన్ని కలెక్టర్ రద్దు చేశారు. నగరంలో రోగాలు ప్రబలకుండా కార్పొరేటర్లతో పాటు కార్పొరేషన్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పట్టణప్రాంతాల్లో ఆర్ఎంపీ క్లినిక్‌లను మూసేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మినహాయించారు. హెల్త్ ఎమర్జెన్సీ లేదని సమాచారశాఖ సవరణ ప్రకటన ఇవ్వడంతో మూడురోజులుగా ప్రభుత్వం చేసింది ఉత్తి హడావుడే అని తేలిపోయింది. కీలక వ్యక్తులు కూడా అవగాహన లేకుండా ప్రకటనలు చేయడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. నగరంలోని పరిస్థితులపై మంత్రులు, అధికారులకు ఏమేరకు అవగాహన ఉందనే విషయం ఇట్టే తెలుస్తోందని అంటున్నారు. ఉపాధి కోల్పోనున్న ఆర్ఎంపీలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు క్లినిక్‌లు నడుపుతున్నారు. జ్వరాలు, చిన్నచిన్న వ్యాధులకు తక్కువ ధరతో ప్రాథమిక చికిత్సలు చేస్తున్నారు. ఆర్ఎంపీ క్లినిక్‌లను ప్రస్తుతం పట్టణప్రాంతాల్లో రద్దు చేశారు. వీటిని శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యశాలలు, నిపుణులైన డాక్టర్లతో ప్రైవేటు ఆస్పత్రులు అందుబాటులో ఉన్నప్పుడు ఆర్ఎంపీలు ఎందుకనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ æప్రాంతాల్లో వైద్యశాలల కొరతతో రోగులు ఇబ్బందిపడకుండా ఆర్ఎంపీలకు తాత్కాలికంగా అనుమతిచ్చారు. వీరిæ పనితీరుపైనా వైద్య, ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులతో నిఘా ఉంచారు. కొద్దిరోజులు æపనితీరు బేరీజు వేసి కొనసాగించాలా, వద్దా అని నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్ఎంపీల వ్యవస్థ రద్దు చేస్తే వందలాది మంది వీధినపడే అవకాశముంది. కార్పొరేషన్‌దే బాధ్యత : కోన శశిధర్, జిల్లా కలెక్టర్ నగరంలో మంచినీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కమిషనర్‌ను ఆదేశించాం. కార్పొరేటర్లు కూడా బాధ్యత తీసుకోవాలి. మంచినీటి సరఫరాలో సమస్య ఉంది. మూడురోజులకోసారి ఇస్తున్నారు. అక్రమ కొళాయి కనెక్షన్లు తొలగించి నీళ్లు రోజూ ఇవ్వాలని చెప్పా. నీటి నాణ్యత పరీక్ష కోసం ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. నీటిసరఫరాను నెలరోజుల పాటు పర్యవేక్షించాలని పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ అంకయ్యను ఆదేశించాం. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి. -
అనంతపురం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ
అనంతపురం : అనంతపురం జిల్లాలో 144 డెంగీ, 506 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నతాధికారులు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. గత ఎనిమిది మాసాలుగా విషజ్వరాలతో 15 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో రెండు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్ఎంపీ క్లీనిక్‌లు మూసివేశారు. మురికివాడల్లో శుభ్రతపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు.