హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించండి | Declare a health emergency | Sakshi
Sakshi News home page

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించండి

Published Sun, Sep 1 2024 4:49 AM | Last Updated on Sun, Sep 1 2024 4:49 AM

Declare a health emergency

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలన గాడితప్పి ప్రజారోగ్యం పడకేసి తెలంగాణ మొత్తం విషజ్వరాల బారిన పడినందున.. వెంటనే ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచి్చందని, కానీ దీనిద్వారా అసలైన సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో చెరువులను పరిరక్షించాల్సిందేనని, కానీ ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్‌ చేశారు. 

కబ్జాల వివరాలు బయట పెట్టాలని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. దేవాదాయ భూములు, అసైన్డ్‌ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్నాక.. వాటిపై ప్రతాపం చూపొద్దన్నారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు రేవంత్‌ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రుణమాఫీ చేయలేదు.. తులం బంగారం లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వ లేదని ఎద్దేవా చేశారు. ఉచితాలు, హామీలు, గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు హామీలిచ్చి.. గద్దెనెక్కాక ప్రజలను గోస పెడుతున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు, అవినీతి, అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీస్తున్నాయని తెలిపారు. రాహుల్‌ గాంధీ కటాకట్‌ కటాకట్‌ డబ్బులు వేస్తామని చెప్పారు.. ఇప్పుడు తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఫటాఫట్‌ దివాలా తీశాయని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణనుæ ఢిల్లీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కోర్టులకు రాజకీయ రంగు పులమడం కాంగ్రెస్‌కే చెల్లిందన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామన్న.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, అన్ని విషయాలకు కోర్టులు, న్యాయ వ్యవస్థ ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా లక్ష్మణ్‌ చెప్పారు. 

అధికారంలోకి రాకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలకు పిచ్చి ముదిరిందని, ఇప్పటికే ఆ పార్టీ ఖేల్‌ఖతం.. దుకాణం బంద్‌ అయ్యిందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కొత్తగా కలిసేది ఏముంది? వాళ్లు ఎప్పుడో కలిశారు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో బీజేపీ ఉద్యమ బాట పడుతుందని, త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తుందని లక్ష్మణ్‌ వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement