‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి’ | Dasoju Sravan Demand Health Emergency In Telangana | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి’

Published Sat, Sep 14 2019 9:42 PM | Last Updated on Sat, Sep 14 2019 10:10 PM

Dasoju Sravan Demand Health Emergency In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జనం రోగాలతో నానా కష్టాలు పడుతున్నారని, తక్షణమే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం వరంగల్‌ ఎంజీఎం వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అనంతరం శ్రవణ్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి విషజ్వరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ 1.82 లక్షల కోట్ల రూపాయలకు ప్రవేశపెట్టి అందులో వైద్య, ఆరోగ్య శాఖకు కేవలం రూ.5536 కోట్లు మాత్రమే కేటాయించారని, మొత్తం బడ్జెట్‌లో ఇది కేవలం మూడు శాతమేనని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల్లో సగటున వైద్య, ఆరోగ్య శాఖకు 4.8 శాతం చొప్పున బడ్జెట్‌ కేటాయించాయని, టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసిందని చెప్పడానికి బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనమన్నారు. 

సీఎం కేసీఆర్‌ కమీషన్లు పొందేందుకే కాళేశ్వరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించారని శ్రవణ్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక కేవలం కేసీఆర్‌ ఆయన కుటుంబసభ్యులు మాత్రమే లబ్ధి పొందారని, ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌కు చెందిన ఒక కుక్కకు ఆనారోగ్యం చేస్తే వైద్యం చేసిన తర్వాత చనిపోయిందంటూ బంజారాహిల్స్‌ పోలీసులు పశువైద్యుడిపై కేసు పెట్టినట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తను దాసోజు శ్రవణ్‌ ఉటంకించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో డెంగీ కారణంగా ఒకేరోజు ఆరుగురు పిల్లలు మరణిస్తే ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆయన నిప్పులు చెరిగారు. ఇందుకు బాధ్యులుగా కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం కొత్త అసెంబ్లీ, సచివాలయలు కట్టేందుకు ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ మహానగరంలోనే ఇలాంటి దుస్థితి నెలకొని ఉందంటే గ్రామాల్లో ముఖ్యంగా గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు ఎంత తీవ్రంగా జఠిలంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో 20 రోజులకు ఒక్కసారి మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యాన్ని హెలికాఫ్టర్‌ ద్వారా సేవలు అందిస్తామని గతంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీ గాలి మాటగానే మిగిలిందన్నారు. టీఆర్ఎస్‌ పార్టీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో జిల్లా కేంద్రాల్లో వెయ్యి పడకలు, మండల కేంద్రాల్లో వంద పడకల ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని శ్రవణ్‌ నిలదీశారు. అయిదున్నరేళ్లు గడిచినా ఆ హామీకి దిక్కు లేదని దుమ్మెత్తిపోశారు. 

గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని వెయ్యి పడకల స్థాయికి తీసుకువచ్చారని, ఇప్పటి టీఆర్ఎస్‌ ప్రభుత్వం మాత్రం ఎంజీఎం ఆస్పత్రిని ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తగిన నిధులు ఇవ్వకుండా ఆస్పత్రికే అనారోగ్యం వచ్చిందనేలా చేశారన్నారు. హైదరాబాద్‌లోని నీలోఫర్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా చేసిన టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలని దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్లు పనిచేయక గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క రోజులో 21 మంది రోగులు చనిపోయారని, ఇలాంటి ఘటనల తర్వాత కూడా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం దారుణవిషయమన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా రూ.35 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్లాన్‌ చేస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వం రీడిజైన్‌ చేయించి దాని నిర్మాణ వ్యయ్యం 80 వేల కోట్ల రూపాయలకు పెంచి 18 లక్షల ఎకరాల్ని సాగు లక్ష్యంగా చేసి ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేస్తోందని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రీడిజైన్‌ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న కేసీఆర్‌ చర్యల్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పాలన మొత్తంలో రూ.60 వేల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే అయిదున్నర సంవత్సరాల్లో టీఆర్ఎస్‌ ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆయన గణాంకాల్ని వివరించారు. కేవలం 60 నెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేశారని డాక్టర్‌ శ్రవణ్‌ నిప్పులు చెరిగారు.
 వైద్య, ఆరోగ్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ విమర్శలు గుప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement