ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదే అని తెలంగాణాలో ఏ పార్టీకాపార్టీ ప్రకటించుకుంటోంది. సాలు దొర...చంపకు దొరా అంటూ కమలనాధులు ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసి మరీ కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఇక తగ్గేదేలేదంటున్న టీఆర్‌ఎస్ సైతం ఎన్నికలకు సిద్ధం అనే సిగ్నల్ ఇస్తోంది. సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి...ఎన్నికలకు డేట్ ఫిక్స్ చేయండంటూ ప్రతిపక్షాలకు చాలెంజ్ విసిరారు. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికలెప్పుడొచ్చినా గెలిచేది తామేనంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. దీంతో తెలంగాణాలో ముందస్తు ఖచ్చితమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తమకు మరోసారి అధికారం సిద్ధిస్తుందని కేసీఆర్ ధీమా. అయితే అభివృద్ధి సంక్షేమ పథకాల కన్నా వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్లు, ఎమోషన్సే కీలకం కానున్నాయని అటు ప్రతిపక్షాలు ఇటు అధికారపక్షం నిర్ణయానికొచ్చేసాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి కార్డు ప్లే చేయడం ద్వారా... క్యాస్ట్ పాలిటిక్స్‌ను సీరియస్‌గానే ప్లే చేస్తోంది.
బంగారు తెలంగాణా అంటూ అభివృద్ది మంత్రం జపిస్తున్నా... ఎన్నికల్లో సెంటిమెంటే ఆధారం అని గులాబీ పార్టీ భావిస్తోంది. తెలంగాణా కోసం పోరాడింది టీఆర్‌ఎస్ మాత్రమే అనే సెంటిమెంటును ప్రజల్లో ఎప్పటికప్పుడు లైవ్‌గా ఉంచడంతో పాటు... కేంద్రం తెలంగాణాకు ద్రోహం చేస్తోందనే స్ట్రాటజీని టీఆర్‌ఎస్ అనుసరిస్తోంది. అందుకే తెలంగాణా సాధన కేసీఆర్ వల్లే సాధ్యమైందనే భావనను గులాబీ నేతలు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉన్నారు. తెలంగాణా సెంటిమెంటును బలంగా ప్రజల్లో చర్చకు పెట్టడం ద్వారా బీజేపీపై ఢిల్లీ పార్టీగా ముద్రవేయాలనేది కేసీఆర్ వ్యూహంగా ఉంది.
గతంలో బెంగాల్‌లో మమతా బెనర్జీ లోకల్ వర్సెస్ ఔట్ సైడర్ అంటూ బీజేపీపై తీవ్రమైన ఎదురుదాడి చేశారు. తాను లోకల్ అని బీజేపీ బయటి పార్టీ అని ప్రచారం చేశారు. దీదీ గెలుపులో ఈ క్యాంపెన్ బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు అచ్చంగా ఇదే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు. అందుకే కేసీఆర్ రాష్ట్ర బీజేపీ నేతలకన్నా...ప్రధాని మోదీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తాను తెలంగాణా బిడ్డనని మోదీ బయటి వ్యక్తి అనేది మెల్లిగా ఇంజక్ట్ చేయడం ఈ క్యాంపేన్ ఉద్దేశం. తద్వారా లోకల్ బీజేపీ లీడర్లపై చర్చలేకుండా చేస్తున్నారు. ఎన్నికలు వచ్చే నాటికి తెలంగాణా సెంటిమెంటును మరో కోణంలో ప్రజల్లోకీ తీసుకువెళ్ళేందుకు... ఈ స్ట్రాటజీ అమలుచేస్తున్నారు. తెలంగాణా సెంటిమెంటు వర్కవుట్ అయితే సామాజిక సమీకరణాలకు విరుద్ధంగా అన్ని వర్గాల ఓట్లు తమకే పడతాయని టీఆర్ఎస్ భావిస్తోంది.
ప్రత్యేక తెలంగాణా కోసం పుష్కరకాలం పోరాటం చేసిన టీఆర్ఎస్‌కు ప్రస్తుతం గ్రామస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. దశాబ్దాల పాటు తెలంగాణా రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, రాష్ట్రంలో టీడీపీ అంతరించడంతో ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. తెలంగాణా కోసం పోరాడిన ప్రజాసంఘాలు సైతం రాష్ట్రం సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే సపోర్ట్ చేశాయి. అయితే 2018 ఎన్నికల సమయానికి సీన్ కాస్త మారింది. తెలంగాణా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజాసంఘాల నాయకులు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా గొంతు విప్పడం ప్రారంభించారు. చాలామంది ఉద్యమకారులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. అయినా తెలంగాణా సెంటిమెంటు వచ్చేసరికి కేసీఆర్ ఒక్కరే బాహుబలి అనేది ప్రతీసారి రుజువవుతోంది.
ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ఉద్యమకాలం నాటి బలమైన సెంటిమెంటు లేదు. అందుకే కేసీఆర్ సంక్షేమ మంత్రానికి సోషల్ ఇంజనీరింగ్ జత చేస్తున్నారు. రైతు భరోసా, పెన్షన్ స్కీంలకు తోడు వివిధ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ సంక్షేమ పథకాలను విస్తరిస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భగా కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే దళితబంధు పథకాన్ని కేసీఆర్ ట్రంప్ కార్డుగానే భావిస్తున్నారు. తెలంగాణాలో దాదాపు 17శాతం ఉన్న దళితులను బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకోడానికి దళితబంధు పథకం కీలకం అవుతుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ముఖ్యంగా ఒకప్పుడు కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా ఉన్న దళితులు చాలామంది గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేశారు. హుజురాబాద్ ఉపఎన్నికలోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. అందుకే సంక్షేమ పథకాల ద్వారా దళిత ఓటుబ్యాంకును బలోపేతం చేసుకోవాలనేది గులాబీ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment