హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. పారిశుధ్య నిర్వహణ లోపం, వాతావరణ మార్పులతో డెంగీ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో డెంగీ మరణాలు పెద్ద సంఖ్యలో సంభవించినా ఆ సంఖ్యను రెండుకే పరి మితం చే స్తూ వైద్యారోగ్య మంత్రి ప్రకటన జారీ చేయడం ఆందోళన కలిగిస్తోందని పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే విష జ్వర పీడితుల సంఖ్య ఈ స్థాయికి చేరేది కాదన్నారు. క్రమం తప్పకుండా ఔషధాల సరఫరా, అందుకు తగిన బడ్జెట్ కేటాయింపు, వైద్య, ఆరోగ్య బృందంతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపించడంలో ఆ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.