
జెనీవా: కరోనా మహమ్మారి పీడ దాదాపుగా విరగడైనట్టే. గత మూడున్నరేళ్లుగా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ దశను దాటేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కోవిడ్–19 అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఇకపై చూడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధ్నామ్ వెల్లడించారు.
కనీవినీ ఎరుగని రీతిలో లాక్‌డౌన్‌లతో నాలుగ్గోడల మధ్య ప్రజలు బందీగా ఉండడం, ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవడం వంటి వాటితో కరోనా కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ బలహీనపడిపోయినప్పటికీ ఇంకా ముగింపు దశకు చేరుకోలేదని టెడ్రోస్ చెప్పారు. ఇప్పటికీ ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయని, ప్రతీ వారం కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. 2020 జనవరి 30 డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్–19ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.