మాట మార్చారు !
- హెల్త్ ఎమర్జెన్సీ అనేది చాలా తీవ్రమైన నిర్ణయం. ఇది ప్రకటిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మెడికల్ టీంలను పంపుతాయి. వైద్యశిబిరాలను నిర్వహిస్తాయి. నేను ఎమర్జెన్సీ ప్రకటించలేదు. ఇది ఎందుకు మీడియాలో వస్తోందో అర్థం కాలేదు. అప్రమత్తంగా ఉండాలని మాత్రమే∙చెప్పాం. – శశిధర్, కలెక్టర్
- పిల్లలు డెంగీతో చనిపోయారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. అధికారులతో సమీక్ష నిర్వహించాం. హెల్త్ ఎమర్జెన్సీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకాధికారులతో నష్టనివారణ చర్యలు తీసుకుంటాం. – పల్లె రఘునాథరెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
అనంతపురం నగరంలో డెంగీతో పాటు విషజ్వరాల వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ప్రైవేటు క్లినిక్‌లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వచ్చినా రక్తపరీక్షలు చేయించుకునేందుకు రోగులు ల్యాబ్‌లకు పరుగులు పెడుతున్నారు. స్థానిక వినాయకనగర్‌లో ఇద్దరు చిన్నారులు డెంగీతో చనిపోవడంతో ఈ నెల 16 నుంచి మంత్రులు, కార్పొరేషన్ అధికారులు, జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తోంది. ఏకంగా హెల్త్ ఎమర్జెనీ కూడా ప్రకటించారు. నగరంలోని 50 డివిజన్లకు ప్రత్యేకాధికారులుగా జిల్లాస్థాయి అధికారులను నియమించారు. వీరు మూడురోజుల పాటు ఆయా డివిజన్లలో పర్యటించారు. అయితే.. సోమవారం ప్రత్యేకాధికారుల నియామకాన్ని కలెక్టర్ రద్దు చేశారు. నగరంలో రోగాలు ప్రబలకుండా కార్పొరేటర్లతో పాటు కార్పొరేషన్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పట్టణప్రాంతాల్లో ఆర్‌ఎంపీ క్లినిక్‌లను మూసేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మినహాయించారు. హెల్త్ ఎమర్జెన్సీ లేదని సమాచారశాఖ సవరణ ప్రకటన ఇవ్వడంతో మూడురోజులుగా ప్రభుత్వం చేసింది ఉత్తి హడావుడే అని తేలిపోయింది. కీలక వ్యక్తులు కూడా అవగాహన లేకుండా ప్రకటనలు చేయడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. నగరంలోని పరిస్థితులపై మంత్రులు, అధికారులకు ఏమేరకు అవగాహన ఉందనే విషయం ఇట్టే తెలుస్తోందని అంటున్నారు.
ఉపాధి కోల్పోనున్న ఆర్‌ఎంపీలు
పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు క్లినిక్‌లు నడుపుతున్నారు. జ్వరాలు, చిన్నచిన్న వ్యాధులకు తక్కువ ధరతో ప్రాథమిక చికిత్సలు చేస్తున్నారు. ఆర్‌ఎంపీ క్లినిక్‌లను ప్రస్తుతం పట్టణప్రాంతాల్లో రద్దు చేశారు. వీటిని శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యశాలలు, నిపుణులైన డాక్టర్లతో ప్రైవేటు ఆస్పత్రులు అందుబాటులో ఉన్నప్పుడు ఆర్‌ఎంపీలు ఎందుకనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ æప్రాంతాల్లో వైద్యశాలల కొరతతో రోగులు ఇబ్బందిపడకుండా ఆర్‌ఎంపీలకు తాత్కాలికంగా అనుమతిచ్చారు. వీరిæ పనితీరుపైనా వైద్య, ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులతో నిఘా ఉంచారు. కొద్దిరోజులు æపనితీరు బేరీజు వేసి కొనసాగించాలా, వద్దా అని నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్‌ఎంపీల వ్యవస్థ రద్దు చేస్తే వందలాది మంది వీధినపడే అవకాశముంది.
కార్పొరేషన్‌దే బాధ్యత : కోన శశిధర్, జిల్లా కలెక్టర్
నగరంలో మంచినీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కమిషనర్‌ను ఆదేశించాం. కార్పొరేటర్లు కూడా బాధ్యత తీసుకోవాలి. మంచినీటి సరఫరాలో సమస్య ఉంది. మూడురోజులకోసారి ఇస్తున్నారు. అక్రమ కొళాయి కనెక్షన్లు తొలగించి నీళ్లు రోజూ ఇవ్వాలని చెప్పా. నీటి నాణ్యత పరీక్ష కోసం ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. నీటిసరఫరాను నెలరోజుల పాటు పర్యవేక్షించాలని పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ అంకయ్యను ఆదేశించాం. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి.