మృత్యుఘోష | people dies of dengue in anantapur | Sakshi
Sakshi News home page

మృత్యుఘోష

Published Sat, Sep 24 2016 10:58 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

people dies of dengue in anantapur

♦   డెంగీ, విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు
♦   9 రోజుల్లో 8 మంది మృతి...వందలాది మంది ఆస్పత్రుల పాలు
♦   డెంగీ కాదంటూ అధికారుల బుకాయింపు
♦   సీజనల్‌ వ్యాధులతో ఇప్పటి వరకూ 34 మంది మతి
♦   నష్టనివారణ చర్యల్లో ప్రభుత్వం ఘోర వైఫల్యం

సాక్షిప్రతినిధి, అనంతపురం : అనంతపురంలోని వినాయక్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఇద్రిస్‌(12), మహ్మద్‌లతీఫ్‌ జునైద్‌(9) అనే చిన్నారులు ఈ నెల 15న మృతిచెందారు. వీరికి 15రోజుల కిందట జ్వరం వచ్చింది. స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ  వద్ద చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు డెంగీ సోకిందని నిర్ధారించి బెంగళూరుకు సిఫార్సు చేశారు. బెంగళూరులోని రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు కూడా రక్తకణాల సంఖ్య తగ్గిందని నిర్ధారించారు. ప్లేట్‌లెట్లు ఎక్కించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి చిన్నారులు చనిపోయారు. ప్లేట్‌లెట్లు ఎక్కించారంటే డెంగీ అనేది స్పష్టంగా తెలుస్తోంది. కానీ అధికారులు అదేమీ కాదంటూ బుకాయిస్తున్నారు.

                వీరిద్దరే కాదు.. గత తొమ్మిది రోజుల్లో డెంగీ, విషజ్వరాలు, డయేరియాతో జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది మత్యువాతపడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారులే. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 34మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోజూ ఎక్కడో ఒకచోట మత్యుఘోష వినిపిస్తూనే ఉంది. అధికారులు మాత్రం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించడం  లేదు. ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన చికిత్సను అందించడం లేదు. 

పైగా డెంగీ కాకుండా హైఫీవర్, నిమోనియాతో చనిపోయారంటూ తప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. జ్వరంతో చిన్నారులు చనిపోతే వైద్య, ఆరోగ్య శాఖకు తెలిపిన తర్వాతే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలపాలని ప్రభుత్వ వైద్యశాలలతో పాటు ప్రైవేటు క్లినిక్‌లకు  అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులకు కూడా ఈ ఆదేశాలు అందినట్లు తెలిసింది. డెంగీ దోమకాటుతో వస్తుంది. డెంగీ అని నిర్ధారిస్తే పారిశుద్ధ్యలోపం తెరపైకి వస్తుంది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనివల్లే డెంగీతో మతి కేసులను నిర్ధారించడం లేదు.

స్పష్టంగా తెలుస్తున్నా..
         డెంగీ సోకితే రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 20వేల కంటే తగ్గి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తాయి.   రక్తంలోని ప్లాస్మా బయటకు లీకయ్యే ప్రమాదముంది. అలా జరిగితే రక్తం చిక్కబడి బీపీ తగ్గుతుంది. రక్తకణాలు లక్షకన్నా తగ్గి ప్యాక్‌డ్‌ సెల్‌వాల్యూమ్‌(పీసీవీ) ఉండాల్సిన దానికంటే 20శాతం పెరిగితే రక్తస్రావం లేకున్నా డెంగీగా భావించాల్సి ఉంటుంది. అనంతపురానికి చెందిన ఇద్దరు చిన్నారులకు ప్లేట్‌లెట్లు తగ్గిపోయాయి. మూడు రక్తపరీక్షలు నిర్వహించగా.. ఒకటి డెంగీ పాజిటివ్‌ అని వచ్చింది. అయినప్పటికీ ‘అనంత’ అధికారులు డెంగీగా నిర్ధారించలేదు. ప్రైవేటు క్లినిక్‌లు కూడా డెంగీతో మతి చెందారని సర్టిఫికెట్లు ఇస్తే ఆస్పత్రిపై ప్రభావితం చూపుతుందన్న ఉద్దేశంతో వేరే కారణాలు రాస్తున్నట్లు సమాచారం.  హిందూపురం ఆస్పత్రిలో ఈ నెల 20న చిన్నారి నవిత (4) ప్లేట్‌లెట్లు తగ్గిపోయి డెంగీ లక్షణాలతో చనిపోయినా వైద్యులు మాత్రం ‘హైఫీవర్‌ విత్‌ ఫిట్స్‌’ అని రాశారు.

బాధ్యత నుంచి తప్పించుకుంటూ..
అనంతపురం సర్వజనాస్పత్రిలో 148మంది జ్వరంతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20మందికి డెంగీ ఉంది. వీరిలో 11మంది చిన్నపిల్లలే. అనంతపురంలోని ఆదర్శనగర్‌కు చెందిన ప్రభు అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.  హిందూపురం జిల్లా ఆస్పత్రిలో 53మంది జ్వరాలతో చికిత్స పొందుతుండగా.. వీరిలో ఇద్దరు డెంగీ బాధితులు ఉన్నారు. అనంతపురంలోని ప్రైవేటు క్లినిక్‌లలో కూడా డెంగీతో పలువురు చికిత్స పొందుతున్నారు.   సర్వజనాస్పత్రి సామర్థ్యం 350 పడకలు. కానీ వెయ్యిమందికిపైగా  చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ ల్యాబ్‌లో రక్తపరీక్షలు చేసేందుకు సిబ్బంది కొరత వేధిస్తోంది. వైద్యులు, వైద్య సిబ్బంది కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది.
 
డెంగీ మరణాలు లేవు: డాక్టర్‌ వెంకటరమణ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి
    ఇప్పటి వరకూ ఒక్కరూ డెంగీతో చనిపోలేదు. డెంగీతో చనిపోయినా హైఫీవర్‌తో అని సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ మేం ఎలాంటి ఆదేశాలూ జారీచేయలేదు. డెంగీతో చనిపోతే ఆ విషయాన్నే నిర్ధారిస్తాం. డెంగీ బాధితుల కోసం ప్రత్యేకవార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నాం.

ఇటీవల చనిపోయిన చిన్నారుల వివరాలు
పేరు            చనిపోయిన తేదీ    చిరునామా                మతికి కారణం    
మహ్మద్‌ ఇద్రిస్‌(12)    15–9–2016        వినాయక్‌నగర్, అనంతపురం    డెంగీ    
మహ్మద్‌లతీఫ్‌(9)    15–9–2016        వినాయక్‌నగర్, అనంతపురం    డెంగీ    
నవిత (4)            20–9–2016        కెరసానిపల్లి, మడకశిర        తీవ్ర జ్వరం    
యక్షిత(3)            21–9–2016        పాపసానిపల్లి, మడకశిర        తీవ్రజ్వరం    
వెంకటలక్ష్మి(6నెలలు)    21–9–2016        పాతకల్లూరు, గార్లదిన్నె        డయేరియా    
శ్రీజ(15)            22–9–2016        ధర్మవరం టౌన్‌            డెంగీ    
నందకిషోర్‌(3)        22–9–2016        చెన్నంపల్లి, బీకేసముద్రం        తీవ్ర జ్వరం    
ఆదిలక్ష్మి(35)        23–9–2016        కుసుమవారిపల్లి, ఓడీచెరువు    తీవ్ర జ్వరం    
––––––––––––––––––––––––––––––––––––––

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement