పగబట్టిన డెంగీ
కణేకల్లు మండలం బెణికల్లుకు చెందిన నాలుగేళ్ల బాలుడి పేరు రిషి. తీవ్ర జ్వరంతో ఈనెల 23న అనంతపురం సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్య పరీక్షలు చేశాక ఇప్పుడు ‘డెంగీ’గా నిర్ధారించారు. గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుందని, అందువల్లే ఊరిలో చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు బాలుడి తండ్రి వన్నూరుస్వామి తెలిపారు.
– బెంబేలెత్తిస్తున్న మలేరియా, టైఫాయిడ్
– బాధితుల్లో చిన్నారులే అధికం
– పీహెచ్‌సీల్లో అందని వైద్యం
– నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ
200 : ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు డెంగీ పాజిటివ్ కేసులు
152 : మలేరియా పాజిటివ్ కేసులు
1157 : టైఫాయిడ్
7 : స్వైన్ ఫ్లూ (ఏప్రిల్ వరకు)
80 : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
15 : సామాజిక ఆరోగ్య కేంద్రాలు
650 : నిత్యం అనంతపురం సర్వజనాస్పత్రికి వస్తున్న జ్వర పీడితులు (సుమారుగా)
అనంతపురం మెడికల్: ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. పల్లెలు.. పట్టణాలు తేడా లేకుండా ప్రజలు మంచం పడుతున్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 200 పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదవడం చూస్తే తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతోంది. ఇవన్నీ ప్రభుత్వాసుపత్రుల్లో నిర్ధారించిన కేసులు మాత్రమే. ఇక కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఇతర ప్రయివేట్ ఆసుపత్రుల్లోచేరి చికిత్స పొందుతున్న రోగులు వందల్లోనే. రికార్డుల్లోకి చేరని రోగులు, మరణాలు పదుల సంఖ్యలో ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, 19 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, అనంతపురం సర్వజనాస్పత్రి ఉన్నాయి. అనంతపురం సర్వజనాస్పత్రి, హిందూపురం ఆస్పత్రుల్లో మాత్రమే ‘ఎలీసా’ విధానంలో డెంగీ నిర్ధారణ చేసే అవకాశం ఉంది.
అధికారిక లెక్క ఇక్కడ పరీక్షలు చేసినవి మాత్రమే. ఇక కర్నూలు ప్రభుత్వాస్పత్రి, తిరుపతి స్విమ్స్‌లో జిల్లాకు సంబంధించి పాజిటివ్ కేసులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో చిన్నారులే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా పారిశుద్ధ్యం పడకేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు స్పష్టమవుతోంది. పంచాయతీలు, మునిసిపాలిటీల్లో పైపులు పగిలిపోయి మంచి నీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంకులను క్లోరినేషన్ చేయకపోవడం.. ఫ్లోరోస్కోపిక్‌తో నీటి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం.. పాట్ క్లోరినేషన్‌పై కనీస అవగాహన కల్పించని పరిస్థితి ప్రస్తుత వ్యాధుల తీవ్రతకు కారణమవుతోంది.
దండయాత్ర పేరుతో ఆర్భాటం
ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు ముద్రించి సబ్ సెంటర్ల స్థాయి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. క్షేత్రస్థాయి నుంచి రెండు ఫొటోలు మెయిల్ చేస్తే వాటిని ఉన్నతాధికారులకు పంపి ఏదో చేసేశాం అని గొప్పలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా దోమల బెడద తీవ్రంగా ఉంది. అదేదో ‘శనివారం మాత్రమే దోమలు బయటకు వస్తాయన్నట్లు ఆ రోజు మాత్రమే ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అంటూ ఓ కాలనీకి వెళ్లి జెండా ఊపి వచ్చేస్తుండటం గమనార్హం.
హై రిస్క్ ప్రాంతాలపైనా దృష్టి లేదాయె
జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన డెంగీ, మలేరియా కేసులను పరిశీలిస్తే ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆత్మకూరు, ధర్మవరం అర్బన్, బ్రహ్మసముద్రం, రాయదుర్గం అర్బన్, కనగానపల్లి, కుందుర్పి, కూడేరు, గార్లదిన్నె, గుంతకల్లు, నాగసముద్రం, కదిరి ప్రాంతాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఒక్క అనంతపురం నగరంలోనే వందల సంఖ్యలో జ్వర పీడితులున్నారు. మురికివాడల్లో అయితే పరిస్థితి మరీ ఘోరం. 50 డివిజన్ల పరిధిలో 350 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కరువయింది.