ఇంత నిర్లక్ష్యమా..?
– జిల్లాను చుట్టుముట్టిన రోగాలు
– ప్రజలను అప్రమత్తం చేసేందుకు ‘ఎపిడమిక్ సెల్’ ఏర్పాటు
– కనీస అవగాహన కల్పించని వైద్య ఆరోగ్యశాఖ
– పక్షం రోజులైనా 10 కాల్స్ కూడా రాని వైనం
అనంతపురం మెడికల్ : ఓ వైపు జిల్లాను రోగాలు పట్టిపీడిస్తున్నాయి.. డెంగీ..మలేరియా..టైఫాయిడ్..డయేరియా.. వైరల్ ఫీవర్స్‌తో జనం విలవిలాడిపోతున్నారు. మరోవైపు గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించడానికి, వ్యాధుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ‘ఎపిడమిక్ సెల్’ నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. ఎపిడమిక్ సెల్ అంటూ ఒకటుందని కనీసం ప్రచారం చేసిన దాఖలాలు లేవు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సాక్షాత్తూ కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేసినా కేవలం ఆర్భాటంగా ప్రారంభించి తూతూ మంత్రంగా కలెక్టర్‌కు నివేదికలు పంపుతున్నారు.
ఈ నెల 3వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ‘ఎపిడమిక్ సెల్’ను అధికారులు ప్రారంభించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు తమకు తలెత్తుతున్న ఇబ్బందులను, గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితిని 08554–220933 నంబర్‌కు కాల్‌చేసి చెప్పొచ్చు. ఈ సెల్‌లో విధులు నిర్వర్తించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న నలుగురు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల (ఎంపీహెచ్‌ఏ)ను డెప్యుటేషన్‌పై నియమించారు. ఒకరు రిలీవర్‌గా ఉంటుండగా ముగ్గురు 24 గంటల పాటు విధులు నిర్వర్తించాలి. ప్రజలు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలిపితే ఇక్కడి సిబ్బంది సంబంధిత పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తారు. రోగాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. ప్రతి రోజూ సాయంత్రం సాయంత్రం 5 గంటలకు జిల్లా మలేరియా అధికారి, డీఎంహెచ్‌ఓలకు కాల్స్ వివరాలు తెలిపితే.. 6 గంటలకు కాల్ డేటాకు సంబంధించి నోట్‌ను కలెక్టర్ వీరపాండియన్‌కు పెట్టాలి.
ఎవరు కాల్ చేశారు, సమస్య ఏంటి, తీసుకున్న చర్యలు, పీహెచ్‌సీ, మెడికల్ ఆఫీసర్, కాల్ చేసిన వ్యక్తి పేరు తదితర వివరాలన్నీ ఇందులో ఉండాల్సిందే. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ‘ఎపిడమిక్ సెల్’ను అధికారులు పట్టించుకోవడం మానేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించలేదు. ఈనెల 3వ తేదీ సెల్ ప్రారంభమైతే ఇప్పటి వరకు కనీసం పది కాల్స్ కూడా రాని పరిస్థితి. రొళ్ల మండలం రత్నగిరి పంచాయతీలోని అల్పనపల్లిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని చిరంజీవి అనే వ్యక్తి ఏకంగా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్తే ఆ తర్వాత ఎపిడమిక్ సెల్ నుంచి తగిన చర్యలు తీసుకున్నారు.
గుంతకల్లు మండలం నాగసముద్రంలో ఊరిమధ్య మరుగుదొడ్లు ఉన్నాయని, దోమల వ్యాప్తితో పాటు డెంగీ ప్రబలుతున్నట్లు గ్రీవెన్స్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఎపిడమిక్ సెల్‌కు చేశారు. ఇక అనంతపురంలోని బుడ్డప్పనగర్‌కు చెందిన అనంతమ్మ, బుక్కరాయసముద్రం విరూపాక్షేశ్వరనగర్‌కు చెందిన మహబూబ్‌బాషాలు డ్రైనేజీ, విష జ్వరాలపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయా సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రస్తుతం జిల్లా నలుమూలలా సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఎపిడమిక్ సెల్‌పై విస్త్రృత ప్రచారం చేస్తే కాస్త ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.