diseases spread
-
పగబట్టిన డెంగీ
కణేకల్లు మండలం బెణికల్లుకు చెందిన నాలుగేళ్ల బాలుడి పేరు రిషి. తీవ్ర జ్వరంతో ఈనెల 23న అనంతపురం సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్య పరీక్షలు చేశాక ఇప్పుడు ‘డెంగీ’గా నిర్ధారించారు. గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుందని, అందువల్లే ఊరిలో చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు బాలుడి తండ్రి వన్నూరుస్వామి తెలిపారు. – బెంబేలెత్తిస్తున్న మలేరియా, టైఫాయిడ్ – బాధితుల్లో చిన్నారులే అధికం – పీహెచ్‌సీల్లో అందని వైద్యం – నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ 200 : ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు డెంగీ పాజిటివ్ కేసులు 152 : మలేరియా పాజిటివ్ కేసులు 1157 : టైఫాయిడ్ 7 : స్వైన్ ఫ్లూ (ఏప్రిల్ వరకు) 80 : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 15 : సామాజిక ఆరోగ్య కేంద్రాలు 650 : నిత్యం అనంతపురం సర్వజనాస్పత్రికి వస్తున్న జ్వర పీడితులు (సుమారుగా) అనంతపురం మెడికల్: ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. పల్లెలు.. పట్టణాలు తేడా లేకుండా ప్రజలు మంచం పడుతున్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 200 పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదవడం చూస్తే తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతోంది. ఇవన్నీ ప్రభుత్వాసుపత్రుల్లో నిర్ధారించిన కేసులు మాత్రమే. ఇక కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఇతర ప్రయివేట్ ఆసుపత్రుల్లోచేరి చికిత్స పొందుతున్న రోగులు వందల్లోనే. రికార్డుల్లోకి చేరని రోగులు, మరణాలు పదుల సంఖ్యలో ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, 19 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, అనంతపురం సర్వజనాస్పత్రి ఉన్నాయి. అనంతపురం సర్వజనాస్పత్రి, హిందూపురం ఆస్పత్రుల్లో మాత్రమే ‘ఎలీసా’ విధానంలో డెంగీ నిర్ధారణ చేసే అవకాశం ఉంది. అధికారిక లెక్క ఇక్కడ పరీక్షలు చేసినవి మాత్రమే. ఇక కర్నూలు ప్రభుత్వాస్పత్రి, తిరుపతి స్విమ్స్‌లో జిల్లాకు సంబంధించి పాజిటివ్ కేసులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో చిన్నారులే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా పారిశుద్ధ్యం పడకేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు స్పష్టమవుతోంది. పంచాయతీలు, మునిసిపాలిటీల్లో పైపులు పగిలిపోయి మంచి నీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంకులను క్లోరినేషన్ చేయకపోవడం.. ఫ్లోరోస్కోపిక్తో నీటి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం.. పాట్ క్లోరినేషన్‌పై కనీస అవగాహన కల్పించని పరిస్థితి ప్రస్తుత వ్యాధుల తీవ్రతకు కారణమవుతోంది. దండయాత్ర పేరుతో ఆర్భాటం ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు ముద్రించి సబ్ సెంటర్ల స్థాయి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. క్షేత్రస్థాయి నుంచి రెండు ఫొటోలు మెయిల్ చేస్తే వాటిని ఉన్నతాధికారులకు పంపి ఏదో చేసేశాం అని గొప్పలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా దోమల బెడద తీవ్రంగా ఉంది. అదేదో ‘శనివారం మాత్రమే దోమలు బయటకు వస్తాయన్నట్లు ఆ రోజు మాత్రమే ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అంటూ ఓ కాలనీకి వెళ్లి జెండా ఊపి వచ్చేస్తుండటం గమనార్హం. హై రిస్క్ ప్రాంతాలపైనా దృష్టి లేదాయె జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన డెంగీ, మలేరియా కేసులను పరిశీలిస్తే ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆత్మకూరు, ధర్మవరం అర్బన్, బ్రహ్మసముద్రం, రాయదుర్గం అర్బన్, కనగానపల్లి, కుందుర్పి, కూడేరు, గార్లదిన్నె, గుంతకల్లు, నాగసముద్రం, కదిరి ప్రాంతాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఒక్క అనంతపురం నగరంలోనే వందల సంఖ్యలో జ్వర పీడితులున్నారు. మురికివాడల్లో అయితే పరిస్థితి మరీ ఘోరం. 50 డివిజన్ల పరిధిలో 350 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కరువయింది. -
ఇంత నిర్లక్ష్యమా..?
– జిల్లాను చుట్టుముట్టిన రోగాలు – ప్రజలను అప్రమత్తం చేసేందుకు ‘ఎపిడమిక్ సెల్’ ఏర్పాటు – కనీస అవగాహన కల్పించని వైద్య ఆరోగ్యశాఖ – పక్షం రోజులైనా 10 కాల్స్ కూడా రాని వైనం అనంతపురం మెడికల్ : ఓ వైపు జిల్లాను రోగాలు పట్టిపీడిస్తున్నాయి.. డెంగీ..మలేరియా..టైఫాయిడ్..డయేరియా.. వైరల్ ఫీవర్స్‌తో జనం విలవిలాడిపోతున్నారు. మరోవైపు గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించడానికి, వ్యాధుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ‘ఎపిడమిక్ సెల్’ నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. ఎపిడమిక్ సెల్ అంటూ ఒకటుందని కనీసం ప్రచారం చేసిన దాఖలాలు లేవు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సాక్షాత్తూ కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేసినా కేవలం ఆర్భాటంగా ప్రారంభించి తూతూ మంత్రంగా కలెక్టర్‌కు నివేదికలు పంపుతున్నారు. ఈ నెల 3వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ‘ఎపిడమిక్ సెల్’ను అధికారులు ప్రారంభించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు తమకు తలెత్తుతున్న ఇబ్బందులను, గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితిని 08554–220933 నంబర్‌కు కాల్చేసి చెప్పొచ్చు. ఈ సెల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న నలుగురు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల (ఎంపీహెచ్ఏ)ను డెప్యుటేషన్‌పై నియమించారు. ఒకరు రిలీవర్‌గా ఉంటుండగా ముగ్గురు 24 గంటల పాటు విధులు నిర్వర్తించాలి. ప్రజలు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలిపితే ఇక్కడి సిబ్బంది సంబంధిత పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తారు. రోగాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. ప్రతి రోజూ సాయంత్రం సాయంత్రం 5 గంటలకు జిల్లా మలేరియా అధికారి, డీఎంహెచ్ఓలకు కాల్స్ వివరాలు తెలిపితే.. 6 గంటలకు కాల్ డేటాకు సంబంధించి నోట్‌ను కలెక్టర్ వీరపాండియన్‌కు పెట్టాలి. ఎవరు కాల్ చేశారు, సమస్య ఏంటి, తీసుకున్న చర్యలు, పీహెచ్సీ, మెడికల్ ఆఫీసర్, కాల్ చేసిన వ్యక్తి పేరు తదితర వివరాలన్నీ ఇందులో ఉండాల్సిందే. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ‘ఎపిడమిక్ సెల్’ను అధికారులు పట్టించుకోవడం మానేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించలేదు. ఈనెల 3వ తేదీ సెల్ ప్రారంభమైతే ఇప్పటి వరకు కనీసం పది కాల్స్ కూడా రాని పరిస్థితి. రొళ్ల మండలం రత్నగిరి పంచాయతీలోని అల్పనపల్లిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని చిరంజీవి అనే వ్యక్తి ఏకంగా కలెక్టర్, డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్తే ఆ తర్వాత ఎపిడమిక్ సెల్ నుంచి తగిన చర్యలు తీసుకున్నారు. గుంతకల్లు మండలం నాగసముద్రంలో ఊరిమధ్య మరుగుదొడ్లు ఉన్నాయని, దోమల వ్యాప్తితో పాటు డెంగీ ప్రబలుతున్నట్లు గ్రీవెన్స్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఎపిడమిక్ సెల్‌కు చేశారు. ఇక అనంతపురంలోని బుడ్డప్పనగర్‌కు చెందిన అనంతమ్మ, బుక్కరాయసముద్రం విరూపాక్షేశ్వరనగర్కు చెందిన మహబూబ్‌బాషాలు డ్రైనేజీ, విష జ్వరాలపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయా సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రస్తుతం జిల్లా నలుమూలలా సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఎపిడమిక్ సెల్‌పై విస్త్రృత ప్రచారం చేస్తే కాస్త ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. -
వ్యాధుల కాలం
– ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు – పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత ప్రధానం – తాగునీటి కలుషితంపై అప్రమత్తం – వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి వర్షాలు ప్రారంభమయ్యాయి.. వాతావరణంలో మార్పులూ చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి జల్లులకే పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేస్తోంది. ఇక గ్రామాల్లో పరిస్థితి మరీ ఘోరం. ఈ క్రమంలో దోమలు వ్యాప్తి చెంది రోగాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అనంతపై డెంగీ పంజా విసురుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ కథనం. - అనంతపురం మెడికల్ పరిశుభ్రతే ‘డెంగీ’కి మందు! ఇంటిలోను, పరిసరాల్లోనూ పరిశుభ్రత చర్యలు చేపడితే ‘డెంగీ’కి దూరంగా ఉండొచ్చు. ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం, తలనొప్పి, కంటి లోపల నొప్పి వచ్చి కంటి కదలికలు తగ్గడం డెంగీ లక్షణాలు. కండరాలు, కీళ్లనొప్పులు అధికమవుతాయి. వాంతి అయినట్లు అనిపిస్తుంది. నోరు ఎండిపోయి దాహం ఎక్కువ వేస్తుంది. ఈ లక్షణాలు ఉన్న వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చూపించుకుంటే మంచిది. దోమతెరలు తప్పకుండా వాడాలి. శరీరంలోని అన్ని భాగాలను కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలి. చిన్న పిల్లలయితే వారి శరీర భాగాలు పూర్తిగా కప్పివేసేలా చూసుకోవాలి. నీటి నిల్వ మంచిది కాదు డెంగీ వ్యాధి కారక క్రిమి ఆర్బోవైరస్ జాతికి చెందినది. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. ఏయిడిస్ ఈజిప్ట్ జాతి దోమ నుంచి, రోగగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. ఈ టైగర్ దోమ సాధారణంగా పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన తర్వాత ఐదు రోజుల నుంచి 8 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లలోని డ్రిప్ ఫ్యాన్, పూలకుండీల కింద ఉన్న సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని..నీరు నిల్వ చేసే తొట్టెలు, కుండీలు, ఖాళీ డ్రమ్ములు, సన్‌షేడ్స్, బిల్డింగ్స్‌పై నీరు నిలిచిన చోట టైగర్ దోమలు గుడ్లు పెట్టి పెరుగుతాయి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నా.. ఆ నీరు వారం పాటు నిల్వ ఉంటే ఈ రకమైన దోమలు వృద్ధి చెందుతాయి. చిన్నారులకు ‘న్యుమోనియా’ శాపం వాతావరణంలోని మార్పులతో న్యుమోనియా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే పిల్లలను సాధ్యమైనంత వరకు చల్లని వాతావరణానికి దూరంగా ఉంచాలి. కిటీకీలు, వెంటిలేషన్ ఉన్న చోట పడుకోనివొద్దు. వెచ్చని దుస్తులు ధరించాలి. డబ్బా పాలు తాగేవారిలో, రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, కుటుంబ పరంగా ఆస్తమా, అలర్జీ ఉంటే న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కలుషిత నీటితో ‘అతిసార’ కలుషిత నీరు తాగడం, ఆహార పదార్థాలు తినడం వల్ల అతిసార సోకుతుంది. నిలువ ఉన్న ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. మంచి నీరు సరఫరా చేసే పైపులు పగిలిపోయి అందులో కలుషిత నీరు కలవడం వల్ల ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగడం వల్ల అతిసార ప్రబలే అవకాశం ఉంది. వాంతుల, విరేచనాలు, కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం అతిసార లక్షణాలు. ఈ వ్యాధి రాకముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ప్రధానంగా క్లోరిన్ కలిపిన నీరు సరఫరా అవుతోందా? లేదా? పరిశీలించాలి. గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో సరిగ్గా బ్లీచింగ్ అవుతోందా పరిశీలించాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పగిలిన పైపులను మరమ్మతు చేయించుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లను నిలువ ఉంచుకోవాలి. ఇంట్లో నీటిని కాచి..చల్లార్చి.. తాగే అలవాటు చేసుకోవాలి ప్రాథమిక దశలో గుర్తిస్తే ‘మలేరియా’కు చెక్ సీజనల్‌గా వచ్చే మలేరియాను ప్రాథమిక దశలోనే గుర్తించి సమీపంలోని ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో పరీక్ష చేయించుకోవాలి. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రోజు విడిచి రోజు జ్వరం రావడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, వణుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టడం, రక్తహీనత వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు వెంటనే వ్యాధి నిర్ధారణ కోసం రక్తపరీక్షలు చేయించుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా దోమకాటుకు గురికాకుండా దోమతెరలు వాడాలి. ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలి. నీటి తొట్టెలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి. కాంపౌండ్‌లో తాగేసిన కొబ్బరి బోండాలు, వాడిన టైర్లు, వాడకంలో లేని రోళ్లు ఉంచకూడదు. ఇంటిపై వాటర్ ట్యాంకులకు మూతలు బిగించాలి. సెప్టిక్ ట్యాక్ గాలిగొట్టాలకు ఇనుప జాలీ బిగించాలి ఇంటికీ ‘చికిత్స’ అవసరం : రోగాలు ప్రబలడానికి ఇంటిలోపల, పరిసరాలు కూడా ఓ కారణమే. అందుకే వాటిని శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఇంట్లోని పాత్రలన్నీ వాడుకున్న తర్వాత ఎప్పుడూ పొడిగా ఉంచాలి. నీరు నిల్వ ఉండే పాత్రల్ని వాటితో పని అయిన తర్వాత బోర్లించాలి. కూలర్లో నీరు మార్చడం వీలు కానప్పుడు కొన్ని చుక్కల కిరోసిన్ వేయాలి. పెరటి, అటక మీద ఉన్న అనవసరమైన పాత్రలన్నీ తీసివేయాలి. ఇళ్లలోని చెత్తను మురుగు కాల్వల్లో వేయకూడదు. చిన్న పిల్లల పట్ల నిర్లక్ష్యం వద్దు చిన్నపిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించటం తప్పనిసరి. 100.4 డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం ఉన్నపుడు కాళ్లు, చేతులు నీలం రంగులోకి మారటం, పక్కలు ఎత్తేయటం చేస్తే తప్పనిసరిగా న్యుమోనియా ఉన్నట్లు గుర్తించాలి. చికిత్సలో ఆలస్యం జరిగితే మూర్ఛ వచ్చే అవకాశం ఉంది. జలుబు, దగ్గు ఉంటే తల్లిదండ్రులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయద్దు. వంట చేసే ముందు.. భోజనం వడ్డించే సమయంలో..భోజనం చేసే ముందు..మల విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. – డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, చిన్న పిల్లల వైద్యుడు, సర్వజనాస్పత్రి, అనంతపురం అప్రమత్తంగా ఉన్నాం వ్యాధుల నియంత్రణకు అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పటికే వైద్యులందరికీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందే. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మందుల కొరత లేదు. అలాంటి పరిస్థితి ఉంటే తక్షణం మా దృష్టికి తీసుకురండి. - డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ -
కరెన్సీ నోట్లతో వ్యాధుల వ్యాప్తి
న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూనే ఉంటాయి. వీటిని అనేక సంవత్సరాలు వాడుతూనే ఉంటాం. ఫలితంగా ఆ నోట్లపై బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో కరెన్సీ నోట్లు చర్మ వ్యాధులు, ఉదర సంబంధిత, టీబీ తదితర వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. మన దేశంలోని కరెన్సీ నోట్ల మీద సగటున 70 శాతం ఫంగస్, 9 శాతం బ్యాక్టీరియా, 1 శాతం వైరస్ పేరుకుపోతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) సంస్థలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని వీధి వ్యాపారులు, కిరాణాకొట్లు, క్యాంటీన్లు, హోటళ్లు, హార్డ్‌వేర్, తదితర దుకాణదారుల నుంచి సేకరించిన నోట్లను నిపుణులు పరిశీలించారు. ఈ నోట్లపై స్టాపైలోకోకస్ ఆరియస్, ఎంటెరోకోకస్ సహా మొత్తం 78 రకాల బ్యాక్టీరియాను వారు గుర్తించారు. ఈ నోట్లపై ఇలాంటి హానికారక బ్యాక్టీరియానే కాకుండా, యాంటీబయాటిక్ పదార్థాల నిరోధక జీవులు సైతం ఉన్నాయన్నారు. ఇవన్నీ చర్మ వ్యాధులు, జీర్ణకోశ, క్షయతోపాటు ఇతర అంటువ్యాధుల్ని కలిగిస్తాయని తెలిపారు. ముఖ్యంగా రూ. 10, రూ.20, రూ. 100 నోట్లపైనే ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని ఐజీఐబీ పరిశోధకుడు ఎస్. రామచంద్రన్ వెల్లడించారు. వ్యాధుల వ్యాప్తికి కారణమవడంతోపాటు అనేక కారణాల రీత్యా ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు పేపర్ కరెన్సీని నిషేధించి ప్లాస్టిక్ కరెన్సీని వాడుతున్నాయని చెప్పారు. మన దేశంలో కూడా ప్లాస్టిక్ నోట్ల వాడకంతో ఈ సమస్య నుంచి కొంతవరకు బయటపడొచ్చన్నారు. ప్రస్తుతం కరెన్సీకి బదులుగా ప్లాస్టిక్‌తో తయారైన డెబిట్, క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వాటి వినియోగం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ కరెన్సీ నోట్లను వినియోగిస్తే అనంతరం శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సూచించారు.