కరెన్సీ నోట్లతో వ్యాధుల వ్యాప్తి
న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూనే ఉంటాయి. వీటిని అనేక సంవత్సరాలు వాడుతూనే ఉంటాం. ఫలితంగా ఆ నోట్లపై బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో కరెన్సీ నోట్లు చర్మ వ్యాధులు, ఉదర సంబంధిత, టీబీ తదితర వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. మన దేశంలోని కరెన్సీ నోట్ల మీద సగటున 70 శాతం ఫంగస్, 9 శాతం బ్యాక్టీరియా, 1 శాతం వైరస్ పేరుకుపోతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) సంస్థలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని వీధి వ్యాపారులు, కిరాణాకొట్లు, క్యాంటీన్లు, హోటళ్లు, హార్డ్‌వేర్, తదితర దుకాణదారుల నుంచి సేకరించిన నోట్లను నిపుణులు పరిశీలించారు.
ఈ నోట్లపై స్టాపైలోకోకస్ ఆరియస్, ఎంటెరోకోకస్ సహా మొత్తం 78 రకాల బ్యాక్టీరియాను వారు గుర్తించారు. ఈ నోట్లపై ఇలాంటి హానికారక బ్యాక్టీరియానే కాకుండా, యాంటీబయాటిక్ పదార్థాల నిరోధక జీవులు సైతం ఉన్నాయన్నారు. ఇవన్నీ చర్మ వ్యాధులు, జీర్ణకోశ, క్షయతోపాటు ఇతర అంటువ్యాధుల్ని కలిగిస్తాయని తెలిపారు. ముఖ్యంగా రూ. 10, రూ.20, రూ. 100 నోట్లపైనే ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని ఐజీఐబీ పరిశోధకుడు ఎస్. రామచంద్రన్ వెల్లడించారు. వ్యాధుల వ్యాప్తికి కారణమవడంతోపాటు అనేక కారణాల రీత్యా ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు పేపర్ కరెన్సీని నిషేధించి ప్లాస్టిక్ కరెన్సీని వాడుతున్నాయని చెప్పారు. మన దేశంలో కూడా ప్లాస్టిక్ నోట్ల వాడకంతో ఈ సమస్య నుంచి కొంతవరకు బయటపడొచ్చన్నారు. ప్రస్తుతం కరెన్సీకి బదులుగా ప్లాస్టిక్‌తో తయారైన డెబిట్, క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వాటి వినియోగం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ కరెన్సీ నోట్లను వినియోగిస్తే అనంతరం శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సూచించారు.