భారత, బ్రిటిష్ సైనికులు కలిసి దిగిన ఫొటో
కామెంట్
భాష తెలియని దేశంలో సైనికుడైనా సామాన్యుడే. కొత్త నేలపై కుదురుకోవటం యుద్ధం చేసినంత పని! భాష మాత్రమే కాదు, అక్కడి ఆహారాలకు అలవాటు పడాలి. సంస్కృతులకు సర్దుకుపోవాలి. సంప్రదాయాల కత్తుల వంతెనపై ఒద్దికగా నడవాలి. నడవడికను బుద్ధిగా ఉంచుకోవాలి.
ముఖ్యంగా, కరెన్సీని అర్థం చేసుకోవాలి, బేరాలాడాలి. అత్యవసరంలో ప్రాథమిక చికిత్సా, అకాల పరిస్థితుల ముందుచూపూ ఉండాలి. ఇవన్నీ సైనికులకు ప్రభుత్వాలు చెప్పి పంపవు. ‘వెళ్లాక తెలుస్తుందిలే’ అని బదలీ పత్రాలు ఇచ్చేస్తాయి. అయితే, వెళ్లాక తెలుసుకోవటం కాదు, ‘తెలుసుకునే వెళ్లండి’ అంటూ నూటపాతికేళ్ల క్రితమే ఒక ప్రసిద్ధ బ్రిటిష్ సిగరెట్ కంపెనీ భారత్ వెళ్లే బ్రిటన్ సైనికుల కోసం హ్యాండ్‌బుక్‌ను ప్రచురించటం విశేషమే!
‘వైల్డ్ ఉడ్‌బైన్’ బ్రాండు సిగరెట్లను ఉత్పత్తి చేస్తుండే 18వ శతాబ్దపు ప్రఖ్యాత బ్రిటన్ పొగాకు కంపెనీ ‘డబ్లు్య.డి. అండ్ హెచ్.వో. విల్స్’ తాత్కాలిక విధి నిర్వహణలపై భారతదేశానికి తరలివెళ్లే బ్రిటిష్ సైనికుల కోసం మార్గదర్శకాలతో కూడిన ఒక కరదీపికను ప్రచురించినట్లుంది! మన దేశంలో ఆ సైనికుల అపరిచిత స్థానిక వ్యవహారాలను సులభతరం చేయటానికి ఉద్దేశించిన ఆ పుస్తక ప్రతి ఒకటి గతవారం లండన్ , పోర్టోబెల్లో రోడ్డులోని పురాతన వస్తువుల దుకాణంలో నా కంట పడింది. చదువుతుంటే ఎంత సరదాగా అనిపించిందో!
భారతదేశం ఎంత పెద్దదో చెప్పడంతో ఆ కర పుస్తకం మొదలౌతుంది. ‘‘ఇండియాలో ఇరవై గ్రేట్ బ్రిటన్‌లను పట్టించ వచ్చు’’ అని చెబుతూ, ఆనాటి మన కరెన్సీని, బ్రిటన్ కరెన్సీతో పోల్చి వాటి సమాన విలువలను తెలియబరిచింది. ఆ ప్రకారం:
1 అణా 1 పెన్నీకి సమానం. 11 అణాలు 1 షిల్లింగ్‌కి సమానం (రూపాయికి 16 అణాలు అనే లెక్క ఆధారంగా). 1 రూపాయి 1 షిల్లింగు 5 పెన్నీలకు సమానం. 13 రూపాయల 6 అణాలు ఒక పౌండుకు సమానం.
పుస్తకంలోని ఎక్కువ భాగంలో, సైనికుడు తెలుసుకోవలసిన అవసరం ఉన్న ముఖ్యమైన పదాలను, వాటి అర్థాలను, వాటిని ఉచ్చరించే విధానాన్ని పొందుపరచటం జరిగింది. ఉదాహరణకు, ఎలుక Chew-ha (చూహా), రోడ్ Rust-er (రస్తా), సముద్రం Some-under (సమందర్), చొక్కా Come-ease (కమీజ్), చక్కెర Chee-knee (చీనీ), నీళ్లు Par-knee (పానీ), మహిళ Awe-rut (ఔరత్) అని ఇచ్చారు. (ఈ హిందీ మాటలను పలికే విధానమంతా ఆంగ్ల పదాలకు దగ్గరగా ఉండేలా ఇచ్చారు.)
సైనికుడు స్థానికులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు రోజువారీ వాడుక కోసం కొన్ని చిన్న చిన్న వాక్యాలు కూడా ఆ కర పుస్తకంలో ఉన్నాయి. మీరెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాలనుకున్న సైనికుడు "Kid-her jar-ta high?" (కిదర్ జాతా హై?) అంటాడు; అతనికేదైనా అర్థం కాకపోతే, "Tomb key-ah bowl-ta high?" (తుమ్ క్యా బోల్తా హై) అంటాడు. అతను పోస్టాఫీస్ కోసం వెదుకుతుంటే "Dark-car-ner kid-her high?" (డాక్ ఘర్ కిదర్ హై) అని అడుగుతాడు. దుకాణందారు ఎక్కువ రేటు చెప్పినట్లనిస్తే "Darm jars-tea high" (దర్ జాస్తి హై) అంటాడు.
బ్రిటిష్ సైనికుల కోసం ముద్రించిన హ్యాండ్‌బుక్ కవరు పేజీ
ఇప్పుడు బ్రిటన్ సైనికులు అనారోగ్యం పాలైనప్పుడు ఏం చేయాలని పుస్తకం చెప్పిందో చూద్దాం. జ్వరాలను తగ్గించుకోటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే కచ్చితమైన సూచనలు కొన్ని పుస్తకంలో ఉన్నాయి. ‘‘అనేక కారణాల ఫలితంగా జ్వరం అనేది వస్తుంది. లవణాలు, ఆముదపు నూనె మోతాదులను ఎప్ప టికప్పుడు తీసుకోవటం ద్వారా జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. అవి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. వీలైనంత వరకు మాట్లాడకుండా, మౌనంగా ఉండండి. ముఖంపైన, తల పైన చల్లటి తడి గుడ్డను వేసుకుని పడుకోండి. ఒకవేళ మలేరియా సోకి, రోగికి చలిపుడుతూ, వణుకు వస్తున్నట్లయితే వేడి టీ చుక్కల్ని తాగిస్తే చమటలు పడతాయి. వణుకు తగ్గేవరకు రోగికి దుప్పటి కప్పి ఉంచాలి’’ అని ఆ కరదీపిక సూచించింది.
పాము కాట్లకు బ్రిటిష్ వారు భయభ్రాంతులయ్యేవారని అని పిస్తోంది. అందుక్కూడా పుస్తకంలో ప్రాథమిక చికిత్సలు ఉన్నాయి. విషపూరితమైన సర్పం కాటేస్తే ‘‘తక్షణం, తీక్షణమైన చికిత్స’’ అవసరం అవుతుంది. అంటే, రక్త ప్రసరణను ఆపటానికి కాటుకు పైభాగాన వస్త్రపు నాడాతో గట్టిగా బిగించి కట్టాలన్న మాట. ఆ తర్వాత, పెదవులపై లేదా నోటిలో పుండ్లు, కోతలు, లేదా పొక్కులు లేని వ్యక్తి ఆ గాయాన్ని పీల్చి, విషాన్ని ఉమ్మేయాలి. ఆ తర్వాత, గాయంపై బలమైన పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణాన్ని, (లేదా, ముడి స్ఫటికాలను) అద్దాలి. ఒకవేళ ఆ ప్రదేశంలో సిర, లేదా ధమని ఉన్నందువల్ల కోత పెట్టటానికి వీలు లేకుంటే కాటు వేసిన చోట నిప్పు కణికను, మండుతున్న సిగరెట్‌ను, కాల్చిన తాడు కొసను తాకించాలి.
ఇక్కడ నాకు ఆసక్తిగా అనిపించిన సంగతి: ‘‘ఇవన్నీ చేసేలోగా చేతిలో ఏదైనా బలమైన ఉద్దీపన ఉంటే (బ్రాందీ, విస్కీ మొదలు అమ్మోనియం కార్బోనేట్ కలిసిన శాల్ ఓలటైల్ వరకు ఏదైనా) కొంచెం తాగించాలి. అలా పదిహేను నిముషాలకొకసారి చేయాలి’’ అని ఉండటం! బహుశా, మద్యంతో నరాలను శాంతపరచటమే దీని ఉద్దేశం కావచ్చు.
ఈ హ్యాండ్‌బుక్‌లో... ‘తగని పనులు – చిట్కాలు’ అనే ఒక కీలకమైన విభాగం కూడా ఉంది. ‘‘మండే సూర్యరశ్మిలో తలపై టోపీ లేకుండా బయటికి వెళ్లొద్దు – అది వేసవైనా, చలికాలమైనా’’. ‘‘సూర్యాస్తమయానికి ముందు వైన్, బీరు, ఆల్కహాల్ సేవించ వద్దు – (సేవించే అవకాశం వచ్చినప్పటికీ!).
‘‘కొన్ని ఆకులను,ముఖ్యంగా వేపాకులను మీరు అడవిలో ఉన్నప్పుడు మీ టోపీ కింద ఉంచుకోవటం మీ తలను చల్లగా ఉంచుతుంది’’. ‘‘ఫ్లానల్ షర్టును వేసుకోవటం మరచిపోవద్దు. శీతాకాలమైనా, వేసవి కాలమైనా అది మీకు సురక్షితమైన కవచం’’. ఫ్లానల్ వేడిమిని గ్రహించదు. (ఫ్లాన ల్‌లో చుట్టిన ఐసు ముక్కలు త్వరగా కరగకపోవటమే ఇందుకు రుజువు)’’ అని పుస్తకంలో రాసి ఉంది.
బ్రిటిష్ సైనికుడు ఇండియాలో ఆడగలిగే అనేక ఆటల వివరాలు కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. ‘‘హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్, పోలో, గోల్ఫ్, స్విమ్మింగ్, రన్నింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, రోయింగ్, షూటింగ్, పిగ్–స్టిక్కింగ్, గేమ్ హంటింగ్ వంటివి... భారతదేశం అందించే ఆసక్తికరమైన ఆటలు, క్రీడల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇవన్నీ ఇండియాకు కొట్టిన పిండి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే ముగింపులో ఆ పుస్తకం ఇచ్చిన సలహా నా పొట్టను చెక్కలు చేసింది. ‘‘చివరిగా ఒక మాట. ఎట్టి పరిస్థితిలోనూ ఇండి యాలో మీరు మీ ప్రశాంతతను, ఉత్సాహాన్ని, నిద్రను కోల్పోకండి. బ్రిటన్‌పై బెంగ పెట్టుకోకండి. సమయం త్వరగానే గడిచిపోతుంది. అంతేకాదు, సౌతాంప్టన్ హార్బరులో మీకు వీడ్కోలు పలుకుతూ ఊగిన చేతి రుమాలు గతించిపోయిన కాలంలా అనిపిస్తుంది. అన్ని టినీ మించి ఇండియా మంచి దేశం.’’
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment