బెంగళూరు: బ్రిటన్ రాజు చార్లెస్–3 సతీసమేతంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో రహస్యంగా పర్యటించారు. రాజదంపతులు సమోవా దేశంలో కామన్వెల్త్ సమావేశంలో పాల్గొన్న తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు వెళ్తూ మధ్యలో బెంగళూరులో ఆగినట్లు బకింగ్‌హమ్ ప్యాలెస్ వర్గాలు ధ్రువీకరించాయి. వారిద్దరూ నగరంలోని ప్రముఖ వెల్‌నెస్ కేంద్రంలో చికిత్స పొందినట్లు తెలిసింది.
వైట్‌ఫీల్డ్ సమీపంలోని సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్‌లో రాజు చార్లెస్–3, రాణి కెమిల్లా మూడు రోజులపాటు బస చేశారు. యోగా, ధ్యానంతోపాటు ఇతర థెరపీలకు ఈ హెల్త్ సెంటర్ పేరుగాంచింది. శరీరం, మనసు అలసిపోయినప్పుడు పునరుత్తేజం పొందడానికి ఇక్కడ నిపుణులు ప్రకృతిసిద్ధమైన చికిత్స అందిస్తుంటారు. డాక్టర్ ఐజాక్ మథాయ్ నిర్వహిస్తున్న ఈ హెల్త్ సెంటర్‌కు చార్లెస్–3 రావడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఆయన ఇక్కడే 71వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
‘మనసుకు స్వాంతన లభించే యోగా క్రియల్లో బ్రిటన్ రాజ దంపతులు పాల్గొన్నారు. కోడిగుడ్లతోపాటు కేవలం శాకాహారం తీసుకున్నారు. ధ్యానం చేశారు. చార్లెస్–3 ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతితో కూడిన వెల్‌నెట్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు’’ అని సౌఖ్య హెల్త్ సెంటర్ ప్రతినిధులు చెప్పారు. రాజదంపతులకు ప్రత్యేక మర్యాదలేవీ చేయలేదని, ఇతర అతిథుల తరహాలోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు.
హెల్త్ సెంటర్‌లో మూడు రోజులపాటు ఉన్న చార్లెస్–3 దంపతులు ఇక్కడ సాగవుతున్న ఆర్గానిక్ పంటలను పరిశీలించారు. ఔషధాల గార్డెన్‌ను సందర్శించారు. గోవుల మధ్య కలియతిరిగారు. ప్రకృతికి దగ్గరగా జీవించారు. పర్యావరణ హిత పద్ధతులు పాటించారు. రాజదంపతులు బుధవారం ఉదయమే హెల్త్‌సెంటర్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment