csir research
-
బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారికే కరోనా ముప్పు ఎక్కువ
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అంచనాలను బట్టి ఓ, బీ బడ్ గ్రూపుల వారికన్నా ఏ, ఏబీ బడ్ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని, ఏ, ఏబీ బ్లడ్ గ్రూపులు వారికే కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని విన్నాం. కానీ తాజాగా సీఎస్ఐఆర్ నిర్వహించిన అధ్యయనంలో మరో కీలక విషయం వెలుగు చూసింది. 'ఓ' గ్రూపు వారితో పోలిస్తే బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారికే వైరస్ ఎక్కువ సోకుతోందని తేలింది. ఈ గ్రూపుల వారిపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సీఎస్ఐఆర్ అధ్యయనం సీఎస్ఐఆర్ పరిశోధనా పత్రం ప్రకారం బీ, ఏబీ బ్లడ్ గ్రూపు ఉన్న ప్రజలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారే కరోనాకు ఎక్కువగా గురవుతున్నారని తెలిపింది. అలాగే ఓ గ్రూపు వారు తక్కువ సెరో-పాజిటివిటీ లేదా ప్రమాదంలో ఉన్నారని ఆగ్రాలోని పాథాలజిస్ట్ డాక్టర్ అశోక్ శర్మ వెల్లడించారు. అలాగే దేశవ్యాప్త సెరో సర్వే ప్రకారం శాఖాహారుల కంటే మాంసాహారం తినేవారికే కరోనా సంక్రమించే అవకాశం ఎక్కువ ఉందని తేల్చారు. శాఖాహారుల్లో బలమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. వారు తినే శాఖాహార ఆహారంలో అధిక ఫైబర్ కంటెంట్ ఉందని అధ్యయనం పేర్కొంది. హై-ఫైబర్ ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీ అని విశ్వసిస్తాం కనుక ఇది ఇన్ఫెక్షన్ అనంతర సమస్యలను నివారించడంతోపాటు, వైరస్‌నూ నిరోధిస్తోందని ఈ స్టడీ తెలిపింది. దేశవ్యాప్తంగా 10వేల మందితో నిర్వహించిన ఈ అధ్యయనంలో 140 మంది వైద్యులు కూడా ఉన్నారు. అయితే చాలామంది నిపుణులు ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. విభేదిస్తున్న కొంతమంది నిపుణులు ఓ బ్లడ్ గ్రూపు ఉన్నవారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందనీ, అంతమాత్రాన వారు కోవిడ్-19 ప్రోటో కాల్‌కు విరుద్ధంగా పవర్తించాలని కాదని పేర్కొన్నారు. ఎందుకంటే వారికి కూడా కరోనావైరస్ సోకుతుందనే విషయాన్ని గుర్తించాలని సీనియర్ వైద్యుడు డాక్టర్ ఎస్.కె. కల్రా తెలిపారు. ఇది కేవలం "నమూనా సర్వే" అని, ఇది పీర్-రివ్యూడ్ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ కాదని అన్నారు. ఎందుకు వ్యత్యాసం ఉందో పూర్తిగా విశ్లేఫించకుండా, అర్థంచేసుకోకుండా, కొన్నిబ్లడ్ గ్రూపులకు మాత్రమే రోగనిరోధక శక్తి ఉందని తేల్చడం చాలా తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఓ బ్లడ్ గ్రూప్ (పాజిటివ్ లేదా నెగటివ్)’ కలిగిన ప్రజలపై కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని, బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకులు ఏడాది అక్టోబరులో వేర్వేరుగా జరిపిన రెండు అధ్యయనాల్లో తేల్చారు. వైరస్ కారణంగాశరీర అవయవాలు చెడిపోవడం, మత్యువాత పడడం వీరిలో చాలా తక్కువని వెల్లడించారు. కాగా గత 24 గంటల్లో 3.29 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3,876 మరణించారు. 3.56 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 82.39 శాతంగా ఉంది. అయితే మరణాల రేటు ప్రస్తుతం 1.09 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు ఇప్పటికీ 20 శాతానికి పైనే ఉండటం గమనార్హం. చదవండి: కరోనా: ప్రముఖ రచయత, నటుడు కన్నుమూత -
కరోనాకు కొత్త చికిత్స
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సకు సరికొత్త, వినూత్న చికిత్స అందించేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ప్రయత్నాలు ప్రారంభించింది. హెచ్ఐవీ చికిత్సలో ఉపయోగించే యాంటీ రెట్రోవైరల్ మందులను మరికొన్నింటిని కలిపి వాడటం ద్వారా ప్రస్తుతం కరోనాకు అందిస్తున్న చికిత్సను బలోపేతం చేయాలనేది సీఎస్ఐఆర్ ఆలోచన. ఇందుకోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి మూడో దశ ప్రయోగాలు చేసేందుకు అనుమతివ్వాలని సీఎస్ఐఆర్ ప్రభుత్వ సంస్థలకు బుధవారం దరఖాస్తు చేసింది. ‘ముకోవిన్’ అని పిలుస్తున్న ఈ ప్రయోగాలు ఢిల్లీలోని మెడాంటా మెడిసిటీ ఆసుపత్రి భాగస్వామ్యంతో జరగనున్నాయి. 300 మంది రోగులను నాలుగు సమాన గుంపులుగా విడదీసి ఈ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను 17 నుంచి 21 రోజుల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. ముమ్మరంగా అధ్యయనం ఈ కొత్త ప్రయోగాల్లో ఉపయోగించే మందుల వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశముందని, సీఎస్ఐఆర్ సంస్థలతో పాటు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, జమ్మూలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రయోగాల్లో పాల్గొంటున్నాయని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మాండే ఒక ప్రకటనలో తెలిపారు. శరీరంలో కరోనా వైరస్ పెరగడానికి కారణమయ్యే ప్రొటీన్లు, సైటోకైన్ ఉప్పెనకు దారితీసే అంశాలపై ఈ అధ్యయనం దృష్టి పెడుతుందని లక్సాయ్ లైఫ్‌సైన్సెస్ సీఈవో రామ్ ఎస్.ఉపాధ్యాయ తెలిపారు. ఫావిపిరవిర్‌ను కోల్చికైన్తో కలిపి, అలాగే ఉమిఫెనొవిర్ కోల్చికైన్ మిశ్రమం, నఫామోస్టాట్కు 5–అమినోలెవులినిక్ యాసిడ్‌ను కలిపి అందించడం ఈ అధ్యయనంలో కీలకాంశం. ఫావిపిరవిర్‌ను జపాన్‌లో ఫ్లూ చికిత్స కోసం అభివృద్ధి చేయగా, దాన్ని కరోనాకు ఉపయోగించవచ్చునని ఐఐసీటీ గతంలోనే సూచించింది. మిగిలిన మందులు వైరస్ శరీరంలోకి ప్రవేశించేందుకు ఉన్న మార్గాలు, నకళ్లు సృష్టించుకోవడాన్ని నిరోధించడం వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతాయి. ఈ మందుల మిశ్రమాలు సురక్షితమైనవని, సమర్థంగా పనిచేస్తాయని నిర్ధారించడం ఈ అధ్యయనం ఉద్దేశం. అన్నీ సవ్యంగా సాగితే కరోనా చికిత్సకు మరింత సామర్థ్యం చేకూరుతుందని అంచనా. -
మేఘాలయలో తేలని కార్మికుల జాడ
షిల్లాంగ్: మేఘాలయలోని తూర్పు జైంతియా జిల్లాలో ఓ అక్రమ బొగ్గు గనిలో చిక్కుకున్న 15 మంది కార్మి కుల జాడ ఇంకా తెలియరావడం లేదు. అధికారులు శక్తిమంతమైన మోటార్ల సాయంతో ఇప్పటికే కోటి లీటర్ల నీటిని తోడేసినప్పటికీ 370 అడుగుల లోతున్న ఈ గనిలో నీటి మట్టం కొంచెం కూడా తగ్గలేదు. దీంతో పక్కనే ఉన్న గనుల నుంచి నీళ్లు వస్తుంటా యన్న అనుమానంతో వాటి నుంచి మరో 2 కోట్ల లీటర్ల నీటిని తోడేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. గతేడాది డిసెంబర్ 13న పక్కనే ఉన్న లైటన్‌నదిలోని నీరు గనిలోకి ఒక్కసారిగా పోటెత్తడంతో 15 మంది లోపల చిక్కుకు పోయారు. తాజాగా సుప్రీంకోర్టు పర్య వేక్షణలో సహాయక చర్యలు సాగుతున్నాయి. మరోవైపు కార్మికుల జాడను గుర్తించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్), గ్రా విటీ అండ్ మాగ్నటిక్ గ్రూప్‌కు చెందిన నిపు ణులు ఆదివారం గని వద్దకు చేరుకున్నారు. వీరికి అదనంగా చెన్నైకు చెందిన నీటిలో ప్రయానించే రిమోట్ కంట్రోల్ వాహనంతో పాటు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ విషయమై సీఎస్ఐఆర్ నిపుణుడు దేవాశిష్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 20 నుంచి గనిలో నీటిని తోడేస్తున్నప్పటికీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమకు అంతుపట్టడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆర్మీ, నేవి, ఎన్డీఆర్ఎఫ్ సహా వేర్వేరు విభాగాలకు చెందిన 200 మంది నిపుణులు, సిబ్బంది కార్మికుల జాడ కనుగొనేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. -
కరెన్సీ నోట్లతో వ్యాధుల వ్యాప్తి
న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూనే ఉంటాయి. వీటిని అనేక సంవత్సరాలు వాడుతూనే ఉంటాం. ఫలితంగా ఆ నోట్లపై బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో కరెన్సీ నోట్లు చర్మ వ్యాధులు, ఉదర సంబంధిత, టీబీ తదితర వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. మన దేశంలోని కరెన్సీ నోట్ల మీద సగటున 70 శాతం ఫంగస్, 9 శాతం బ్యాక్టీరియా, 1 శాతం వైరస్ పేరుకుపోతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) సంస్థలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని వీధి వ్యాపారులు, కిరాణాకొట్లు, క్యాంటీన్లు, హోటళ్లు, హార్డ్‌వేర్, తదితర దుకాణదారుల నుంచి సేకరించిన నోట్లను నిపుణులు పరిశీలించారు. ఈ నోట్లపై స్టాపైలోకోకస్ ఆరియస్, ఎంటెరోకోకస్ సహా మొత్తం 78 రకాల బ్యాక్టీరియాను వారు గుర్తించారు. ఈ నోట్లపై ఇలాంటి హానికారక బ్యాక్టీరియానే కాకుండా, యాంటీబయాటిక్ పదార్థాల నిరోధక జీవులు సైతం ఉన్నాయన్నారు. ఇవన్నీ చర్మ వ్యాధులు, జీర్ణకోశ, క్షయతోపాటు ఇతర అంటువ్యాధుల్ని కలిగిస్తాయని తెలిపారు. ముఖ్యంగా రూ. 10, రూ.20, రూ. 100 నోట్లపైనే ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని ఐజీఐబీ పరిశోధకుడు ఎస్. రామచంద్రన్ వెల్లడించారు. వ్యాధుల వ్యాప్తికి కారణమవడంతోపాటు అనేక కారణాల రీత్యా ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు పేపర్ కరెన్సీని నిషేధించి ప్లాస్టిక్ కరెన్సీని వాడుతున్నాయని చెప్పారు. మన దేశంలో కూడా ప్లాస్టిక్ నోట్ల వాడకంతో ఈ సమస్య నుంచి కొంతవరకు బయటపడొచ్చన్నారు. ప్రస్తుతం కరెన్సీకి బదులుగా ప్లాస్టిక్‌తో తయారైన డెబిట్, క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వాటి వినియోగం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ కరెన్సీ నోట్లను వినియోగిస్తే అనంతరం శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సూచించారు.