![Rs 2000 notes Rs 6691 crore worth still with public](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/1/2000.jpg.webp?itok=EmjIB-Y5)
ఉపసంహరించిన రూ.2000 నోట్లలో ఇప్పటి వరకూ 98.12 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని, ఇంకా రూ.6,691 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. 2023 మే 19న ఆర్బీఐ రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ 2023 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లు ఉండగా 2024 డిసెంబర్ 31న వ్యాపారం ముగిసే సమయానికి రూ.6,691 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ తాజాగా తెలిపింది. 98.12 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది. రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ. 2000 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది.
అన్ని బ్యాంక్ శాఖల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే లేదా మార్చుకునే సదుపాయాన్ని 2023 అక్టోబర్ 7 వరకు ఆర్బీఐ అందుబాటులో ఉంచింది. ఈ సదుపాయం ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో ఇప్పటికీ అందుబాటులో ఉంది. 2023 అక్టోబరు 9 నుండి ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలు రూ. 2000 నోట్లను బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి.
అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా వీటి ద్వారా రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు. లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment