దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి గణనీయంగా తగ్గిపోయింది. ఫిబ్రవరి 9తో ముగిసిన వారానికి చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి 3.7 శాతానికి పడిపోయిందని వార్తా సంస్థ పీటీఐ తాజాగా నివేదించింది. ఏడాది క్రితం ఇది 8.2 శాతంగా ఉండేది. కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ (CiC) అనేది చెలామణిలో ఉన్న నోట్లు, నాణేలను సూచిస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం కారణంగా కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ తగ్గుముఖం పట్టింది. ఆర్బీఐ ప్రకారం.. వాణిజ్య బ్యాంకులు జనవరిలో డిపాజిట్లలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దీనికి కూడా రూ.2,000 కరెన్సీ నోట్ల ఉపసంహరణే కారణమని చెప్పవచ్చు.
ఇక రిజర్వ్ మనీ (RM) వృద్ధి విషయానికి వస్తే ఏడాది క్రితం ఉన్న 11.2 శాతం నుంచి ఈ ఫిబ్రవరి 9 నాటికి 5.8 శాతానికి క్షీణించింది. చలామణిలో ఉన్న కరెన్సీ, ఆర్బీఐలో బ్యాంకుల డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు ఈ రిజర్వ్ మనీలో భాగంగా ఉంటాయి. రిజర్వ్ మనీలో అతిపెద్ద భాగం అయిన కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ వృద్ధి ఏడాది క్రితం నాటి 8.2 శాతం నుంచి 3.7 శాతానికి క్షీణించడం రూ. 2,000 నోట్ల ఉపసంహరణను ప్రతిబింబిస్తోంది.
ఆర్బీఐ 2032 మే 19న రూ. 2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జనవరి 31 నాటికి రూ. 2,000 నోట్లలో దాదాపు 97.5 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. దాదాపు రూ. 8,897 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. 2023 మే 19న నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పుడు వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు.
రూ.2000 నోట్లు ఉన్న వ్యక్తులు, సంస్థలు వాటిని 2023 సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని మొదట్లో ఆర్బీఐ గడువు విధించింది. ఆ తర్వాత గడువు 2023 అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే రూ.2000 నోట్ల డిపాజిట్‌కి వీలుంది. కాగా 2016 నవంబర్‌లో రూ. 1,000, రూ. 500 నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment