ఉపసంహరించిన రూ.2000 నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లలో 97.38 శాతం ఇప్పటికే బ్యాంకులకు చేరాయని, ఇంకా రూ.9,330 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్‌బీఐ సోమవారం వెల్లడించింది.
రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు గతేడాది మే 19న ఆర్బీఐ ప్రకటించింది. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉండగా 2023 డిసెంబర్ 29 నాటికి రూ.9,330 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే 97.38 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరినట్లు పేర్కొంది. ఇప్పటికీ ప్రజల వద్ద రూ. 2,000 నోట్లకు చట్టబద్ధమైన చెల్లుబాటు కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ప్రజలు తమ వద్ద రూ.2 వేల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఎక్కడైనా డిపాజిట్ చేయవచ్చు. మార్చుకోవచ్చు. ఆర్‌బీఐ ఆఫీసులకు రాలేనివారు పోస్టు ద్వారా రూ.2వేల నోట్లను పంపి తమ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు.
మొదట్లో రూ.2 వేల నోట్లను అన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు ఆర్‌బీఐ సమయం ఇచ్చింది. తర్వాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అనంతరం బ్యాంకు శాఖలలో డిపాజిట్, మార్పిడి సేవలు నిలిపేసింది. అక్టోబర్ 9 నుంచి ఆర్‌బీఐ కార్యాలయాలలో మాత్రమే ఈ నోట్లు డిపాజిట్, మార్చుకునే అవకాశం కల్పించింది.
ఆర్‌బీఐ కార్యాలయాలు ఇవే..
రిజర్వ్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 19 ఇష్ష్యూ కార్యాలయాలు ఉన్నాయి. అవి అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం. రూ.2వేల నోట్లను వీటిల్లో ఎక్కడైనా మార్చుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment