
చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకులకు తిరిగి చేరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం వెల్లడించింది. కేవలం రూ.0.24 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
ఆర్బీఐ గత మే నెల 19వ తేదీన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులను కోరింది. తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను వెనక్కి ఇచ్చేసి మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఇందుకు సెస్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధించింది.
ఇదీ చదవండి: Mera Bill Mera Adhikar: ‘జీఎస్టీ లక్కీ డ్రా’ షురూ.. రెడీగా రూ. 30 కోట్లు! అదృష్టం ఎవరిని వరిస్తుందో..
బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆగస్టు 31 నాటికి చలామణి నుంచి వెనక్కి వచ్చిన రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.32 లక్షల కోట్లు అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం నోట్లలో 93 శాతం నోట్లు వెనక్కి రాగా ఇక ప్రజల వద్ద ఉన్న రూ. 2000 నోట్ల విలువ కేవలం రూ. 0.24 లక్షల కోట్లు.