
బ్రిటన్ ఇన్వెస్టర్లకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆహ్వానం
బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్‌తో రౌండ్ టేబుల్ సమావేశం
లండన్: భారత్‌లో వివిధ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి అపార అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. బ్యాంకింగ్ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.
లండన్‌లో జరిగిన భారత్-బ్రిటన్ ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. వివిధ పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలకు చెందిన 60 పైచిలుకు ఇన్వెస్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రకటన ప్రకారం.. సుస్థిర ఆర్థిక వృద్ధి సాధన, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను ఏర్పర్చేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధా న్యం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. నిబంధనల భారాన్ని తగ్గించి, వ్యాపారాలు.. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో విదేశీ బ్యాంకులు మరింతగా విస్తరించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి‘ అని మంత్రి చెప్పారు.

పటిష్టమైన పాలసీల దన్ను..
మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండటం, స్థిరమైన..పటిష్టమైన పాలసీలు అమలవుతుండటం తదితర అంశాల ఊతంతో 2024–2028 మధ్య కాలంలో భారత బీమా మార్కెట్ వార్షికంగా 7.1 శాతం మేర వృద్ధి చెందనున్నట్లు ఆమె వివరించారు. 2032 నాటికి ఆరో అతి పెద్ద ఇన్సూరెన్స్ మార్కెట్‌గా ఎదగనున్నట్లు తెలిపారు.
ఇక టీప్లస్1 సెటిల్మెంట్‌ను 2023లోనే ప్రవేశపెట్టడం ద్వారా ఈ విధానాన్ని అమలు చేసిన అతి కొద్ది బడా సెక్యూరిటీస్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని ఇన్వెస్టర్లకు వివరించారు. 4.6 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో భారత సెక్యూరిటీస్ మార్కెట్ అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్–ఐఎఫ్‌ఎస్‌సీ) గురించి కూడా మంత్రి వివరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
2025 మార్చి నాటికి బ్యాంకులు, బీమా, ఫిన్‌టెక్, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్, షిప్ లీజింగ్ మొదలైన రంగాలకు చెందిన 800 పైచిలుకు సంస్థలు గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు మంత్రి వివరించారు. స్థూల దేశీయోత్పత్తికి డిజిటల్ ఎకానమీ దన్నుగా నిలుస్తున్న తీరును తెలిపారు. ప్రభుత్వ సానుకూల విధానాలు, వినూత్నమైన స్టార్టప్‌ల తోడ్పాటుతో దేశీయంగా ఫిన్‌టెక్ వ్యవస్థ పటిష్టంగా మారిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత అయిదేళ్లలో ఫిన్‌టెక్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. దేశీ యూనికార్న్‌ల సంఖ్యపరంగా అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు సీతారామన్ చెప్పారు.