
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆశ్చర్యపరిచే గణాంకాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు అందించింది. ప్రత్యక్ష పన్నుల్లో 47,674 మంది పన్ను ఎగవేతదారుల జాడ తెలియడం లేదని.. వీరు చెల్లించాల్సిన బకాయిలు రూ.5.91 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.
అదే పరోక్ష పన్నుల్లో 60,853 మంది ఎగవేతదారుల ఆచూకీ లభించడం లేదని.. వీరు రూ.43,525 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఈ వివరాలు తెలియజేశారు. పన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తీసుకున్న చర్యలను సైతం వివరించారు.
వ్యక్తిగత లావాదేవీల సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, 360 డిగ్రీల కోణంలో ప్రొఫైల్‌ను ఫీల్డ్ యూనిట్లకు పంపించి.. పన్ను చెల్లింపుదారులను గుర్తించి, పన్ను వసూలు చర్యలకు వీలు కల్పించినట్టు చెప్పారు. పరోక్ష పన్నుల కేంద్ర మండలి పన్ను ఎగవేతదారుల నుంచి వసూలుకు గాను బ్యాంక్ ఖాతాల స్తంభన వంటి చర్యలు చేపట్టినట్టు తెలిపారు.