సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయి
ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ అశ్వని కుమార్
న్యూఢిల్లీ: రూపాయి బలహీనపడటమనేది దేశీ ఎగుమతులకు ఊతమిచ్చేదే అయినప్పటికీ వాస్తవ పరిస్థితులు సంక్లిష్టంగా ఉంటాయని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ అశ్వని కుమార్ వ్యాఖ్యానించారు. చాలా మటుకు భారతీయ ఎగుమతిదారులు.. ముడివస్తువులు, విడిభాగాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారని ఆయన చెప్పారు.
రూపాయి గణనీయంగా పడిపోతే ముడివస్తువుల వ్యయాలు పెరిగిపోయి సదరు ఎగుమతిదారులపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా కరెన్సీ క్షీణత ప్రయోజనాలు పెద్దగా లభించవని వివరించారు. ‘బలహీన రూపాయి ప్రభావమనేది ఎగుమతిదారులందరిపైనా ఒకే తరహాలో ఉండదు. ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తూ పతనానికి మూలకారణాలను సరిదిద్దడానికి వ్యూహాత్మకమైన, బహుముఖ విధానం అవసరమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు.
ఉదాహరణకు రూపాయి రెండు శాతమే క్షీణించినా, పోటీ దేశాల కరెన్సీలు అంతకన్నా ఎక్కువగా 3–5 శాతం పడిపోతే, గ్లోబల్ మార్కెట్లలో భారత ఎగుమతిదారులు పోటీపడే పరిస్థితి ఉండదని కుమార్ తెలిపారు. రూపాయి పతనం వల్ల ముడి వస్తువుల ధరలు, కరెన్సీ మారకం రేటులో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, విదేశీ రుణాల భారం మొదలైనవన్నీ కూడా పెరిగిపోతాయని ఆయన చెప్పారు.
ఆర్‌బీఐ జోక్యం ఎగుమతులకు ప్రతికూలం
డాలరు బలోపేతం అవుతుండటం వల్ల ఇతర కరెన్సీల్లాగే రూపాయి కూడా పతనమవుతోంది. ఇలాంటప్పుడు రూపాయి మాత్రమే హఠాత్తుగా పతనమైతేనో లేక తీవ్ర ఒడిదుడుకులకు లోనైతేనో తప్ప దాన్ని బలోపేతం చేసేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు. ఒకవేళ జోక్యం చేసుకుంటే భారతీయ ఎగుమతిదార్లకు ప్రతికూలమవుతుంది.
– రఘురామ్ రాజన్, మాజీ గవర్నర్, ఆర్‌బీఐ
రూపాయి అధిక స్థాయిలో ఉంది
రూపాయి విలువ ప్రస్తుతం అధిక స్థాయిలో ఉండటంతో అంతర్జాతీయంగా మన ఎగుమతి సంస్థలు పోటీపడటంపై ప్రతికూల ప్రభావం ఉంటోంది. కాబట్టి ఆర్థిక ఫండమెంటల్స్‌కి తగ్గ స్థాయికి రూపాయిని చేరుకోనివ్వాలి. రూపాయి క్షీణతను కొనసాగనివ్వడం వల్ల ఎగుమతులకు, అలాగే వృద్ధి సాధనకు సహాయకరంగా ఉంటుంది. – దువ్వూరి సుబ్బారావు, మాజీ గవర్నర్, ఆర్‌బీఐ
Comments
Please login to add a commentAdd a comment