వ్యాధుల కాలం | patients hike in government hospital | Sakshi
Sakshi News home page

వ్యాధుల కాలం

Published Tue, Jun 20 2017 10:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

వ్యాధుల కాలం

వ్యాధుల కాలం

– ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
– పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత ప్రధానం
– తాగునీటి కలుషితంపై అప్రమత్తం
– వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి  


వర్షాలు ప్రారంభమయ్యాయి.. వాతావరణంలో మార్పులూ చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి జల్లులకే పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేస్తోంది.  ఇక గ్రామాల్లో పరిస్థితి మరీ ఘోరం. ఈ క్రమంలో దోమలు వ్యాప్తి చెంది రోగాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అనంతపై డెంగీ పంజా విసురుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.  వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ కథనం.
- అనంతపురం మెడికల్‌
 
పరిశుభ్రతే ‘డెంగీ’కి మందు!  
ఇంటిలోను, పరిసరాల్లోనూ పరిశుభ్రత చర్యలు చేపడితే ‘డెంగీ’కి దూరంగా ఉండొచ్చు. ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం, తలనొప్పి, కంటి లోపల నొప్పి వచ్చి కంటి కదలికలు తగ్గడం డెంగీ లక్షణాలు. కండరాలు, కీళ్లనొప్పులు అధికమవుతాయి. వాంతి అయినట్లు అనిపిస్తుంది. నోరు ఎండిపోయి దాహం ఎక్కువ వేస్తుంది. ఈ లక్షణాలు ఉన్న వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చూపించుకుంటే మంచిది. దోమతెరలు తప్పకుండా వాడాలి. శరీరంలోని అన్ని భాగాలను కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలి. చిన్న పిల్లలయితే వారి శరీర భాగాలు పూర్తిగా కప్పివేసేలా చూసుకోవాలి.

నీటి నిల్వ మంచిది కాదు
డెంగీ వ్యాధి కారక క్రిమి ఆర్బోవైరస్‌ జాతికి చెందినది. ఈ వైరస్‌ అతి సూక్ష్మమైనది. ఏయిడిస్‌ ఈజిప్ట్‌ జాతి దోమ నుంచి, రోగగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. ఈ టైగర్‌ దోమ సాధారణంగా పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన తర్వాత ఐదు రోజుల నుంచి 8 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. ఎయిర్‌ కూలర్లు, రిఫ్రిజిరేటర్లలోని డ్రిప్‌ ఫ్యాన్, పూలకుండీల కింద ఉన్న సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని..నీరు నిల్వ చేసే తొట్టెలు, కుండీలు, ఖాళీ డ్రమ్ములు, సన్‌షేడ్స్, బిల్డింగ్స్‌పై నీరు నిలిచిన చోట టైగర్‌ దోమలు గుడ్లు పెట్టి పెరుగుతాయి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నా.. ఆ నీరు వారం పాటు నిల్వ ఉంటే ఈ రకమైన దోమలు వృద్ధి చెందుతాయి.

చిన్నారులకు ‘న్యుమోనియా’ శాపం
వాతావరణంలోని మార్పులతో న్యుమోనియా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే పిల్లలను సాధ్యమైనంత వరకు చల్లని వాతావరణానికి దూరంగా ఉంచాలి. కిటీకీలు, వెంటిలేషన్‌ ఉన్న చోట పడుకోనివొద్దు. వెచ్చని దుస్తులు ధరించాలి. డబ్బా పాలు తాగేవారిలో, రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, కుటుంబ పరంగా ఆస్తమా, అలర్జీ ఉంటే న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

కలుషిత నీటితో ‘అతిసార’
కలుషిత నీరు తాగడం, ఆహార పదార్థాలు తినడం వల్ల అతిసార సోకుతుంది. నిలువ ఉన్న ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. మంచి నీరు సరఫరా చేసే పైపులు పగిలిపోయి అందులో కలుషిత నీరు కలవడం వల్ల ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది.  ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగడం వల్ల అతిసార ప్రబలే అవకాశం ఉంది.  వాంతుల, విరేచనాలు, కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం అతిసార లక్షణాలు. ఈ వ్యాధి రాకముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ప్రధానంగా క్లోరిన్‌ కలిపిన నీరు సరఫరా అవుతోందా? లేదా? పరిశీలించాలి. గ్రామాల్లోని వాటర్‌ ట్యాంకుల్లో సరిగ్గా బ్లీచింగ్‌ అవుతోందా పరిశీలించాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పగిలిన పైపులను మరమ్మతు చేయించుకోవాలి. ఓఆర్‌ఎస్‌ పాకెట్లను నిలువ ఉంచుకోవాలి. ఇంట్లో నీటిని కాచి..చల్లార్చి.. తాగే అలవాటు చేసుకోవాలి

ప్రాథమిక దశలో గుర్తిస్తే ‘మలేరియా’కు చెక్‌
సీజనల్‌గా వచ్చే మలేరియాను ప్రాథమిక దశలోనే గుర్తించి సమీపంలోని ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో పరీక్ష చేయించుకోవాలి. జూన్‌ నుంచి అక్టోబర్‌ మధ్యలో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రోజు విడిచి రోజు జ్వరం రావడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, వణుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టడం, రక్తహీనత వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు వెంటనే వ్యాధి నిర్ధారణ కోసం రక్తపరీక్షలు చేయించుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా దోమకాటుకు గురికాకుండా దోమతెరలు వాడాలి. ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలి. నీటి తొట్టెలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి. కాంపౌండ్‌లో తాగేసిన కొబ్బరి బోండాలు, వాడిన టైర్లు, వాడకంలో లేని రోళ్లు ఉంచకూడదు. ఇంటిపై వాటర్‌ ట్యాంకులకు మూతలు బిగించాలి. సెప్టిక్‌ ట్యాక్‌ గాలిగొట్టాలకు ఇనుప జాలీ బిగించాలి
 
ఇంటికీ ‘చికిత్స’ అవసరం :
రోగాలు ప్రబలడానికి ఇంటిలోపల, పరిసరాలు కూడా ఓ కారణమే. అందుకే వాటిని శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఇంట్లోని పాత్రలన్నీ వాడుకున్న తర్వాత ఎప్పుడూ పొడిగా ఉంచాలి. నీరు నిల్వ  ఉండే పాత్రల్ని వాటితో పని అయిన తర్వాత బోర్లించాలి. కూలర్‌లో నీరు మార్చడం వీలు కానప్పుడు కొన్ని చుక్కల కిరోసిన్‌ వేయాలి. పెరటి, అటక మీద ఉన్న అనవసరమైన పాత్రలన్నీ తీసివేయాలి. ఇళ్లలోని చెత్తను మురుగు కాల్వల్లో వేయకూడదు.  
 
చిన్న పిల్లల పట్ల నిర్లక్ష్యం వద్దు
చిన్నపిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించటం తప్పనిసరి. 100.4 డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం ఉన్నపుడు కాళ్లు, చేతులు నీలం రంగులోకి మారటం, పక్కలు ఎత్తేయటం చేస్తే తప్పనిసరిగా న్యుమోనియా ఉన్నట్లు గుర్తించాలి. చికిత్సలో ఆలస్యం జరిగితే మూర్ఛ వచ్చే అవకాశం ఉంది. జలుబు, దగ్గు ఉంటే తల్లిదండ్రులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయద్దు. వంట చేసే ముందు.. భోజనం వడ్డించే సమయంలో..భోజనం చేసే ముందు..మల విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి.
– డాక్టర్‌ ప్రవీణ్‌దీన్‌కుమార్, చిన్న పిల్లల వైద్యుడు, సర్వజనాస్పత్రి, అనంతపురం

అప్రమత్తంగా ఉన్నాం
వ్యాధుల నియంత్రణకు అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పటికే వైద్యులందరికీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందే. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మందుల కొరత లేదు. అలాంటి పరిస్థితి ఉంటే తక్షణం మా దృష్టికి తీసుకురండి.
- డాక్టర్‌ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement