అనంతపురం సిటీ : జిల్లాలో 144 డెంగీ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 53 కేసులు జిల్లా కేంద్రంలోనే ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 140 హైరిస్క్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. అనంతపురంలోని వినాయకనగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మృతితో మేల్కొన్న వైద్య శాఖ హడావుడిగా రికార్డులు సరిచేసుకునే ప్రయత్నంలో పడింది. ఈ విషయంపై వైద్యాధికారులను ప్రశ్నిస్తే జిల్లాలో ఏ ఒక్కరూ డెంగీతో మృతి చెందలేదని పేర్కొన్నారు. అయితే శుక్రవారం సాయంత్రం జిల్లా మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో 144 డెంగీ కేసులు ఉన్నట్లు తేల్చి చెప్పారు.
హైరిస్క్ కేసులు
జిల్లా వైద్య శాఖ అధికారుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం జిల్లాలో 140 హైరిస్క్ కేసులు ఉన్నాయి. వీటిలో అనంతపురం అర్బన్‌లో 55, ఆత్మకూరులో 11, బుక్కరాయసముద్రంలో ఏడు, రాప్తాడులో ఐదు, కూడేరులో ఐదు, తరిమెల, కనగానపల్లి, ముదిగుబ్బ, కదిరి అర్బన్, బ్రహ్మసముద్రం ప్రాంతాలలో మూడేసి చొప్పున, కుందుర్పి, శెట్టూరు, పరిగి, సోమందేపల్లి ప్రాంతాల్లో రెండేసి చొప్పున, బొమ్మనహళ్, డి.హీరేహాళ్, కళ్యాణదుర్గం అర్బన్, రాయదుర్గం అర్బన్, గోరంట్ల, గుడిబండ, గుట్టూరు, హిందూపురం, కల్లుమర్రి, మడకశిర, రొద్దం, ఆవులదట్ల, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, ఎద్దులపల్లి ప్రాంతాల్లో రెండేసి చొప్పున, దర్శనమల, రామగిరి, తాడిమర్రి, చుక్కలూరు, గార్లదిన్నె, నాగసముద్రం, నార్పల, ఎన్‌పీ కుంట, పెద్దవడుగూరు, వజ్రకరూరు ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున హైరిస్క్ కేసులు ఉన్నట్లు తేలింది.
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ
విష జ్వరాల బారిన పడిన చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రును ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించి స్పష్టత లేకున్నా... ప్రజల బలహీనతను ఆసరా చేసుకున్న ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహిస్తూ తాము సరైన చికిత్స అందిస్తామని సొమ్ము చేసుకుంటున్నాయి. పరిస్థితి విషమించినప్పుడు చేతులెత్తేసి, మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నాయి. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో రోగులను బెంగళూరుకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది.
ఎలీసా పరీక్షలు రెండు చోట్లే
డెంగీ వ్యాధి నిర్ధారణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో మాత్రమే రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి మొదటిది ర్యాపిడ్, రెండోది ఎలీసా టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ టెస్ట్‌లో మూడు రకాలు ఉంటాయి. ఈ టెస్ట్‌లలో పాజిటివ్ వస్తే ఎలీసా పరీక్ష చేస్తారు. ఎలీసా టెస్ట్ చేయాలంటే మెడికల్ కాలేజీ లేదా హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ దోసారెడ్డి సూచిస్తున్నారు.
జిల్లాలో 144 డెంగీ కేసులు
Published Sat, Sep 17 2016 1:16 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement