గురువారం జనగామ ఆస్పత్రిని పరిశీలిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు
జనగామ: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. జనగామలోని జిల్లా ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితిని చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు స్కానింగ్ సేవలు లేక దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రోజువారీ కూలి చేసుకుంటేనే కడుపు నిండే పేదలు కరోనా బారిన పడితే ఆస్పత్రుల్లో ఐసోలేషన్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ఇంట్లో సౌకర్యాల లేమితో పాజిటివ్ రోగులు వేరుగా ఉండాలంటే బాధిత కుటుంబాలు నరకం చూస్తున్నాయని, దీంతో మిగతా వారికి సైతం వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. కరోనాపై కాంగ్రెస్ నేతలు మాట్లాడితే పారాసిటమాల్ సరిపోతుందని, మాస్క్ ఎందుకని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు మాస్క్ లేకుండా ఒక్క బాధితుడినైనా పరామర్శించారా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేసి, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment