
కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో డిప్యూటీ సీఎం భట్టి కరచాలనం
ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నడపలేరు
రాష్ట్రాల హక్కులు హరించేలా యూజీసీ మార్గదర్శకాలు
తిరువనంతపురం విద్యా సమ్మేళనంలో భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉందని, దానిపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం పనికిరాదని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యపై కేంద్రానికి గుత్తాధిపత్యం కట్టబెట్టేందుకే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రాలు తమ సొంత విద్యావిధానాన్ని రూపొందించుకోవడానికి అధికారం ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేరని తేల్చి చెప్పారు. కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో గురువారం నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో భట్టి మాట్లాడారు. ‘యూజీసీ నిబంధనలు మీరు బిల్లు చెల్లించాలి కానీ ఫుడ్ ఆర్డర్ చేయలేరు అన్నట్లుగా ఉన్నాయి.
వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాలి. కీలకమైన వైస్–చాన్స్‌లర్ల నియామకం, ప్రవేశాలపై అధికారం మాత్రం కేంద్రానికి ఇవ్వాలని ముసాయిదాలో ఉంది. వైస్ చాన్స్‌లర్ల నియామకానికి సెర్చ్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం, వైస్ చాన్స్‌లర్ల అర్హతలు మార్చడం ఆందోళనకరం. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలు భవనాలు ప్రారంభించే రిబ్బన్ కటింగ్ అధికారానికి మాత్రమే పరిమితమవుతాయి’ అని పేర్కొన్నారు.
రాష్ట్రాలకు విద్యపై స్వయంప్రతిపత్తి ఉండాలి: స్వయం ప్రతిపత్తి లేకుండా నాణ్యమైన విద్యను ఏ రాష్ట్రమూ అందించలేదని భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై రాష్ట్రాల ఉమ్మడి విజ్ఞప్తిని కేంద్రం తప్పక పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహకారమంటే బలవంతంగా రుద్దడం కాదని చురకలంటించారు. రాష్ట్రాలు ఐక్యంగా గళం విప్పితే ఆ ప్రతిధ్వని ఎంత దూరమైనా చేరుతుందని అన్నారు. తెలంగాణలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భట్టి వివరించారు.
సరైన మార్గాన్ని ఎంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని, సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అంశంపై తదుపరి సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు, కర్ణాటక మంత్రి ఎం.సీ. సుధాకర్ అవారే, తమిళనాడు నుంచి తిరు గోవి చేజియాన్, పంజాబ్ నుంచి సర్దార్ హరోజ్ సింగ్ తోపాటు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment