
విద్యుతుత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందుల నివృత్తికి ఏర్పాటు
కమిటీలో జెన్‌కో డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్‌తోపాటు మరో అధికారి
బీటీపీఎల్ పనులు త్వరగా పూర్తి చేయండి: భట్టి
సాక్షి, హైదరాబాద్: జెన్‌కో పరిధిలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను వెంటనే నివృత్తి చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇందులో జెన్‌కో డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్‌తోపాటు మరో అధికారి ఉంటారని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఈ కమిటీ సదరు సమస్యలను సమీక్షించి తగిన నివేదికను బోర్డుకు సమర్పిస్తుందని, బోర్డు అనుమతితో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తుందన్నారు సకాలంలో సరైన నిర్ణయం తీసుకొని ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవడం ద్వారా విద్యుత్ సంస్థలు నష్టపోకుండా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు.
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీఎల్) పనుల పురోగతిపై జెన్‌కో అధికారులతో ఆదివారం ఆయన ప్రజాభవన్‌లో సమీక్షించారు. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జెన్‌కో డైరెక్టర్లు అజయ్, సచ్చిదానందం, లక్ష్మయ్య, చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాస్‌రావు, రత్నాకర్‌రావు, పీవీ.శ్రీనివాస్, జేవాకుమార్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో భాగంగా బీటీపీఎల్ పనుల పురోగతిపై అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బీహెచ్‌ఈఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పూర్తి చేయాల్సిన ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయించాలని సూచించారు.
నాణ్యత విషయంలో రాజీ వద్దు
యూనిట్–1లో ఉత్పత్తికి సంబంధించి కాలిపోయిన జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల గురించి అధికారులను డిప్యూటీ సీఎం ఆరా తీయగా, విద్యుదుత్పత్తికి ఆటంకం కలగకుండా ఉండేందుకుగాను మరో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కొనుగోలు చేస్తున్నామని, ఇందుకోసం టెండర్లు పిలిచామని అధికారులు వివరించారు. జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు అవసరమైన అదనపు పరికరాలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సూచించారు.
వర్షాకాలంలో బొగ్గు నిల్వ చేయడానికి అవసరమైన షెడ్ నిర్మాణం, సింగరేణి నుంచి భద్రాద్రి ప్లాంట్ వరకు బొగ్గు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్, సిబ్బందికి వసతి గృహ నిర్మాణ పనుల గురించి కూడా డిప్యూటీ సీఎం ఆరా తీశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, అన్ని ప్రమాణాలు పాటించేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రైల్వేలైన్ నిర్మాణం కోసం భూసేకరణ జరుగుతోందని అధికారులు వివరించగా, ఈ రైల్వే లైన్ పనులను సమీక్షించేందుకు ప్రతివారం సమావేశం కావాలని అధికారులు ఆదేశించారు.
బీటీపీఎల్‌లో జరిగే ఎలాంటి ఘటనకైనా చీఫ్ ఇంజనీర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, ప్రతి విషయాన్ని తనతోపాటు సీఎండీ దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని చెప్పారు. పవర్ ప్లాంట్‌లో పనిచేసే అన్‌స్కిల్డ్ కార్మికుల విషయంలో ఐటీడీఏ ప్రాజెక్టును సంప్రదించి స్థానిక గిరిజనులను తీసుకోవాలని సూచించారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్థానిక గిరిజన యువత కోసం బూడిదతో ఇటుకలు తయారుచేసే యూనిట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా గిరిజన యువతకు ఉపాధి కలుగుతుందని చెప్పిన భట్టి... బీటీపీఎల్‌లో త్రీడీ వాక్‌వే మోడల్ తయారు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
విద్యుత్ డిమాండ్‌ను బట్టి ఉద్యోగాల భర్తీ
» త్వరలోనే పదోన్నతుల ఉత్తర్వులు
» టీఈఏఈఏ సమావేశంలో భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ శాఖలో జాబ్ రిక్రూట్‌మెంట్ కేలండర్‌ను అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. అదే విధంగా పదోన్నతులకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం ప్రజాభవన్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఈఏఈఏ) నేతలు భట్టిని కలిశారు. రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జెన్‌కో పరిధిలో 2024, అక్టోబర్‌లో ఏఈల నుంచి ఏడీఈలుగా పదోన్నతులు పొందిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, ట్రాన్స్‌కో, డిస్కం కంపెనీలలో పదోన్నతులు అమలు చేయాలని వారు భట్టికి విజ్ఞప్తి చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన భట్టి పదోన్నతుల ఉత్తర్వులు త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు.
విద్యుత్ సంస్థల్లో ఉద్యోగం సేవా భావంతో కూడినదని, రాష్ట్ర ప్రజలకు అవసరమైన విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పనిచేయాలని కోరారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో టీఈఏఈఏ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బట్టు హరీశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ ఇమ్రాన్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment