పన్ను ఆదా.. భవిష్యత్తుకు పెట్టుబడి! | Deductions in New Tax Regime under Union Budget 2025 | Sakshi
Sakshi News home page

పన్ను ఆదా.. భవిష్యత్తుకు పెట్టుబడి!

Published Mon, Feb 10 2025 4:27 AM | Last Updated on Mon, Feb 10 2025 8:07 AM

Deductions in New Tax Regime under Union Budget 2025

కొత్త విధానంలో భారీగా పన్ను మిగులు

ఈ మొత్తం ఖర్చు చేసేయడం సరికాదు

కొంత మేర పెట్టుబడులకు మళ్లించాలి

తద్వారా త్వరగా ఆర్థిక లక్ష్యాల సాకారం

పాత విధానంలో పెట్టుబడులతోనే పన్ను ఆదా

మనది పొదుపు సమాజం. మన తల్లిదండ్రులు, తాతలు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేసేవారు. భవిష్యత్‌ కోసం వీలైన ప్రతి రూపాయినీ ఆదా చేసేవారు. కానీ, నేటి తరం ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతోంది. సౌకర్యాలు, సుఖాలు, ఆడంబరాలు, ఆనందం కోసం ఖర్చుకు వెనుకాడని ధోరణి పెరిగిపోతోంది. ‘ధనవంతుడు కావాలంటే పేదవారిగా బతకాలి’ అన్నది ఆర్థిక నిపుణులు చెప్పే సూక్తి. పేదవారిగా జీవించాలని చెప్పడం కాదు ఇందులోని అసలు అర్థం.

 ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు పోకూడదన్న సూచన ఇందులో కనిపిస్తుంది. తాజా కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపన్ను రాయితీలను గణనీయంగా పెంచేశారు విత్త మంత్రి. రూ.12.75 లక్షల వరకు కొత్త విధానంలో పన్ను లేకుండా వరాలు కురిపించారు. దీంతో వివిధ తరగతుల వారికి గరిష్టంగా రూ.లక్ష, అంతకుమించి పన్ను రూపంలో ఆదా కానుంది.

ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని ఖర్చు బకెట్‌లో వేసేసుకుని సంబరపడిపోకుండా.. పెట్టుబడులకూ కొంత కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. తద్వారా భవిష్యత్‌ ఆర్థిక లక్ష్యాలకు మరింత బలం చేకూరుతుంది. త్వరగా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోగలరు. పన్ను భారం తప్పించుకునేందుకు కొత్త విధానంలోకి మారిపోయి.. ఇప్పటి వరకు పాత విధానంలో చేస్తున్న పన్ను ఆదా పెట్టుబడులకు మంగళం పాడే తప్పు అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు.  

ఆదాయ స్థాయిలకు అనుగుణంగా కొత్త పన్ను విధానంలో ఆదా అయ్యే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వారికి రూ.83,200, రూ.15 లక్షలు సంపాదించే వారికి రూ.32,500 వరకు తాజా ప్రతిపాదనలతో పన్ను ఆదా కానుంది.  అలాగే, రూ.24 లక్షల సంపాదనాపరులకు రూ.1.14 లక్షలు, రూ.కోటి ఆదాయ వర్గాలకు రూ.1,25,840, రూ.5 కోట్ల ఆదాయం కలిగిన వారికి రూ.1.43 లక్షల వరకు పన్ను మిగులు లభించనుంది. ఈ కొత్త ప్రతిపాదనలు 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. అంటే 2026–27 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న రేట్లే వర్తిస్తాయి. పాత విధానంలో వివిధ సెక్షన్ల కింద పలు రకాల పెట్టుబడులతోపాటు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేలతో కలుపుకుని రూ.8.50 లక్షల ఆదాయంపై పన్ను ఆదాకు అవకాశం ఉంది.  

పెట్టుబడులు ఆపొద్దు.. 
ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక ఉండాలి. జీవితంలో అన్ని ముఖ్య అవసరాలను సాధించే మార్గసూచీగా ఇది ఉంటుంది. ఈ లక్ష్యాలకు పెట్టుబడులే ఆధారం. ఆదాయంలో కనీసం 30 శాతం అయినా పెట్టుబడులకు మళ్లించుకోవాలి. అయితే, జీవిత లక్ష్యాల దృష్టితో కాకుండా పన్ను ఆదా కోసమే పెట్టుబడులను ఆశ్రయించే వేతన జీవులు కూడా ఉన్నారు. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌), ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్‌డీల్లో పెట్టుబడులు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై సెక్షన్‌ 80సీ పరిధిలో (పాత పన్ను వ్యవస్థ) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనికి అదనంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు సెక్షన్‌ 80డీ పరిధిలో పన్ను మినహాయింపులు ఉన్నాయి. 

గృహ రుణం తీసుకుని అసలు చెల్లింపులను సెక్షన్‌ 80సీ పరిధిలో, వడ్డీ చెల్లింపులను సెక్షన్‌ 24 పరిధిలో చూపించుకోవచ్చు. కొత్త పన్ను వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండడంతో, ఇంతకాలం పన్ను ఆదా దృష్టితో కొనసాగించిన ఈ పెట్టుబడులను నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. ఈ తప్పు అస్సలు చేయొద్దు. కొత్త పన్ను విధానం సూటిగా, సరళంగా ఉంటుంది. పన్నుల గందరగోళం వద్దనుకునే వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. కానీ, అదే సమయంలో పాత పన్ను విధానం ప్రోత్సహిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, మదుపులను విస్మరించకుండా, వాటిని కొనసాగించడం ద్వారానే గరిష్ట ప్రయోజాన్ని పొందగలరు. పన్ను ఆదా కోసం ఉద్దేశించినవి కాకపోయినా, మెరుగైన ఇతర సాధనాల్లో అయి నా పెట్టుబడులు కొనసాగించుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు.  

ఈక్విటీ ఫండ్స్‌ 
ఈక్విటీ ఫండ్స్‌లో ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఒక విభాగం. ఇందులో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. దీంతో ఇతర ఈక్విటీ ఫండ్స్‌ అంత అమ్మకాల ఒత్తిడి వీటిల్లో ఉండదు. కనుక స్థిరత్వం ఎక్కువ. మల్టీక్యాప్‌ (ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్‌ చేయగలదు) విధానంతో పెట్టుబడులు పెడుతుంటుంది. పదేళ్ల కాలంలో 12–18 శాతం మధ్య, ఐదేళ్లలో 13–27 శాతం మధ్య రాబడులు ఈ పథకాల్లో గమనించొచ్చు. కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే ఇన్వెస్ట్‌ చేయాలని లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్, ఫ్లెక్సీక్యాప్, ఇండెక్స్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, బీమా పథకాలకు పన్ను ఆదాకు మించి ప్రయోజనాలను ఇచ్చే సామర్థ్యం ఉన్నట్టు సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ పార్ట్‌నర్‌ కునాల్‌ సవాని పేర్కొన్నారు. కొత్త విధానంలోకి వెళ్లినా కానీ, భవిష్యత్‌ కోసం ఉద్దేశించిన ఈ పెట్టుబడులను నిలిపివేయొద్దని సూచించారు.  

లైఫ్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌  
జీవిత బీమా (టర్మ్, ఎండోమెంట్‌) పాలసీల ప్రీమియం చెల్లింపులపై సెక్షన్‌ 80సీ కింద పాత వ్యవస్థలో పన్ను మిననహాయింపు ఉంది. వార్షిక ప్రీమియం మొత్తం కవరేజీలో (సమ్‌ అష్యూర్డ్‌/రక్షణ) 10 శాతం మించకపోతే, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను లేదు. ఈ పన్ను ప్రయోజనం కోసం ఎండోమెంట్, టర్మ్‌ పాలసీలను కొందరు తీసుకుంటున్నారు. 

ఏ పన్ను విధానంలో ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా, కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన ప్రతి వ్యక్తీ తన పేరిట తగినంత బీమా కవరేజీతో అచ్చమైన టర్మ్‌ పాలసీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తన వార్షిక ఆదాయానికి సుమారుగా 20 రెట్ల మేర సమ్‌ అష్యూర్డ్‌ ఉండేలా చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆర్జించే వ్యక్తి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే, వచ్చే బీమా పరిహారంతో అతనిపై ఆధారపడిన కుటుంబం సాఫీగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.  నేడు జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. కనుక ప్రతి కుటుంబానికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. 

ఇది కేవలం పన్ను ఆదా కోసం ఉద్దేశించిన సాధనం కానే కాదు. పెద్ద ప్రమాదం లేదా కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ఆస్పత్రి పాలైతే, హెల్త్‌ కవరేజీ లేని పరిస్థితుల్లో అప్పటి వరకు కూడబెట్టినదంతా కరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం వల్ల ఆర్థికంగా సమస్యల్లోకి వెళ్లకూడదని కోరుకుంటే, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. ఒక కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10లక్షలు ఉండేలా చూసుకోవాలి. దీనిపై అదనపు కవరేజీని సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ రూపంలో తీసుకోవచ్చు. ఉద్యోగం చేసే సంస్థ తరఫున గ్రూప్‌ హెల్త్‌ కవరేజీ ఉన్న వారు సైతం విడిగా తమ కుటుంబానికి ఒక హెల్త్‌ ప్లాన్‌ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణంతో కంపెనీని వీడినా, ఉద్యోగం మానేసినా కవరేజీ కొనసాగుతుంది.

ఖర్చు కంటే పెట్టుబడి ముఖ్యం 
చాలా మంది తమ ఆదాయంలో ఖర్చులుపోను మిగులుంటే అప్పుడు పెట్టుబడులకు మళ్లిస్తుంటారు. కానీ, ముందు పెట్టుబడులకు కేటాయింపులు చేసిన తర్వాతే ఖర్చులకు వెళ్లాలన్నది నిపుణుల సూచన. కొత్త పన్ను వ్యవస్థలో మిగిలే నిధులను ఎన్‌పీఎస్‌ తదితర పెన్షన్‌ ప్లాన్లకు కేటాయించుకోవాలని సింఘానియా అండ్‌ కో పార్ట్‌నర్‌ బన్సాల్‌ సూచించారు. దీనివల్ల గణనీయమైన రిటైర్మెంట్‌ ఫండ్‌ ఏర్పడుతుందన్నారు. చాలా మంది రిటైర్మెంట్‌ లక్ష్యాన్ని పెద్దగా పట్టించుకోరు. 60 ఏళ్ల తర్వాత సంగతి కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ, ఉద్యోగంలో చేరిన నాటి నుంచే రిటైర్మెంట్‌ తర్వాతి జీవితం కోసం పెట్టుబడి చేసుకుంటూ వెళ్లడం ద్వారా స్వల్ప మొత్తమే పెద్ద నిధిగా మారుతుందన్నది తెలుసుకోవాలి.

కొత్త–పాత పన్ను వ్యవస్థలు 
ఏ విధానంలో కొనసాగాలన్నది తమ ఆదాయం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. హెచ్‌ఆర్‌ఏ, గృహ రుణ ప్రయోజనాలు, ఎల్‌టీసీ, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, ఎన్‌పీఎస్‌ పెట్టుబడులతో రూ.8 లక్షలు, స్టాండర్డ్‌ డిడక్షన్‌తో రూ.50 వేలు మొత్తంగా రూ.8.50 లక్షల వరకు పాత పన్ను వ్యవస్థలో మినహాయింపులున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే రూ.24 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి పాత వ్యవస్థ అనుకూలమని నిమిత్‌ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు నితేష్‌ బుద్దదేవ్‌ తెలిపారు. ఒకవేళ తమ పెట్టుబడులు ఈ స్థాయిలో లేకపోతే కొత్త విధానాన్ని పరిశీలించొచ్చు. రూ.24 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి కొత్త విధానమే అనుకూలం.  

ఎన్‌పీఎస్‌ 
రిటైర్మెంట్‌ ఫండ్‌ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాల్లో ఎన్‌పీఎస్‌ ఒకటి. అతి తక్కువ నిర్వహణ చార్జీలతోపాటు, పెట్టుబడిపైనా, రాబడి ఉపసంహరణపైనా పన్ను ప్రయోజనాలున్నాయి. ఇందులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసి, ఆ మొత్తంపై సెక్షన్‌ 80సీసీఈ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్‌ 80సీ గరిష్ట ప్రయోజనం కిందకే ఇది కూడా వర్తిస్తుంది. దీనికి అదనంగా సెక్షన్‌ 80సీసీడీ (1బి) కింద ఎన్‌పీఎస్‌ టైర్‌–1 ఖాతాలో మరో రూ.50,000 పెట్టుబడికి సైతం పన్ను మినహాయింపు ఉంది. 

ఈ సెక్షన్‌ కిందే ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకంలో పెట్టుబడికీ పన్ను ఆదా ప్రయోజనాన్ని 2025–26లో బడ్జెట్‌లో కల్పించారు. తమ పేరు మీద లేదా తమ కుమార్తె లేదా కుమారుల పేరిట ఎన్‌పీఎస్‌ వాత్సల్యలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. సెక్షన్‌ 80సీసీడీ (1బి) కింద గరిష్ట ప్రయోజనం రూ.50వేలకు పరిమితం. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకంలో సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మరో 40 శాతం మొత్తానికి పింఛను ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. 

కార్పొరేట్‌ కంపెనీ ఉద్యోగి ఎన్‌పీఎస్‌ ఖాతాలో చేసే జమలపైనా పాత విధానంలో పన్ను ప్రయోజనాలున్నాయి. సెక్షన్‌ 80సీసీడీ (2) కింద మూలవేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని ఉద్యోగి తరఫున యాజమాన్యం ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఉద్యోగి తరఫున ప్రభుత్వమే జమ చేస్తుంటే అప్పుడు 14 శాతంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్‌ 80సీసీడీ (2) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పించారు. కొత్త విధానంలో ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్‌పీఎస్‌ టైర్‌–1లో జమ చేస్తే (మూలవేతనం, డీఏలో 10 శాతం / వచ్చే ఏప్రిల్‌ నుంచి 14 శాతం) ఆ మేరకు పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.


పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన
ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ హామీతో కూడిన డెట్‌ పెట్టుబడి సాధనాలు. వీటిల్లో రిస్క్‌ సున్నా. ఈ రెండు సాధనాల్లో ఏటా చేసే పెట్టుబడులను పాత పన్ను వ్యవస్థలోని సెక్షన్‌ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తంపై పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో పన్ను లేదు. పన్ను ప్రయోజనాలున్న ఈ మెరుగైన పథకాలు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిందే. తమ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం ఈ సాధనాలకు కేటాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌కు మళ్లించుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడికి కొంత రక్షణతోపాటు దీర్ఘకాలంలో అధిక రాబడిని సొంతం చేసుకోగలరు. 

పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో పెట్టుబడులకు వర్తించే వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ వీటి రేట్లను ప్రకటిస్తుంటుంది. పీపీఎఫ్‌లో ప్రస్తుతం 7.10 శాతం రేటు అమల్లో ఉంది. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. అనంతరం మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.2 శాతం రేటు అమల్లో ఉంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని ప్రారంభించుకోవచ్చు. బాలికల వయసు 10 ఏళ్లు మించకూడదు. 

ఆలోపు వయసున్న వారి పేరుతో ఖాతా తెరిచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కుమార్తెలకు 21 ఏళ్లు నిండగానే పథకం ముగిసిపోతుంది. లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత, 21 ఏళ్లు రాక ముందే వారికి వివాహం నిశ్చయమైతే అప్పుడు ఈ పథకం నుంచి వైదొలగొచ్చు. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు అనుకూలమేనని వేద్‌ జైన్‌ అండ్‌ అసోసియేట్స్‌ పార్ట్‌నర్‌ అంకిత్‌ జైన్‌ సూచించారు. ఎందుకంటే ఈ రెండు పథకాల్లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనం కొత్త వ్యవస్థ కింద లేకపోయినా కానీ, వడ్డీ రాబడికి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉన్నట్టు తెలిపారు. కుమార్తెల వివాహం, ఉన్నత విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement