ఈ మధ్య మన కాలమ్‌లో ఒక అయ్యర్ కుటుంబం చేసిన ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ వారం ఉమ్మడి/సమిష్టి కుటుంబం ద్వారా ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సౌలభ్యం కోసం మనం ‘‘ఉమ్మడి కుటుంబం’’ అని ప్రస్తావిద్దాం.
ఆదాయపు పన్ను చట్టంలో ఇలాంటి కుటుంబానికి ఒక నిర్వచనం చెప్పారు. అంతే కాదు. ఒక ప్రత్యేకమైన స్టేటస్ కూడా అంటకట్టారు. స్వంతం, ఉమ్మడి కుటుంబం, భాగస్వామ్య సంస్థ, కంపెనీ, వ్యక్తుల కలయిక, ప్రాంతీయ సంస్థలు .. ఇలాంటి ప్రతి ఒక్కరికి ఒక స్టేటస్. ఆ స్టేటస్‌ని బట్టి ఆదాయం శ్లాబులు, పన్ను రేట్లు ఉంటాయి. ఉదాహరణకు స్వంతం, ఉమ్మడి కుటుంబాలకు బేసిక్ లిమిట్ రూ. 2,50,000. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలకు బేసిక్ లిమిట్‌లు లేవు. స్వంతానికి, ఉమ్మడి కుటుంబాలకు 10 శాతం, 20 శాతం, 30 శాతం రేట్లు. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలకు ఒకే రేటు.
గతంలో ఉమ్మడి కుటుంబాలు బహు సంఖ్యలో ఉండేవి. అవి కుటుంబపరంగానే వ్యాపారం చేసేవి. ఆదాయం ఉండేది. అందుకని ప్రత్యేక హోదా ఉంది. ఇది హిందువులకే వర్తిస్తుంది. ఆస్తిపాస్తులు పూర్వీకుల నుండి సంక్రమించాలి. కుటుంబంలో హక్కు సహజంగా ఏర్పడుతుంది. ఉదాహరణకు పుట్టుక, పెళ్లి వంటివి. అలాంటి కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఉంటారు. వారినే ‘‘కర్త’’ అని వ్యవహరిస్తారు. ప్రత్యేకంగా దరఖాస్తు పెట్టి ‘‘పాన్’’ను పొందాలి. దరఖాస్తులో కుటుంబం ఎప్పుడు ఏర్పడింది.. కర్త పేరు.. అడ్రస్సు, కుటుంబ సభ్యుల పేర్లు తదితర వివరాలు ఇవ్వాలి. ఆ రోజు నుండి స్టేటస్ అమల్లోకి వస్తుంది.
కర్త అంటే ఎవరు?
ఉమ్మడి కుటుంబం బాగోగులు చూసే వ్యక్తిని కర్త అంటారు. కుటుంబపు వ్యవహారాలను చూసే వ్యక్తే కర్త. సీనియర్ కుటుంబీకులు .. మగవారే కర్తలు. నో పార్ట్‌నర్స్. ఆడవాళ్లు సభ్యులే. అందరికీ వారి వారి వాటా పొందే హక్కుంది. ఆస్తిలోనూ.. ఆదాయంలోనూ. దీనికి సంబంధించి ఎంతో పెద్ద న్యాయ సమీక్ష ఉంటుంది. ఎన్నో కోర్టు జడ్జిమెంట్లు, వివరణలు, భాష్యాలు, వ్యాఖ్యలు, వాదోపవాదాలు ఉన్నాయి. వాటన్నింటిని కాస్త పక్కన పెడితే..
సెపరేటు స్టేటస్ కాబట్టి కుటుంబానికి బేసిక్ లిమిట్ రూ. 2,50,000 వర్తిస్తుంది. ఇది కాకుండా కుటుంబీకులందరికీ వ్యక్తిగతంగా, స్వంతంగా విడిగా, అదనంగా బేసిక్ లిమిట్ వర్తిస్తుంది. అన్ని మినహాయింపులు, తగ్గింపులు ప్రత్యేకం. 80సి, 80డి మొదలైనవి అదనం. ప్రత్యేకమైన డీమ్యాట్ అకౌంటుతో షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు.. వాటిపై వడ్డీ మీద ట్యాక్స్‌లు, టీడీఎస్‌లు వేరు. మూలధన లాభాలు వేరు .. వ్యాపారం, వృత్తిగత లాభాలు వేరుగా ఉంటాయి.
ఏయే ఆదాయాలు ఉండవచ్చు
►ఇంటి మీద అద్దె/ఆదాయం
►ఇతర ఆస్తుల మీద ఆదాయం
►మూలధన లాభాలు
►వ్యాపారం/ వృత్తుల మీద ఆదాయం
►ఇతర ఆదాయాలు
Comments
Please login to add a commentAdd a comment